తెలంగాణ బిల్లుకు న్యాయశాఖ ఓకే
కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగానే బిల్లు
అసెంబ్లీలో చర్చ కోసం 25న రాష్ట్రానికి బిల్లు
డిసెంబర్ 19న లోక్‌సభకు.. ఆ వెంటనే రాజ్యసభకు.. సీఎంకు హస్తిన నుంచి సమాచారం
సజీవంగానే ‘రాయల తెలంగాణ’ అంశం
ఈ సంప్రదింపులన్నీ హడావుడేనంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర విభజనకు సంబంధించి పార్టీలు, పలు ప్రభుత్వ శాఖల నుంచి ఒక పక్క అభిప్రాయాలను, సమాచారాన్ని కోరుతున్న కేంద్ర ప్రభుత్వం, మరో పక్క తెలంగాణ బిల్లును సిద్ధం చేసేసింది. కేంద్ర హోం శాఖ రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం కూడా తెలిపింది. ఈ మేరకు హస్తిన నుంచి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి స్పష్టమైన సమాచారం అందింది. హోం శాఖ పంపిన బిల్లుకు కేవలం రెండు రోజుల్లోనే న్యాయ శాఖ ఆమోదం తెలిపిందని రాష్ర్ట ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు ధ్రువీకరించాయి! కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా బిల్లును రూపొందించారని, అయితే రాయల తెలంగాణ అంశాన్నిఇంకా సజీవంగానే ఉంచారని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సమాచారం వచ్చింది. అంతేగాక తెలంగాణ బిల్లును నవంబర్ 25వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపిస్తున్నట్టు కూడా తెలియజేశారు. బిల్లులో అంశాలపై శాసనసభ చర్చిస్తుంది. 10 జిల్లాల తెలంగాణ అని బిల్లులో ప్రస్తుతానికి పేర్కొన్నా, అది అసెంబ్లీ ముందుకు వచ్చేసరికల్లా కర్నూలు, అనంతపురాలను కలిపి 12 జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేస్తామని పేర్కొనే అవకాశాలున్నాయని బలంగా విన్పిస్తోంది. బిల్లుపై ఒకవేళ అసెంబ్లీలో ఓటింగ్ అనివార్యమయ్యే పరిస్థితే గనుక తలెత్తితే దాన్ని నెగ్గించుకునేందుకు అవసరమైన మెజారిటీ కోసమే ఈ యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
19న లోక్‌సభకు...
అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... తెలంగాణ బిల్లును డిసెంబర్ 19న పార్లమెంటు ఆమోదం కోసం ప్రవేశ పెడుతారు. ఆ వెంటనే దాన్ని రాజ్యసభ ఆమోదానికి పంపుతారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అడుగుతున్న సమాచారమంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యా ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసమేనని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలను, సమాచారాన్ని తీసుకున్నట్టుగా పైకి కన్పించాలనే ఉద్దేశంతోనే పార్టీల అభిప్రాయాలను కేంద్రం కోరుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ సమస్యను ఏ ఆథారిటీ ద్వారా పరిష్కరిస్తారో బిల్లులో పేర్కొనడంతో సరిపెడతారే తప్ప ఎలా పరిష్కరిస్తారో ఎక్కడా ఉండదని కూడా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలేమైనా ఉంటే కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ శాఖ పరిష్కారం చూపుతుంది. ఉద్యోగుల పంపిణీ వ్యవహారంపై ఉన్నతస్థాయి అధికారి నేతృత్వంలో అథారిటీ వేస్తారు. నీటి సమస్యలుంటే కేంద్ర జల సంఘం పరిష్కరిస్తుంది’ అని మాత్రమే బిల్లులో పేర్కొంటారని వివరించాయి.