ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో..సరికొత్త రికార్డు | CM YS Jagan Govt Created New Record In SC and STs Welfare | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో..సరికొత్త రికార్డు

Published Sat, Jul 18 2020 3:43 AM | Last Updated on Sat, Jul 18 2020 1:04 PM

CM YS Jagan Govt Created New Record In SC and STs Welfare - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి రికార్డు స్థాయిలో వ్యయం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకుమించి ఖర్చుచేయాలని అధికార యంత్రాంగానికి సీఎం దిశా నిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం మన ప్రభుత్వం అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చిందని.. వారికి ఇప్పుడు జరుగుతున్న లబ్ధి అంతా ఆ పథకాల నుంచేనని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి ఆరో సమావేశం శుక్రవారం క్యాంపు  కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

– సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మంచి జరిగితే అంత మంచిది.
– ఆసరా, చేయూత పథకాలు ఈ ఏడాది కొత్తగా అమలవుతున్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీలకు పెడుతున్న ఖర్చు మరింతగా పెరుగుతుంది.
– వైఎస్సార్‌ ఆసరా కింద కనీసం 25లక్షల మంది మహిళలకు.. వైఎస్సార్‌ చేయూత కింద దాదాపు 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది.
– ఈ పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్థోమత.. జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
– మహిళల స్వయం సాధికారతకు ఈ రెండు పథకాలు దోహదపడతాయి.
– రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం.
– ఈ రంగం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.

సీఎంకు మంత్రుల ధన్యవాదాలు
ఇదిలా ఉంటే.. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన ఖర్చు వివరాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. అనంతరం.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం సీఎం ఎనలేని కృషిచేశారని.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయా వర్గాలకు మేలు చేకూర్చారని మంత్రులు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ద్వారా అట్టడుగు వర్గాల వారికి ఎనలేని మేలు జరిగిందంటూ సీఎంకు వారు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మంత్రులు పినిపే విశ్వరూప్, ధర్మాన కృష్ణదాస్, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎస్టీ, ఎస్సీల కోసం ఖర్చు ఇలా..
– 2018–19లో (గత ప్రభుత్వం) ఎస్సీల కోసం రూ.8,903.44 కోట్లు.. ఎస్టీల కోసం రూ.2,902.61 కోట్లు ఖర్చు చేసింది.
– 2019–20లో సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు ఎస్సీల కోసం రూ.11,205.41 కోట్లు.. ఎస్టీల కోసం రూ.3,669.42 కోట్లు ఖర్చు చేసింది.
– ఇక ప్రస్తుత సంవత్సరానికి (2020–21) సంబంధించి కొత్తగా అమలుచేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ఖర్చుచేస్తోంది.
– మొత్తంగా 77,27,033 మంది ఎస్సీలకు, 24,55,286 మంది ఎస్టీలకు లబ్ధి చేకూరుతోంది. 

వచ్చే ఏప్రిల్‌ 14 నాటికి అంబేడ్కర్‌ పార్కు 
విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించ తలపెట్టిన అంబేడ్కర్‌ పార్కును వచ్చే ఏప్రిల్‌ 14 నాటికి పూర్తయ్యేలా మంత్రులు, అధికారులు లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనిని వేగంగా పూర్తిచేసేందుకు పార్కు పనులను విగ్రహ నిర్మాణం, ల్యాండ్‌ స్కేపిం గ్‌ రెండు విభాగాలుగా విభజించాలి. పార్కును అద్భుతంగా, అందంగా తీర్చిదిద్దాలి
– వీలైనంతగా కాంక్రీట్‌ నిర్మాణాలు తగ్గించి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
– 20 ఎకరాల్లో ఈ పార్కు పూర్తయితే విజయవాడ నగరం నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది.
– సిటీ బ్యూటీని పెంచేందుకు ఈ పార్కు చాలా ఉపయోగపడుతుంది.
– మంత్రులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పార్కు నిర్మాణం చేయించాలి. విజయవాడ నగరానికి ఈ పార్కు తలమానికం కావాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement