సాక్షి, హైదరాబాద్: భూ వివాదాల బాధితులకు అండగా నిలిచేందుకు, వారికి భరోసా కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. భూ వివాదాల్లో బాధితులకు పోలీసుల తరఫు నుంచి ఎంతవరకు సహాయం అం దజేయవచ్చనే అంశంపై ఒక నివేదిక రూపొందించారు. అందులోని అంశాలపై 450 మంది ఎస్సైలకు అవగాహన కూడా కల్పించారు. ఇక నుంచి భూవివాదాలకు సంబంధించిన అంశాలపై ఈ నివేదిక ఆధారంగా పోలీసులు వ్యవహరించనున్నారు.
భూ వివాదాల అంశంపై ఇటీవల పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశం మేరకు ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)’ రూపకల్పన పూర్తయింది. ఓ ప్రత్యేక పోలీసు బృం దం భూ వివాదాల అంశంలో బెంగళూరు, ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి వచ్చింది. దానితోపాటు న్యాయ నిపుణులు, రెవెన్యూ అధికారుల సహా యంతో 21 అంశాలతో నివేదికను రూపొందించారు. బాధితులకు ఎలా న్యాయం చేయాలి, పోలీసులు ఎలా స్పందించాలనే అంశాలను అందులో పేర్కొన్నారు. ఈ అం శాల పరిధిలోకి వచ్చే భూ బాధితులకు మాత్రమే పోలీసులు సహకారం అందిస్తారు. ఆ నివేదిక ప్రతులు (తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో) సోమవారం నుంచి ప్రతి ఠాణాలో అందుబాటులో ఉండే విధంగా కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఎస్‌వోపీ నివేదిక అంశాలపై 450 మంది ఎస్సైలకు అవగాహన తరగతులు కూడా పూర్తి చేశారు.
ఎస్‌వోపీలోని అంశాల ప్రకారం... ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన జీపీఏతో వచ్చిన వ్యక్తి తన ఆస్తికి పోలీసు రక్షణ కోరితే... పోలీసులు జీపీఏ చెల్లుబాటును పరిశీలించాలి. ప్రధాన జీపీఏ హోల్డర్ మరణిస్తే అది రద్దైనట్లేనని గుర్తించాలి. ఆధారాలుంటే సంబంధిత సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలి. అయితే, ప్రస్తుతం సదరు స్థిరాస్తిలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించే ప్రయత్నం చేయకూడదు. కోర్టు ఉత్తర్వులు లేనిదే రక్షణ ఇవ్వకూడదు. ఇక ఓ స్థిరాస్తి కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించానని, ఆపై మోసపోయానని బాధితుడు ఆధారాలతో వస్తే... పోలీసులు సంబంధిత సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించాలి. ఇలాంటి 21 అంశాలను ఎస్‌వోపీలో చేర్చారు.
భూ బాధితులకు ‘ఎస్‌వోపీ’ భరోసా
Published Mon, Sep 23 2013 3:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement