దేవుడి మాన్యం.. కబ్జాల మయం
- ఆక్రమణల బారిన 206 ఎకరాలు
- తీర్పులు అనుకూలంగా వచ్చినా స్వాధీనం చేసుకోలేకపోతున్న దేవాదాయ శాఖ
- ప్రత్యర్థులకు ప్రజాప్రతినిధుల అండ
ఏలూరు(ఆర్‌ఆర్ పేట) : జిల్లాలో 41 ఆలయాలకు సంబంధించిన 206 ఎకరాలు భూమి ఆక్రమణలకు గురైనట్టు దేవా దాయ శాఖ గుర్తించింది. జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడెం రామాలయానికి చెందిన 42 ఎకరాలు, ఏలూరు భగవత్ ప్రార్థనా సమాజానికి చెందిన 13 ఎకరాలు, తాడేపల్లిగూడెం తాళ్లముదునూరుపాడు బాలవెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 13 ఎకరాలు, చివటంలో ఏకాంబరేశ్వరస్వామి ఆలయానికి చెంది న 6ఎకరాలు, ఏలూరు మార్కండేయస్వామి ఆలయానికి చెందిన 1.10 ఎకరాలు పెద్ద విస్తీర్ణం కలిగినవి. చిన్నా చితకా కలిపి మొత్తంగా 206 ఎకరాల భూమి ఆక్రమణలోనే ఉంది.
కోర్టు ఉత్తర్వులిచ్చినా ..
ఆక్రమణలో ఉన్న దేవుడి మాన్యాలను స్వాధీనం చేసుకోవటానికిదేవాదాయ శాఖ కోర్టుల్లో కేసు లు దాఖలు చేసింది. తీర్పు దేవాదాయ శాఖకు అనుకూలంగా వచ్చిన సందర్భాల్లోనూ ఆయా భూములను స్వాధీనం చేసుకోవడంలో ఆ శాఖ అధికారులు విఫలమౌతున్నారు. కోర్డు ఉత్తర్వు లు వచ్చిన ఆలయాల భూములను స్వాధీనం చేసుకోవటానికి వెళ్లే అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులో, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులో జోక్యం చేసుకుని వాటిని స్వాధీనం చేసుకోకుండా అటంకం కలిగిస్తున్నారు.
ఇప్పటి వరకూ జిల్లాలో 10 ఆలయాలు, సంస్థలకు చెందిన సుమారు 30 ఎకరాల భూమికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా వాటిని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోలేక పోయారు. సాధారణంగా కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన భూముల విషయంలో ప్రైవేటు వ్యక్తులకు సైతం పోలీసులు రక్షణ కల్పించి భూములను స్వాధీనం చేసుకోవడంలో సహకరి స్తారు. కానీ దేవాదాయ శాఖ భూముల విషయంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతిని ధుల ప్రమేయంతో పోలీసులు కూడా వాటిని స్వాధీనం చేసుకోవడంలో సహకరించడం లేదు. గత ఏడాది ఏలూరులోని కంది అయ్యన్న సత్రం స్థలాన్ని స్వాధీనం చేసుకోవటానికి వెళ్లిన దేవాదాయ శాఖ అధికారులను స్థానికులు అడ్డగించడంతో పోలీసుల సహాయం కోరారు. అక్కడికి వచ్చిన పోలీసులు కూడా ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో సహకరించలేదు.
మంత్రి ఈ జిల్లా వారైనా..
జిల్లాకు చెందిన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో జిల్లాలో ఆక్రమణలో ఉన్న దేవాదాయ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుందనుకున్నారంతా. ఆయన బాధ్యతలు స్వీకరించి ఏడాది దాటిునా ఇప్పటికీ ఒక్క భూమిని కూడా స్వాధీనం చేసుకోలేకపోవడంపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు.