ఎస్సీ, ఎస్టీలతో మమేకం | AP CM YS Jagan wants SOP in place for implementation of SC/ST Act | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలతో మమేకం

Published Fri, Feb 5 2021 5:08 AM | Last Updated on Fri, Feb 5 2021 9:10 AM

AP CM YS Jagan wants SOP in place for implementation of SC/ST Act - Sakshi

పోలీస్‌ విభాగం రూపొందించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో హోంమంత్రి సుచరిత, మంత్రులు సురేష్, విశ్వరూప్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ సవాంగ్‌ తదితరులు

సాక్షి, అమరావతి: వారానికోసారి జిల్లాల ఎస్పీలు కలెక్టర్లతో కలిసి ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అక్కడి ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని సూచించారు. దీనివల్ల పోలీసులు అణగారిన వర్గాలకు దగ్గరవుతారని చెప్పారు. ఆరేళ్ల అనంతరం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలుపై సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన గురువారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి హైపవర్‌ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. 

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఐడీలోని ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కేసుల దర్యాప్తు విభాగాన్ని  సీఎం ఆదేశించారు. దర్యాప్తునకు సంబంధించి ఎస్‌వోపీ పంపాలని.. దర్యాప్తులో ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారా? లేదా? అన్నదానిపై సమీక్షించి అందులోని లోటుపాట్లను మూడు నెలల్లో సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కలెక్టర్లు, ఎస్పీల మొదటి కాన్ఫరెన్స్‌లోనే అణగారిన వర్గాలు, మహిళలకు అండగా ఉండాలని చెప్పానని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే వారంలో ఒకసారి కలెక్టర్లు గ్రామ సచివాలయాలను సందర్శించడం తప్పనిసరి చేశామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా ఈ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..

ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం
ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. తప్పు చేసినవారు తమ వారైనా సరే.. సంబంధిత పోలీసు అధికారులపై ఆ శాఖ చర్యలు తీసుకుంది. హోంమంత్రి, డీజీపీ ఎంతో సాహసంతో వ్యవహరించి నిబంధనల మేరకు వారిపై చర్యలు తీసుకుని చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నట్లుగా వ్యవహరించి ఎస్‌ఐలు, సీఐలపై చర్యలు  తీసుకున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.

బాధితులకు ఆర్థిక సాయం కొనసాగుతుంది
వేధింపులకు గురైన కేసుల్లో బాధితులకు ఎప్పటికప్పుడు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది కొనసాగుతుంది. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అత్యాచారం, హత్యకు గురైన బాధిత కుటుంబాల్లోని వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించాలి. ఇందులో ఎలాంటి జాప్యం జరగకూడదు. అందుబాటులో భూమి ఉంటే ఇద్దాం.. లేనిపక్షంలో సేకరించి బాధితులకు పంపిణీ చేద్దాం.

ప్రత్యేక కోర్టులు, న్యాయవాదుల నియామకంపై దృష్టి
ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుకు సంబంధించి కమిటీలో ఉన్న సభ్యులు తమ సూచనలు, సలహాలను పోలీసు అధికారులకు ఇవ్వాలి. వీటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు మేధోమథనం చేయాలి. తదుపరి దీనిపై కార్యాచరణ చేపట్టాలి. అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమై వీటిపై మరోసారి చర్చించాలి. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, న్యాయవాదుల నియామకం, అలాగే.. బాధితులకు అందాల్సిన సహాయంపైనా దృష్టి పెట్టాలి.

అణగారిన వర్గాల్లో సాధికారత కోసం..
అణగారిన వర్గాలకు మంచి జరగాలి.. సాధికారత రావాలన్న ఉద్దేశంతోనే తొలిసారిగా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో భాగంగానే హోంమంత్రి పదవిని దళిత మహిళకు ఇచ్చాం. విద్యాశాఖనూ దళితులకే ఇచ్చాం. డీజీపీ కూడా ఎస్టీ వర్గానికి చెందిన వారే. అణగారిన వర్గాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. విద్యాశాఖలో కూడా అన్ని విషయాలు తెలిసిన మనిషి ఉండాలని సురేష్‌ను మంత్రిగా పెట్టాం. తద్వారా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, అణగారిన వర్గాల్లో సాధికారత కోసం ప్రయత్నిస్తున్నాం. ఒక దిశగా మనం అడుగులు వేయడం మొదలు పెట్టాం, మన లక్ష్యసాధనలో ప్రగతి కనిపిస్తోంది.

2013 తర్వాత ఇప్పటి వరకు ఈ కమిటీ సమావేశం జరగలేదు. చట్టం అమలుపై గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేక దృష్టి లేదని దీంతో స్పష్టమైంది. ఇది శోచనీయం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఇక ఏటా ఈ సమావేశాన్ని నిర్వహిస్తాం. చట్టం అమలు తీరు.. ప్రగతిని మనం సమీక్షించుకుంటాం. గతంలో తీసుకున్న చర్యలు, ఇప్పుడు మెరుగుపర్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, వాటి అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తాం.

చట్టం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రశంస
► ఈ సందర్భంగా.. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధిని కమిటీ సభ్యులు ప్రశంసించారు. వివిధ కేసుల్లో బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని షెడ్యూలు కులాల నేషనల్‌ కమిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సునీల్‌కుమార్‌బాబు చెప్పారు.

► తూర్పుగోదావరి (రాజమండ్రి), ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ఘటనల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో తన చిత్తశుద్ధిని చూపించిందని కమిటీ  సభ్యులు ప్రశంసించారు.

► ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా సీఎం తక్షణమే స్పందిస్తున్నారని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. దాదాపు ఏడు ఘటనల్లో ఆయా కుటుంబాలను సీఎం ఉదారంగా ఆదుకున్నారని వారు గుర్తు చేశారు.

► ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో జరిగిన ఘటనల్లో రూ.60 లక్షలు బాధితులకు ఆర్థిక సహాయం చేశారని అధికారులు తెలిపారు. బాధితుల వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సహాయ అంశాన్ని ఎక్కడా వార్తల్లో కనిపించనీయకుండా సున్నితంగా వ్యవహరిస్తున్న అంశాన్నీ సమావేశంలో కమిటీ సభ్యులు ప్రస్తావించారు.

► ఈ సమావేశంలో పోలీస్‌ శాఖ రూపొందించిన ‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల సత్ప్రవర్తన’ బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  ఆవిష్కరించారు.

► హోంమంత్రి మేకతోటి సుచరిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. సునీత, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పలువురు ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.


జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ప్రతి మూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లాల్లో సమీక్ష చేయాలి. ఇందులో కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులు పాల్గొనాలి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఎస్‌ఓపీలనూ తయారు చేసి ఇవ్వాలి. అమలు తీరుపై వారు నివేదిక పంపాలి. ఇలా జిల్లాల నుంచి వచ్చిన నివేదికలపై రాష్ట్ర స్థాయి కమిటీ దృష్టి సారిస్తుంది. వీటిపై సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement