సోలార్‌ వెలుగులు | Land Collecting For Solar Power Panels in YSR Kadapa | Sakshi
Sakshi News home page

సోలార్‌ వెలుగులు

Published Mon, Mar 9 2020 1:47 PM | Last Updated on Mon, Mar 9 2020 1:47 PM

Land Collecting For Solar Power Panels in YSR Kadapa - Sakshi

విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్‌ ప్యానల్స్‌

జిల్లాలో సోలార్‌ వెలుగులను అందించేందుకు ప్రభుత్వం పథక రచన చేసింది..సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేసి స్థానికంగానే వ్యవసాయ పంపుసెట్లకు వినియోగించాలని సర్కార్‌ భావిస్తోంది.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో అవసరమైన భూమిని సేకరిస్తున్నారు. సోలార్‌ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నారు.ఇక్కడ ఉత్పత్తి చేసిన పవర్‌ను కూడా అవసరమైన మేరకు వినియోగించి మిగిలిన పవర్‌ను విద్యుత్‌ సంస్దలకు అందిచాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచిస్తోంది.

సాక్షి కడప : ప్రభుత్వం పవర్‌కు వినియోగించే సొమ్ములను మిగులుబాటుగా మార్చుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి పవర్‌ను కొనుగోలు చేస్తోంది. అయితే కొనుగోలు కాకుండా సొంతంగా ప్లాంట్లను పెట్టి తద్వారా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ను వ్యవసాయ పంపుసెట్లకు మళ్లించడం ద్వారా ఖర్చును తగ్గించుకోవడంతోపాటు అదనంగా కొంత మిగులుబాటు ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా సూర్యరశ్మితో ప్రత్యేక కాంతులు విరజిమ్మేలా అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోలార్‌ వెలుగులను విద్యా సంస్థలతోపాటు పరిశ్రమలు, రైతుల పంపుసెట్లకు అందిస్తున్నారు. సబ్సిడీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సూర్యకాంతితో....తక్కువ ఖర్చుతో ఎక్కువ పవర్‌ను అందించేలా నెడ్‌క్యాప్‌ సంస్థ ముందుకు వెళుతోంది. సోలార్‌ పవర్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన వసతులున్న ప్రాంతాలను అన్వేషిస్తున్నారు.

జిల్లాలో భూముల భూసేకరణ
 జిల్లాలోని నెడ్‌క్యాప్‌ సంస్థ ద్వారా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు అవసరమైన భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాలోని పెండ్లిమర్రి, మైలవరం, బ్రహ్మంగారిమఠం, గండికోట, పులివెందుల ఇలా అనేక ప్రాంతాల్లో భూములను పరిశీలించారు. ప్రస్తుతానికి పెండ్లిమర్రి మండలంలోని పెద్దదాసరిపల్లె ప్రాంతంలో సుమారు 10 వేల ఎకరాలను సర్వే చేసి సిద్ధం చేశారు. అంతేకాకుండా మైలవరంలో మండలంలోని కంబాలదిన్నె పరిసర ప్రాంతాల్లోని రెండు, మూడు గ్రామాలను కలుపుకుని దాదాపు 4 వేల ఎకరాలు సర్వే చేసి సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రాంతంలోనే మరో ఆరువేల ఎకరాల భూమిని కూడా పరిశీలిస్తున్నారు. సోలార్‌ ప్రాజెక్టుకు సంబం«ధించి పరిస్థితి అనుకూలంగా ఉండడంతో అన్ని రికార్డులను పరిశీలించి అనుమతులకు సిద్ధం చేస్తున్నారు.

జిల్లాలో 2800 మెగా వాట్ల ఉత్పత్తికి చర్యలు
జిల్లాలో ప్రస్తుతానికి 20 వేల ఎకరాల వరకు భూమి సోలార్‌ పవర్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే నెడ్‌క్యాప్‌ యంత్రాంగంతోపాటు రెవెన్యూ, ఇతర అధికారులు భూములపై పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేయాలని సంకల్పించిన నేపథ్యంలో రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాల్లో కూడా అనువైన భూముల కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం సేకరించిన భూమిని పరిశీలిస్తే దాదాపు 2800 నుంచి 3000 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేసేందుకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కో మెగావాట్‌కు దాదాపు రూ. 4 నుంచి 4.50 కోట్ల మేర ఖర్చు వస్తుందని అధికారులద్వారా తెలుస్తోంది. ఏది ఏమైనా గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా సోలార్‌ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.

సోలార్‌ పవర్‌ ద్వారా వ్యవసాయ పంపుసెట్లకు వినియోగం
 రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ సంస్థల ద్వారా ప్రభుత్వం పవర్‌ను కొనుగోలు చేసి వ్యవసాయ పంపుసెట్లకు అందిస్తోంది. అయితే భారీ వ్యయం అవుతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించి.....ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తే ఖర్చు తగ్గుతుందని భావించి మందుకె ళుతున్నారు.వ్యవసాయ పంపుసెట్లపై ఐదేళ్లకు అవుతున్న ఖర్చును ప్రభుత్వం సోలార్‌పై పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఏది ఏమైనా పెద్ద ఎత్తున సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అడుగులు ముందుకు పడుతుండడం హర్షించదగ్గ పరిణామం.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం
జిల్లాలో సోలార్‌ వెలుగులకు సంబంధించి అవసరమైన భూములను పరిశీలించడంతోపాటు సేకరిస్తున్నాం.పెండ్లిమర్రి, మైలవరం ప్రాంతాల్లో 20 వేల ఎకరాల వరకు భూమి ఉంది. సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి అనువైన పరిస్థితులను పరిశీలిస్తున్నాం. రానున్న కాలంలో సోలార్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా ఎక్కడికక్కడ సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేసి వ్యవసాయ పంపుసెట్లకు వినియోగించాలని ఆలోచిస్తోంది.దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– ఎం.కోదండరాం, నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement