Standard operating procedure
-
AP: ‘ఫ్యామిలీ డాక్టర్’ వస్తున్నారు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం అమలుకు వైద్య, ఆరోగ్య శాఖ ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశా వర్కర్, ఏఎన్ఎం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్), పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వైద్యుడు.. ఇలా వీరందరి విధులు, బాధ్యతలను ఎస్ఓపీలో పొందుపరిచారు. ఎస్ఓపీపై జిల్లాల్లో అధికారులు, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్యం, ఆరోగ్య సంరక్షణ కోసం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఈ విధానం అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిశ్చయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రోజంతా గ్రామంలోనే.. రాష్ట్ర వ్యాప్తంగా 1142 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో భాగంగా ఇద్దరు పీహెచ్సీ వైద్యులకు తమ పరిధిలోని సచివాలయాలు/విలేజ్ క్లినిక్‌లను విభజిస్తున్నారు. ఏ రోజు ఏ సచివాలయం/విలేజ్ క్లినిక్ పరిధిలో వైద్య సేవలు అందించాలన్న దానిపై టైమ్ టేబుల్ వేస్తున్నారు. దాని ఆధారంగా ఒక్కో వైద్యుడు రోజు మార్చి రోజు గ్రామాలు సందర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీహెచ్సీ వైద్యుల సేవలు నెలలో 26 రోజుల పాటు గ్రామాల్లోనే అందుతాయి. గ్రామాలకు వెళ్లే వైద్యుడు 104 మొబైల్ మెడికల్ యూనిట్‌తో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గ్రామంలోనే ఉంటాడు. అతనితో పాటు ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో కూడిన బృందం గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తుంది. ప్రారంభంలో ప్రతి గ్రామానికి నెలలో ఒక సారి సందర్శన ఉంటుంది. తర్వాత నెలలో రెండు సార్లు 104 ఎంఎంయూ సందర్శించేలా సేవలు విస్తరిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 656 వాహనాలకు అదనంగా 432 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తొలుత ఓపీ.. తర్వాత హోమ్ విజిట్స్ ►కొన్ని గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ నిర్మాణంలో ఉన్నందున ఓపీ 104 వాహనాల వద్దే ఉంటుంది. క్లినిక్స్ నిర్మాణం పూర్తయ్యాక వాటి వద్దే ఓపీ నిర్వహిస్తారు. ►మెడికల్ ఆఫీసర్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఔట్‌పేషెంట్ సేవలు అందిస్తారు. బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌తో బాధపడుతున్న రోగులకు రెగ్యులర్ చెకప్ చేస్తారు. ►గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తన పరిధిలోని గర్భిణులు, బాలింతలకు అన్ని యాంటీనేటల్, పోస్ట్‌నేటల్ చెకప్స్ జరిగేలా చూస్తారు. హైరిస్క్ గర్భిణులను గుర్తిస్తారు. ►నవజాత, శిశు సంరక్షణ సేవలు అందిస్తారు. అంగన్వాడీ సెంటర్లు సందర్శించి రక్తహీనతతో బాధ పడుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. అవసరమైన వైద్య సేవలు చేస్తారు. ►పిల్లల్లో జబ్బులు, ఎదుగుదల, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు పరీక్షలు చేస్తారు. ►మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వైద్యుడు హోమ్ విజిట్స్ చేస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన రోగుల ఆరోగ్య పరిస్థిని ఫాలో అప్ చేస్తారు. ►మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఇతర రోగులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సేవలు అందిస్తారు. ►పాఠశాలల్లో విద్యార్థులకు జనరల్ చెకప్, అనీమియా, ఇతర సమస్యలకు వైద్యం చేస్తారు. పిల్లల్లో అనీమియా నియంత్రణకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ పంపిణీ అమలును పర్యవేక్షిస్తారు. ►వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లోని ఎంఎల్‌హెచ్‌పీ తన పరిధిలోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తారు. టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ సేవలను అందిస్తారు. 30 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ఎన్సీడీ జబ్బుల నిర్ధారణకు స్క్రీనింగ్ చేపడతారు. మొత్తంగా గ్రామ స్థాయిలో 12 రకాల వైద్య సేలను ప్రజలకు అందిస్తారు. ►ఏఎన్ఎం గ్రామ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రులకు రెఫర్ చేసిన ఆరోగ్య శ్రీ కేసులను ఫాలోఅప్ చేస్తారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన రోగులకు సీఎం వైఎస్ జగన్ సందేశంతో కూడిన లేఖలను అందజేస్తారు. ఆరోగ్య శ్రీ సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. 104 ఎంఎంయూ వద్ద వైద్య సేవలు పొందడానికి హాజరవ్వాల్సిన యాంటీనేటల్, పోస్ట్ నేటల్ కేసులను నిర్ధారిస్తారు. ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ►ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు పొందడానికి ప్రజలను ఆశ వర్కర్ సమీకరిస్తారు. బాలింతలు, గర్భిణులు, కౌమార దశ పిల్లలకు వైద్య సేవలు అందేలా చూస్తారు. వైద్యుడు గృహాల సందర్శన కోసం మంచానికి పరిమితం అయిన రోగులు, వృద్ధుల వివరాలు సేకరిస్తారు. -
ఎస్సీ, ఎస్టీలతో మమేకం
సాక్షి, అమరావతి: వారానికోసారి జిల్లాల ఎస్పీలు కలెక్టర్లతో కలిసి ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అక్కడి ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని సూచించారు. దీనివల్ల పోలీసులు అణగారిన వర్గాలకు దగ్గరవుతారని చెప్పారు. ఆరేళ్ల అనంతరం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలుపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఐడీలోని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసుల దర్యాప్తు విభాగాన్ని సీఎం ఆదేశించారు. దర్యాప్తునకు సంబంధించి ఎస్వోపీ పంపాలని.. దర్యాప్తులో ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారా? లేదా? అన్నదానిపై సమీక్షించి అందులోని లోటుపాట్లను మూడు నెలల్లో సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కలెక్టర్లు, ఎస్పీల మొదటి కాన్ఫరెన్స్‌లోనే అణగారిన వర్గాలు, మహిళలకు అండగా ఉండాలని చెప్పానని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే వారంలో ఒకసారి కలెక్టర్లు గ్రామ సచివాలయాలను సందర్శించడం తప్పనిసరి చేశామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా ఈ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. తప్పు చేసినవారు తమ వారైనా సరే.. సంబంధిత పోలీసు అధికారులపై ఆ శాఖ చర్యలు తీసుకుంది. హోంమంత్రి, డీజీపీ ఎంతో సాహసంతో వ్యవహరించి నిబంధనల మేరకు వారిపై చర్యలు తీసుకుని చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నట్లుగా వ్యవహరించి ఎస్ఐలు, సీఐలపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. బాధితులకు ఆర్థిక సాయం కొనసాగుతుంది వేధింపులకు గురైన కేసుల్లో బాధితులకు ఎప్పటికప్పుడు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది కొనసాగుతుంది. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అత్యాచారం, హత్యకు గురైన బాధిత కుటుంబాల్లోని వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించాలి. ఇందులో ఎలాంటి జాప్యం జరగకూడదు. అందుబాటులో భూమి ఉంటే ఇద్దాం.. లేనిపక్షంలో సేకరించి బాధితులకు పంపిణీ చేద్దాం. ప్రత్యేక కోర్టులు, న్యాయవాదుల నియామకంపై దృష్టి ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుకు సంబంధించి కమిటీలో ఉన్న సభ్యులు తమ సూచనలు, సలహాలను పోలీసు అధికారులకు ఇవ్వాలి. వీటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు మేధోమథనం చేయాలి. తదుపరి దీనిపై కార్యాచరణ చేపట్టాలి. అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమై వీటిపై మరోసారి చర్చించాలి. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, న్యాయవాదుల నియామకం, అలాగే.. బాధితులకు అందాల్సిన సహాయంపైనా దృష్టి పెట్టాలి. అణగారిన వర్గాల్లో సాధికారత కోసం.. అణగారిన వర్గాలకు మంచి జరగాలి.. సాధికారత రావాలన్న ఉద్దేశంతోనే తొలిసారిగా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో భాగంగానే హోంమంత్రి పదవిని దళిత మహిళకు ఇచ్చాం. విద్యాశాఖనూ దళితులకే ఇచ్చాం. డీజీపీ కూడా ఎస్టీ వర్గానికి చెందిన వారే. అణగారిన వర్గాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. విద్యాశాఖలో కూడా అన్ని విషయాలు తెలిసిన మనిషి ఉండాలని సురేష్‌ను మంత్రిగా పెట్టాం. తద్వారా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, అణగారిన వర్గాల్లో సాధికారత కోసం ప్రయత్నిస్తున్నాం. ఒక దిశగా మనం అడుగులు వేయడం మొదలు పెట్టాం, మన లక్ష్యసాధనలో ప్రగతి కనిపిస్తోంది. 2013 తర్వాత ఇప్పటి వరకు ఈ కమిటీ సమావేశం జరగలేదు. చట్టం అమలుపై గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేక దృష్టి లేదని దీంతో స్పష్టమైంది. ఇది శోచనీయం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఇక ఏటా ఈ సమావేశాన్ని నిర్వహిస్తాం. చట్టం అమలు తీరు.. ప్రగతిని మనం సమీక్షించుకుంటాం. గతంలో తీసుకున్న చర్యలు, ఇప్పుడు మెరుగుపర్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, వాటి అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తాం. చట్టం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రశంస ► ఈ సందర్భంగా.. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధిని కమిటీ సభ్యులు ప్రశంసించారు. వివిధ కేసుల్లో బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని షెడ్యూలు కులాల నేషనల్ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్‌కుమార్‌బాబు చెప్పారు. ► తూర్పుగోదావరి (రాజమండ్రి), ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ఘటనల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో తన చిత్తశుద్ధిని చూపించిందని కమిటీ సభ్యులు ప్రశంసించారు. ► ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా సీఎం తక్షణమే స్పందిస్తున్నారని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. దాదాపు ఏడు ఘటనల్లో ఆయా కుటుంబాలను సీఎం ఉదారంగా ఆదుకున్నారని వారు గుర్తు చేశారు. ► ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో జరిగిన ఘటనల్లో రూ.60 లక్షలు బాధితులకు ఆర్థిక సహాయం చేశారని అధికారులు తెలిపారు. బాధితుల వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సహాయ అంశాన్ని ఎక్కడా వార్తల్లో కనిపించనీయకుండా సున్నితంగా వ్యవహరిస్తున్న అంశాన్నీ సమావేశంలో కమిటీ సభ్యులు ప్రస్తావించారు. ► ఈ సమావేశంలో పోలీస్ శాఖ రూపొందించిన ‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల సత్ప్రవర్తన’ బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ► హోంమంత్రి మేకతోటి సుచరిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. సునీత, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పలువురు ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు ప్రతి మూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లాల్లో సమీక్ష చేయాలి. ఇందులో కలెక్టర్ సహా ఉన్నతాధికారులు పాల్గొనాలి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఎస్ఓపీలనూ తయారు చేసి ఇవ్వాలి. అమలు తీరుపై వారు నివేదిక పంపాలి. ఇలా జిల్లాల నుంచి వచ్చిన నివేదికలపై రాష్ట్ర స్థాయి కమిటీ దృష్టి సారిస్తుంది. వీటిపై సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ -
