రైతన్న వెన్నువిరిచిన.. తుపాను | Large crop damage in Srikakulam and Vizianagaram districts due to toofan | Sakshi
Sakshi News home page

రైతన్న వెన్నువిరిచిన.. తుపాను

Published Fri, Oct 12 2018 3:42 AM | Last Updated on Fri, Oct 12 2018 4:50 AM

Large crop damage in Srikakulam and Vizianagaram districts due to toofan  - Sakshi

శ్రీకాకుళం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/విజయనగరం గంటస్తంభం: అన్నదాతను తిత్లీ తుపాను నిండా ముంచేసింది. గంటల వ్యవధిలో వెన్ను విరిచేసింది. అపార పంటనష్టం కలిగించి రైతన్నకు తీరని కడుపుకోత మిగిల్చింది. భీకర గాలులు, కుండపోతవర్షానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క సిక్కోలులోనే 75 శాతం మేర వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. లక్షలాది కొబ్బరి చెట్లు నేలవాలాయి.

వేలాది ఎకరాల్లోని అరటి, బొప్పాయి, జీడిమామిడి తోటలు నేలమట్టమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో రూ.1,350 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇందులో వరి నష్టమే అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.09 లక్షల హెక్టార్లలో వరి వేయగా.. 1.44 లక్షల హెక్టార్లకు పైగా పంట దెబ్బతింది. ఈ నష్టం విలువ రూ.875 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

వరి చేతికందే తరుణంలో హఠాత్తుగా వచ్చి పడిన తుపాను తమను కష్టాల పాల్జేసిందని సిక్కోలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 700 హెక్టార్లలోని అరటి తోటలు నేలకొరిగాయి. వీరఘట్టం, వంగర, రాజాం, జి.సిగడాం, గార మండలాల్లోని అరటి తోటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. 1,640 హెక్టార్లలోని జీడిమామిడి, 13 హెక్టార్లలోని బొప్పాయి, మరో 13 హెక్టార్లలోని కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక ఒక్క ఉద్దానం పరిసరాల్లోనే మూడు లక్షలకు పైగా కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.475 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.   

‘విజయనగరం’లో రూ.31.30 కోట్ల నష్టం..
విజయనగరం జిల్లావ్యాప్తంగా అరటి, చెరకుతో పాటు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మొత్తం రూ.31.30 కోట్ల పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 2,500 హెక్టార్లలో అరటి పంట నేలమట్టమైంది. 308 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అరటి తోటలు భారీగా నెలకొరిగాయి. అరటికి మంచి డిమాండ్‌ ఉన్న సమయంలో తోటలు నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరి పంట.. కొమరాడలో 32.5 హెక్టార్లు, జియ్యమ్మవలసలో 44.8 హెక్టార్లు, మక్కువలో 2 హెక్టార్లు, చీపురుపల్లిలో 24 హెక్టార్లు, గరుగుబిల్లిలో 50 హెక్టార్లలో దెబ్బతింది. ఇక 106.1 హెక్టార్లలోని పత్తి పంట తుడిచి  పెట్టుకుపోయింది.   

సాక్షి, అమరావతి: ‘తిత్లీ’ తుపాను వల్ల ఏడుగురు మృత్యువాతపడ్డారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే 5,23,232 ఎకరాల్లోని పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాలు తుపాను ప్రభావానికి గురయ్యాయని.. ఇందులో 16 మండలాల్లో దీని తీవ్రత అధికంగా ఉందని తెలిపింది. మొత్తంగా 1,864 గ్రామాలు దెబ్బతినగా.. 1,021 ఇళ్లకు నష్టం వాటిల్లిందని, 509 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడించింది. 589 పశువులు మృతి చెందాయని పేర్కొందిది.

ఆర్‌ అండ్‌ బీ శాఖకు సంబంధించి రూ.4.80 కోట్లు నష్టం వాటిల్లిందని, పంచాయతీరాజ్‌ శాఖలో రూ.6.92 కోట్లు నష్టం సంభవించిందని తెలిపింది. మున్సిపల్‌ శాఖలో రూ.2.81 కోట్లు, ఇరిగేషన్‌లో రూ.7.20 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌లో రూ.88.50 లక్షలు, విద్యుత్‌ శాఖలో రూ.3 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసింది. 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం 3 వేల మందిని శిబిరాలకు తరలించినట్లు వివరించింది. 105 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని.. 3 వేల ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు పేర్కొంది.  

మాయదారి తుపాను ముంచేసింది..
నాలుగు ఎకరాల్లో వరి వేశా. తెగుళ్లు అదుపులోకి వస్తున్నాయనుకుంటున్న తరుణంలో.. ఈ మాయదారి తుపాను వచ్చి నిండా ముంచేసింది. నా పంటను బాగా దెబ్బతీసింది. చేను పచ్చగా కనిపించినా పూర్తిగా గింజకట్టదు. దీంతో సగం దిగుబడి వచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదు. – కణితి యోగానంద్, రైతు, కుమ్మరిపేట, శ్రీకాకుళం జిల్లా. 


ఉద్దానం కొబ్బరికి ఊపిరి తీసిన తిత్లీ
కవిటి: ఉత్తరాంధ్రలో మరో కోనసీమగా పేరొందిన ఉద్దానం తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సానికి అతలాకుతలమైంది. శ్రీకాకుళం జిల్లాలో గురువారం తెల్లవారు జామున తీరం దాటిన తుపాను ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ సుమారు 14 గంటలపాటు వీచిన ప్రచండ గాలులకు లక్షలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులు కొబ్బరి రైతు గుండెలపై నిప్పులకుంపటిగా మారాయి.

వాస్తవానికి వాతావరణశాఖ ఈ తుపాను కళింగపట్నం, గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటుతుందని హెచ్చరించింది. ఓ దశలో  విజయనగరం వైపు దిశమార్చుకుందనే ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటినీ వమ్ముచేస్తూ పలాస వద్ద తీరం దాటి ఉద్దానాన్ని ఊడ్చుకుపోయింది.గతంలో తుపాన్లు వచ్చిన సమయంలో గాలులు పశ్చిమదిశనుంచి తూర్పువైపుగా వీచేవి.. ఈ సారి అందుకు భిన్నంగా తూర్పువైపు నుంచి పశ్చిమదిశగా గాలులు వీచాయి. దీంతో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి మండలాల్లో భారీస్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.

1999లో సంభవించిన సూపర్‌సైక్లోన్‌ కంటే అధికంగా ఉద్దానం ప్రాంతంలో ఆస్తినష్టం వాటిల్లింది. 11 వేల హెక్టార్లలో కొబ్బరి పంటకు నష్టం వాటిల్లింది. సుమారు 3 లక్షలకు పైగా కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. మరో 25 లక్షల కొబ్బరి చెట్లు మొవ్వు విరిగిపోవడం, మొవ్వు దెబ్బతినడం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కొబ్బరి రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరగాల్సి ఉంది.  

ఏటా నష్టపోతున్న కొబ్బరి రైతు
ఉద్దానం కొబ్బరి రైతు ఏటా ఏదో ఒక విధంగా నష్టపోతున్నాడు. 1999లో వచ్చిన సూపర్‌ సైక్లోన్‌ సందర్భంగా వేలాది కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. భీకర గాలులకు చెట్ల మొవ్వు దెబ్బ తినడం.. ఆ తరువాత చీడపీడలు దాడి చేయడంతో తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. కొన్నాళ్లు అవస్థలు పడిన ఉద్దానం రైతు.. ఆ తరువాత కొద్దికొద్దిగా కోలుకుంటుండగా ఇంతలో 2013 అక్టోబర్‌ 12న వచ్చిన ఫై–లీన్, 2014 అక్టోబర్‌ 14న వచ్చిన హుద్‌హుద్‌ తుపానుతో మరోసారి ఆర్థికంగా చితికిపోయాడు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉద్దానం రైతుకు తిత్లీ రూపేణా మరోసారి గట్టిదెబ్బ తగిలింది. లక్షలాది కొబ్బరి చెట్లు నేలకూలాయని, వేలాది చెట్లు పనికిరాకుండాపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నేలకొరిగిన కొబ్బరిచెట్లు 3 లక్షలకు పైగా
దెబ్బతిన్న కొబ్బరి పంట 11 వేల హెక్టార్లలో
మరో 25 లక్షల చెట్లు భవిష్యత్‌లో పనికిరాకుండా పోయే ప్రమాదం
1999 సూపర్‌ సైక్లోన్‌ కంటే అధికంగా ఆస్తినష్టం  


పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేశాం
శ్రీకాకుళం కలెక్టరు ధనంజయరెడ్డి 
శ్రీకాకుళం సాక్షి ప్రతినిధి: తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ, సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కె.ధనుంజయరెడ్డి గురువారం మీడియాకు తెలిపారు. టెక్కలి డివిజన్‌తో పాటు పలుచోట్ల విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిందన్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి ఈపీడీసీఎల్‌ అధికారులు జిల్లాకు వచ్చినట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

తద్వారా తాగునీరు తదితర సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. అవసరమైన విద్యుత్‌ స్తంభాలు, ఇతరత్రా పరికరాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వివరించారు. నదుల్లో వరద పోటెత్తే ప్రమాదమున్నందున.. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రెస్క్యూ బృందాలను కూడా సన్నద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రెండు పనిచేస్తున్నాయని.. గురువారం మూడో బృందాన్ని రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులందర్నీ ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement