సమున్నత గిరి శిఖరాలు.. కనుచూపుమేరా పచ్చని తివాచీలు పరిచినట్టు అగుపించే మనోహరమైన లోయలు.. గిరుల పాదాలకు మువ్వల పట్టీలు చుట్టినట్టు గలగలలాడే సెలయేళ్లు.. వనకన్యల సిగల్లో గుత్తులుగా అమరినట్టుండే అడవి పూల మాలికలు.. మైదాన ప్రాంతం నుంచి ప్రయాణించి, మలుపుమలుపూ దాటుతూ ఎత్తుకు పోయే కొద్దీ కనిపించే అందం అద్భుతం.
సముద్రమట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉన్న లంబసింగి వెళుతున్నకొద్దీ తిప్పుకోలేనంత శోభాయమానమైన సొగసు చూపరుల కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ దారిలో ప్రయాణిస్తున్నప్పుడు కనిపించే లోయలు కశ్మీరాన్ని తలపిస్తాయంటే అతిశయోక్తి కాదు. లంబసింగిని దత్తత తీసుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో ఈ ప్రాంతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
చింతపల్లి: చింతపల్లి మండలంలోని ఈ గూడేంలో ఏళ్లతరబడి సుమారు మూడు వందల పీటీజీ కుటుంబాలు నివసిస్తున్నాయి. రోడ్డు కిరువైపులా లోయల మధ్య ప్రయాణం మనస్సును కొత్తలోకాల్లోకి తీసుకు వెళ్తోంది. ఇక్కడికి వస్తున్న సందర్శకులకు లంబసింగి అందాలు కట్టిపడేస్తున్నాయి. దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మెండుగా అవకాశాలున్నాయి.
ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాల గ్రామాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మన్యంలో కశ్మీర్ వాతావరణం తలపించే లంబసింగిని దత్తత తీసుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో ఈ ప్రాంతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇదేమాట గతంలోనే అప్పటి మంత్రి పసుపులేటి బాలరాజు ప్రకటించారు. ఇక్కడ సీతాకోక చిలుకల పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఆచరణకు నోచుకోలేదు.
తాజాగా మంత్రి గంటా నోట అదేమాటతో మరోసారి పర్యాటక హంగులపై ఆశలు కలుగుతున్నాయి. కశ్మీరు వాతావరణం ఉండే లంబసింగి ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉంంది. ఏజెన్సీ ముఖద్వారమైన డౌనూరు నుంచి సుమారు 20 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే లంబసింగి వస్తుంది. ఈ మార్గమంతటా కొండలు, దట్టమైన అడవులు ఉన్నాయి.
ఎన్నో మలుపులు తిరుగుతూ సాగే ఈ మార్గం ప్రయాణికులకు వింత అనుభూతి కలిగిస్తుంది. శీతాకాలంలో ఎర్రగా విరగ్గాసే కాఫీ తోటలు, పసుపు ఆరబోయినట్లు ఉండే వలిసెపూల తోటలు పర్యాటకుల మనస్సులను దోచుకుంటాయి. వేసవిలో కూడా లంబసింగి ప్రాంతంలో చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఉదయం 10 గంటల వరకు దట్టంగా కమ్ముకునే పొగమంచు ప్రకృతి ప్రియుల మనస్సులను దోచుకుంటాయి. మంచు తెరలను చీల్చుకుంటూ వచ్చే సూర్యకాంతి పరవశింపజేస్తుంది. తాజంగి రిజర్వాయర్, పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
రిజర్వాయర్‌లో ఇటీవల ప్రైవేటు వ్యక్తులు బోటు షికారును కూడా ఏర్పాటు చేశారు. దట్టమైన అడవులు, అద్భుతమైన అనుభూతులను పంచే ఈ ప్రాంతంలో ఇటీవల బోడకొండమ్మ ఆలయానికి సమీపంలో ఒక అద్భుతమైన జలపాతం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఇక్కడ అందాలను తిలకించేందుకు భారీగా తరలి వస్తున్నారు.
అయితే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నంలో బస చేసి ఇక్కడికి రావడం అసౌకర్యంగా ఉంటోంది. లంబసింగిలో పర్యాటకుల బసకు అనువైన వసతులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈమేరకు గతంలోనే పర్యాటకశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాంత అభివృద్ధికి రూ.3 కోట్లు నిధులు కూడా కేటాయించినట్లు ప్రకటించారు.
అవేవీ ఆచరణకు నోచుకోలేదు. ప్రైవేటు వ్యక్తులు ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. స్టాళ్లు, పర్యాటకులు బస చేసేందుకు అవసరమైన వసతులు కల్పించేందుకు స్థానిక గిరిజనుల నుంచి భూములను లీజుకు తీసుకుంటున్నారు. ఈ దశలో మంత్రి గంటా ప్రకటన ఈ ప్రాంత అభివృద్ధిపై మరిన్ని ఆశలు రేకెత్తించాయి. ఆయన హమీలు ఎంత వరకు అమలవుతాయో వేచి చూడాల్సిందే.
ఆంధ్ర కశ్మీర్ లంబసింగి
Published Sun, Jan 25 2015 1:13 PM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM
Advertisement
Advertisement