అక్కడ పండుగ ఉత్సవాలకు అనుమతి లేదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం వేలాదిగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజూ దాదాపు వెయ్యి మంది కరోనాతో కన్నుమూస్తున్నారు. రానున్న మూడు నెలలు పండుగ రోజులే. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు దాకా దేశంలో ఏదో ఒక చోట పండుగ కార్యక్రమాలు జరుగుతాయి. దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి వేడుకల్లో జనం భారీగా పాల్గొంటారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే చోట కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి పండుగల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కట్టడి(కంటైన్మెంట్) జోన్లలో పండుగ ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అలాంటి ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితం కావాలని, ఇళ్లల్లోనే పండుగలు జరుపుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రామాణిక నిర్వాహక విధానాన్ని(ఎస్ఓపీ) విడుదల చేసింది.(చదవండి: ఆరోగ్యమంత్రికి కరోనా, రాహుల్‌తో కలిసి వేదిక పంచుకున్న వైనం) పండుగల్లో విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను చేతులతో తాకరాదు. భక్తి సంగీతం/పాటలు వినిపించవచ్చు. పాటల పోటీలు నిర్వహించకూడదు. బృందాలుగా పాడకూడదు. పండుగ కార్యక్రమాలు జరిగే చోట జనం భౌతిక దూరం పాటించేందుకు వీలుగా మార్కింగ్ చేయాలి. ఒక్కొక్కరి మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి. క్యూ లైన్లలోనూ ఇదే విధానం పాటించాలి. ఇలాంటి వేడుకలు తగినంత స్థలం ఉన్నచోటే ఏర్పాటు చేసుకోవాలి. థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలి. వేడుకలే జరిగే ప్రాంగణాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలి. భక్తులతో ర్యాలీలు, విగ్రహాల నిమజ్జనాలు జరిగేటప్పుడు పరిమితి సంఖ్యలోనే జనాన్ని అనుమతించాలి. ర్యాలీల్లో అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలి. వేడుకల ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ఒకదారి, బయటకు వెళ్లడానికి మరో దారి వేర్వేరుగా ఉండాలి. ఆలయాల్లోకి వెళ్లే భక్తులు తమ చెప్పులను వాహనాల్లోనే వదిలేయడం మంచిది. పండుగ వేడుకల ప్రాంగణాలు, ఆలయాల్లో భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. వైద్య సదుపాయం సైతం ఉండాలి. -
మెట్రో సేవలు.. మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ: అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రయాణానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ని విడుదల చేసింది. 15 మెట్రో రైల్ కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో కేంద్రం మంగళవారం చర్చించిన అనంతరం ఎస్ఓపీని నిర్ణయించింది. దాని ప్రకారం మెట్రో సేవలను తొలుత గ్రేడెడ్ పద్దతిలో ప్రారంభిస్తారు. సెప్టెంబర్ ఏడు నుంచి ఒకటి కంటే ఎక్కువ లైన్లలో సేవలు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబరు 12 నాటికి అన్ని కారిడార్లు పని చేస్తాయి. ఇక కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో అన్ని స్టేషన్లు మూసివేసే ఉంటాయి. ఇక ప్రయాణికులు, సిబ్బంది తప్పక మాస్క్ ధరించాలి. సామాజిక దూరం తప్పనిసరి. మాస్క్ లేకుండా వచ్చేవారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసి.. మాస్క్ ఇస్తారు. (చదవండి: సిటీ బస్సులు లేనట్టేనా?) ఇక స్టేషన్లోకి ప్రవేశించేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. కోవిడ్ లక్షణాలు లేనివారినే స్టేషన్లోకి అనుమతిస్తారు. అనుమానితులను సమీప కోవిడ్ కేర్ సెంటర్‌కి పంపిస్తారు. