లారీ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
Published Fri, Aug 16 2013 4:46 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
లావేరు, న్యూస్‌లైన్: మండలంలోని అదపాక జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. తమ స్నేహితులను ఎయిర్‌పోర్టుకు సాగనంపేందుకు వెళ్తున్న వారిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. వివరాల్లోకి వెళ్తే. కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు గ్రామానికి చెందిన యాళ్ల శిమ్మయ్యకు దుబాయ్‌లో రిగ్గర్‌గా ఉద్యోగం వచ్చింది. అతను దుబాయ్ వెళ్లేందుకు శుక్రవారం ఉదయం వేకువజామున విమానం ఉండడంతో శిమ్మయ్యను సాగనంపేందుకు గురువారం మధ్యాహ్నం శిమ్మయ్యతో పాటు, అతనికి బావమరిది వరసైన శిమ్మ పెంటయ్య, స్నేహితులు బాడాన నరేష్, తెలుగు రమేష్ రెండు ద్విచక్రవాహనాలపై చీపుర్లపాడులో బయలుదేరారు. బాడాన రమేష్, శిమ్మ పెంటయ్య ఒక ద్విచక్రవాహనంపైనా, యాళ్ల శిమ్మయ్య, తెలుగురమేష్ మరో ద్విచక్రవాహనంపైనా బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నారు.
అయితే గురువారం సాయంత్రం జాతీయ రహదారిపై అదపాక జంక్షన్ వద్దకు వచ్చేసరికి ముందుగా యాళ్ల శిమ్మయ్య, తెలుగురమేష్ వెళ్తుండగా, వారి వెనుక వస్తున్న బాడాన నరేష్, శిమ్మ పెంటయ్య ద్విచక్రవాహనాన్ని శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో నరేష్, పెంటయ్య లారీ వెనుక చక్రాలకు దొరికిపోవడంతో లారీ కొంతవరకు వారిని ఈడ్చుకొని వెళ్లిపోయింది. దీంతో సంఘటనా స్థలంలోనే నరేష్, పెంటయ్యలు మృతి చెందారు. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంతో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం రూట్‌లో వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే రణస్థలం సీఐ వేణుగోపాలనాయుడు, లావేరు ఎస్సై రామారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి వివరాలను సేకరించారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. మృతదేహాలకు శవపంచనామా, పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామారావు తెలిపారు. మృతుల్లో నరేష్ అవివాహితుడు కాగా, మ రో మృతుడు పెంటయ్యకు భార్య, కుమారుడు ఉన్నా రు.
లారీని వెంబడించి పట్టుకున్న మృతుని స్నేహితులు
అదపాక జంక్షన్‌వద్ద జాతీయ రహదారిపై నరేష్, పెంటయ్యలను ఢీకొన్న లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో ముందుగా వె ళ్తున్న మృతుల స్నేహితులైన శిమ్మయ్య, రమేష్ లారీని వెంబడించి బొంతుపేట గ్రామం వద్ద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను, లారీని అదుపులోకి తీసు కొని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
శోకసంద్రంలో చీపుర్లపాడు
చీపుర్లపాడు,(కోటబొమ్మాళి): ఆదుకునే వయసులో తమని వదలి అనంతలోకాలకు వెళ్లిపోయారని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాడాన నరేష్(20), శిమ్మ పెంటయ్య(25)ల కుటుంబాలు రోధిస్తున్నాయి. లావేరు మండలం జాతీయ రహదారిపై అదపాక జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వారివురు మరణించిన వార్త తెలిసిన వెంటనే చీపుర్లపాడు పరిసర గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. చెట్టంత కొడుకు నరేష్ మరణించాడన్న వార్త తెలియగానే అతని తండ్రి బాడాన దండాశి, తల్లి కావ్య, అక్కచెల్లెళ్లు కుప్పకూలిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఇక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శిమ్మ పెంటయ్య(25)కు భార్య ప్రభావతి, ఏడాది వయసుగల కుమార్తె జ్ఞానేశ్వరి, తల్లి రత్నాలమ్మ ఉన్నారు. భర్త మరణవార్త విన్న ప్రభావతి కుప్పకూలిపోయారు. ఇక తమ కుటుంబానికి దిక్కెవరని ఆమె విలపిస్తున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. ఇంటికి పెద్దదిక్కయిన తన కుమారుడు మరణించాడని తట్టుకోలేని తల్లి రత్నాలమ్మ రోదన వర్ణనాతీతం. ఈ సంఘటన గురించి తెలియగానే చీపుర్లపాడు సర్పంచ్ గొండు లక్ష్మణరావు, పీఏసీఎస్ డెరైక్టర్ వెలమల చిన్నారావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సమైక్యాంధ్ర బంద్ వల్లే...
సమైక్యాంధ్ర మద్దతుగా ఆర్టీసీ బస్సులు బంద్ పాటించడంతో విధిలేని పరిస్థితుల్లో మోటారు బైక్‌లపై విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చిందని మృతుల మిత్రులు చెప్పారు. దుబాయ్ వెళ్తున్న మిత్రుడు శిమ్మ శిమ్మయ్యను విశాఖలో విమానం ఎక్కించేందుకు బైక్‌లపై బయలు దేరిన బాడాన నరేష్, శిమ్మ పెంటయ్యలు మృత్యువు బారిన పడడం అందర్నీ కలచివేసింది. ఈ ఘోరాన్ని తట్టుకోలేకపోతున్నామని చీపుర్లపాడు గ్రామస్తులు విచారాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement