
మీ పని మీది.. మా పని మాది..
ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. అది చెరువైనా... ప్రభుత్వ స్థలమైనా... ఏమాత్రం వెనుకాడటంలేదు. అధికారం వారికి వరంగా మారింది. అధికారులను సైతం ఎలాగైనా కట్టడి చేయొచ్చన్న ధైర్యం పెరిగింది. స్థలాలకు ప్రస్తుతం పలుకుతున్న ధర వారిని అక్రమాలకు పాల్పడేలా చేస్తోంది. ఏదో రకంగా భూమిని కొట్టేసి... దానిని అమ్ముకుని తక్కువ వ్యవధిలో కోట్లాదిరూపాయలు ఆర్జించే ఈ వ్యవహారమే వారికి ఉత్తమంగా తోస్తోంది. కొత్తవలస మండలం మంగళపాలెం పీతల చెరువును దర్జాగా కబ్జాచేస్తే... దానిని పీకేయించి అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. దానిని తొలగించి ఏకంగా మళ్లీ షెడ్ నిర్మాణం చేపట్టడం వారు ఎంతకు తెగిస్తున్నారన్నది చెప్పకనే చెబుతోంది.
► దర్జాగా చెరువులు కబ్జా చేస్తున్న అక్రమార్కులు
► అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు తొలగించి మరీ ఆక్రమణ
► దర్జాగా ఆ స్థలంలో షెడ్ నిర్మాణం
► కొత్తవలస పీతల బంద చెరువు దురాక్రమణ
► తెరవెనుక సూత్రధారిగా టీడీపీ నేత
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొత్తవలస మండలంలోని భూములకు విపరీత డిమాండ్ ఉంది. విశాఖపట్నానికి ఆనుకుని ఉండటంతో అక్కడి స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం విలువ రూ. 3కోట్ల మేర పలుకుతోంది. సెంటు స్థలం దొరికితే చాలు లక్షాధికారి అయిపోవచ్చనే ఆలోచన అందరికీ వచ్చేసింది. దీంతో ప్రభుత్వ భూములను ఏదో ఒకరకంగా దక్కించునేందుకు యత్నిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కనుసన్నల్లో దర్జాగా ఆక్రమణలు జరిగిపోతున్నాయి. ఖాళీగా స్థలం కన్పిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా లేని విధంగా కొత్తవలస మండలంలో భూఆక్రమణలు జరుగుతున్నాయి.
పీతలబంద చెరువులో అనధికార నిర్మాణం
కొత్తవలస మండలం మంగళపాలెంలోని సర్వే నంబర్ 54–3లో గల పీతలబంద చెరువులో కొంత స్థలాన్ని ఆక్రమించి, అనధికార నిర్మాణాన్ని చేపడుతున్నారు. టీడీపీ నేతల అండదండలున్న వ్యక్తులే ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఆ««ధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసే నెపంతో చేపట్టిన ఈ ఆక్రమణను అధికారులు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలనుకున్నా తప్పని సరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. అదంతా అధికారికంగా జరగాలి. నిబంధనల మేరకు చేపడితే ఎలాంటి అభ్యంతరం ఉండదు.
కానీ మంగళపాలెంలో ఎవరి అనుమతీ లేకుండానే పీతలబంద చెరువును దర్జాగా ఆక్రమించి అనధికార నిర్మాణం చేపడుతున్నారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీని వెనక టీడీపీ నేతల హస్తం ఉండటంతో చొరవ తీసుకోలేదు. ఆ తర్వాత స్థానికులు ఫిర్యాదు చేయడంతో తప్పని పరిస్థితుల్లో వెళ్లి అనధికార నిర్మాణాలను తొలగించి అక్కడ హెచ్చరిక బోర్డు పాతారు.
యథేచ్ఛగా హెచ్చరిక బోర్డు తొలగింపు
ఆక్రమణ ప్రదేశాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు అప్పటికే వేసి ఉన్న షెడ్‌ను తొలగించారు. అక్కడే ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ స్థలమని.. సర్వే నంబర్..54–03లో గల పీతబంద అని....ఆక్రమణదారులు శిక్షార్హులు అని బోర్డులో పేర్కొన్నారు. అధికారులు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే అక్రమార్కులు బోర్డును తీసేశారు. అంతేకాకుండా అక్కడొక తాత్కాలిక షెడ్‌ను నిర్మించేశారు. ఎవరేం చేస్తారో చూద్దామనే ధోరణితో ఆక్రమణదారులు ఇష్టారీతిన వ్యవహరించారు. వీరికి టీడీపీ కీలక నేత అండదండలు ఉన్నాయి. దీంతో అడిగే వారు లేకుండా పోయారు. స్థానికంగా స్పందన లేకపోవడంతో స్థానికులు కొందరు ఏకంగా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేశాం
ఆక్రమణ ప్రదేశంలో పాతిన బోర్డును పీకేసిన సంఘటనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. స్థానిక పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ కలిసి ఫిర్యాదు ఇచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా అధికారులు పెట్టిన బోర్డును తీసేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాం.
– తిరుపతిరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, కొత్తవలస