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ప్రయాణికులు ఉపయోగం కోసం స్టేషన్ ఎంట్రీ వద్ద శానిటైజర్ ఉంచనున్నారు. నగదు రహిత లావాదేవీల కోసం స్మార్ట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సాహించాలని నిర్ణయించారు. -
వాట్‌మోర్‌కు కష్టమే
ముంబై: కరోనాను దృష్టిలో ఉంచుకొని దేశవాళీ క్రికెట్ నిర్వహించే విషయంలో బీసీసీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 100 పేజీల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను విడుదల చేసింది. దీని ప్రకారం 60 ఏళ్లు దాటిన వ్యక్తులు దేశవాళీ జట్లకు కోచ్‌లుగా కూడా వ్యవహరించరాదు. అందరికంటే ముందుగా బరోడా రంజీ కోచ్ డేవ్ వాట్‌మోర్‌పై దీని ప్రభావం పడనుంది. ఆస్ట్రేలియాకు చెందిన వాట్‌మోర్‌కు కోచ్‌గా అద్భుత రికార్డు ఉంది. 1996లో శ్రీలంకను ప్రపంచ కప్ విజేతగా నిలిపిన వాట్మోర్ ఆ తర్వాత పలు హోదాల్లో భారత్‌లో పని చేశారు. ప్రస్తుత సీజన్ కోసం గత ఏప్రిల్‌లో ఆయనను బరోడా కోచ్‌గా నియమించుకుంది. అయితే తాజా నిబంధన ప్రకారం ఆయనను తప్పించాలని బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) దాదాపుగా నిర్ణయించింది. ఆరంభంలో బీసీఏ అధ్యక్షుడు ప్రణవ్ అమీన్ మద్దతుగా నిలిచి కొనసాగించాలని భావించినా.... సంఘంలోని ఇతర సభ్యులు దీనికి అభ్యంతరం తెలిపారు. ‘మన ఆటగాళ్ల ఆరోగ్యం మనకు అన్నింటికంటే ప్రధానం. 60 ఏళ్లు దాటిన వాట్‌మోర్‌కు కరోనా వల్ల ఇబ్బందులు రావచ్చు. అది వ్యాపిస్తే చాలా కష్టం. పైగా అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఉన్న సమయంలో ఆస్ట్రేలియా నుంచి ఆయన ఎలా వస్తారు’ అని బీసీఏ సంయుక్త కార్యదర్శి పరాగ్ పటేల్ ప్రశ్నించారు. మరో వైపు బెంగాల్ క్రికెట్ సంఘం తమ కోచ్ అరుణ్ లాల్ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉండగా... సౌరాష్ట్ర కూడా సీజన్ ప్రారంభమయ్యే సమయానికి తమ కోచ్ కర్సన్ ఘావ్రీ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. -
ఐదు సార్లు నెగెటివ్...
ముంబై: కరోనా పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించనున్న బీసీసీఐ ఈ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్ల కోసం తగిన మార్గదర్శకాలు రూపొందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) డ్రాఫ్ట్‌ను తయారు చేసింది. దీని ప్రకారం.... ► యూఏఈలో శిబిరానికి హాజరయ్యే ముందు భారత క్రికెటర్లు, సహాయక సిబ్బందికి వరుసగా ఐదు కరోనా టెస్టుల్లో నెగెటివ్ ఫలితం రావాలి. ఇందులో 24 గంటల వ్యవధిలో రెండు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు జరుపుతారు. యూఏఈ బయలుదేరడానికి వారం రోజుల ముందు ఇది జరుగుతుంది. ఎవరికైనా పాజిటివ్ వస్తే వారు 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. ఆ తర్వాత రెండు టెస్టులు నెగెటివ్‌గా వస్తేనే పంపిస్తారు. ► యూఏఈ చేరుకున్న తర్వాత తొలి వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు పరీక్షలు చేయించుకొని అన్నీ నెగెటివ్‌గా తేలాలి. అప్పుడే బయో బబుల్‌లోకి చేర్చి ప్రాక్టీస్‌కు అవకాశం ఇస్తారు. ఈ వారం సమయంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఒకరితో మరొకరు కలవకూడదు. ► ఐపీఎల్ జరిగే సమయంలో ప్రతీ 5వ రోజు క్రికెటర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. యూఏఈ నిబంధనల ప్రకారం అవసరమైతే ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో కూడా టెస్టులు జరపవచ్చు. ► క్రికెటర్ల కుటుంబసభ్యులను అనుమతించడంపై ఆయా ఫ్రాంచైజీలదే తుది నిర్ణయం. అయితే వారందరూ కూడా కచ్చితంగా బయో సెక్యూర్ నిబంధనలు పాటించాల్సిందే. ► ఎవరైనా ఆటగాడు బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారం రోజులు మళ్లీ సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందే. ఆ తర్వాత వరుసగా రెండు నెగెటివ్ పరీక్షలు వస్తేనే మళ్లీ అనుమతిస్తారు. -
‘మీ ఆటకు మీరే బాధ్యులు’
న్యూఢిల్లీ: క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రొత్సహించాల్సిన భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కరోనా పరిస్థితుల నేపథ్యంలో బాధ్యత మరిచే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) పేరిట నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేసిన ‘సాయ్’ తాజాగా ఎవరి ఆటకు వారే బాధ్యులనే సమ్మతి లేఖను సమర్పించాలని ఆటగాళ్లను కోరడం చర్చనీయాంశమైంది. ఆటగాళ్లకు వెన్నంటే మద్దతివ్వాల్సిన సాయ్... ఇప్పుడీ కొత్త నిబంధన జతచేసింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆటగాళ్లు ఆడేక్రమంలో, శిక్షణ తీసుకునే విషయంతో ‘మాదే బాధ్యత ఇందులో సాయ్‌కి గానీ, సంబంధిత క్రీడా సమాఖ్యకు గానీ సంబంధం లేదు’అనే డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. -
భూ బాధితులకు ‘ఎస్వోపీ’ భరోసా
సాక్షి, హైదరాబాద్: భూ వివాదాల బాధితులకు అండగా నిలిచేందుకు, వారికి భరోసా కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. భూ వివాదాల్లో బాధితులకు పోలీసుల తరఫు నుంచి ఎంతవరకు సహాయం అం దజేయవచ్చనే అంశంపై ఒక నివేదిక రూపొందించారు. అందులోని అంశాలపై 450 మంది ఎస్సైలకు అవగాహన కూడా కల్పించారు. ఇక నుంచి భూవివాదాలకు సంబంధించిన అంశాలపై ఈ నివేదిక ఆధారంగా పోలీసులు వ్యవహరించనున్నారు. భూ వివాదాల అంశంపై ఇటీవల పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశం మేరకు ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)’ రూపకల్పన పూర్తయింది. ఓ ప్రత్యేక పోలీసు బృం దం భూ వివాదాల అంశంలో బెంగళూరు, ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి వచ్చింది. దానితోపాటు న్యాయ నిపుణులు, రెవెన్యూ అధికారుల సహా యంతో 21 అంశాలతో నివేదికను రూపొందించారు. బాధితులకు ఎలా న్యాయం చేయాలి, పోలీసులు ఎలా స్పందించాలనే అంశాలను అందులో పేర్కొన్నారు. ఈ అం శాల పరిధిలోకి వచ్చే భూ బాధితులకు మాత్రమే పోలీసులు సహకారం అందిస్తారు. ఆ నివేదిక ప్రతులు (తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో) సోమవారం నుంచి ప్రతి ఠాణాలో అందుబాటులో ఉండే విధంగా కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఎస్వోపీ నివేదిక అంశాలపై 450 మంది ఎస్సైలకు అవగాహన తరగతులు కూడా పూర్తి చేశారు. ఎస్వోపీలోని అంశాల ప్రకారం... ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన జీపీఏతో వచ్చిన వ్యక్తి తన ఆస్తికి పోలీసు రక్షణ కోరితే... పోలీసులు జీపీఏ చెల్లుబాటును పరిశీలించాలి. ప్రధాన జీపీఏ హోల్డర్ మరణిస్తే అది రద్దైనట్లేనని గుర్తించాలి. ఆధారాలుంటే సంబంధిత సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలి. అయితే, ప్రస్తుతం సదరు స్థిరాస్తిలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించే ప్రయత్నం చేయకూడదు. కోర్టు ఉత్తర్వులు లేనిదే రక్షణ ఇవ్వకూడదు. ఇక ఓ స్థిరాస్తి కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించానని, ఆపై మోసపోయానని బాధితుడు ఆధారాలతో వస్తే... పోలీసులు సంబంధిత సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించాలి. ఇలాంటి 21 అంశాలను ఎస్‌వోపీలో చేర్చారు.