- మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
- ఆర్టినెన్స్‌లపై వినూత్న నిరసన
- ప్రకాశం బ్యారేజీపై కూరగాయలు పంచిన వైనం
- రాస్తారోకో, 166 జీవో కాపీ దహనం
తాడేపల్లి : భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆర్కే నేతృత్వంలో సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద శుక్రవారం రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆర్కే కూరగాయలు పంచి తన నిసరన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట పొలాల నుంచి స్వచ్ఛందంగా తెచ్చిన కూరగాయలను భారీ స్థాయిలో పంచిపెట్టారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. 166 జీవో కాపీని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసే విధంగా భూ సమీకరణ, భూ సేకరణ ప్రక్రియలు నిర్వహిస్తోందని విమర్శించారు. రైతాంగమే లేకుండా చేసేందుకు చట్టరూపం దాల్చని ఆర్డినెన్స్‌తో 166 జీవోను చంద్రబాబు తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు లక్షా 66 వేల జీవోలు తెచ్చినా, తాము భయపడబోమని స్పష్టం చేశారు.
భూసేకరణను ప్రతిఘటిస్తాం
బహుళ పంటలు పండే భూములను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోబోనివ్వమని, తీవ్రంగా ప్రతిఘటించి తీరతామని పేర్కొన్నారు. ఒకే ప్రాంతంలో రెండు చట్టాలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భూసేకరణను విరమించాల్సిందేనని హెచ్చరించారు. రైతులు, వ్యవసాయ కూలీలను పూర్తిగా నష్ట పరిచే చంద్రబాబు ఎత్తుగడలను ముందుకు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. కేంద్రం హడావుడిగా తెచ్చిన ఆర్డినెన్స్‌ను చంద్రబాబు ముందుగా ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నారని, హైకోర్టులో దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిత్యం అన్నదాతలకు అండగా ఉంటామని ఆర్కే స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకుడు జక్కిరెడ్డి ప్రభాకర్, మంగళగిరి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మొసలి పకీరయ్య, సీపీఎం నేతలు, ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం రైతులు, రైతుకూలీలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అన్నదాతకు అండగా ఉంటాం
Published Sat, May 16 2015 4:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement