ఎందరు వద్దంటున్నా.. ఎంతకైనా తెగించి!
ఎంతమంది వద్దని చెబుతున్నా వినకుండా మొండిగా రాష్ట్ర విభజనపై ముందుకెళ్తున్న కాంగ్రెస్ పెద్దలు.. రాజ్యసభలో సోమవారం నాడు నిరసన తీవ్రతను కళ్లారా చూశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. కాగితాలను చించేసి.. చివరకు చైర్మన్ మైకును కూడా విరగ్గొట్టారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు కూడా ప్రదర్శించారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో, ఎలాగైనా తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి అధికార పక్షం అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆందోళన చేస్తున్న ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసి, వారు రాకుండా చేసి అప్పుడు బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే శుక్రవారం నాడు రాజ్యసభలో పది మంది ఎంపీల పేర్లను కూడా చదివారు.
ప్రధాన ప్రతిపక్షం బీజేపీని ఎలాగోలా ఒప్పించి, నచ్చజెప్పి రాజ్యసభలో తెలంగాణ బిల్లును గట్టెక్కించుకోవాలనే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పెద్దలు మునిగి తేలుతున్నారు. మంగళవారం నాడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడుతో ఇప్పటికే జైరాం రమేష్ తదితరులు మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు ఇవే చిట్టచివరి సమావేశాలు కావడంతో ఎలాగోలా తెలంగాణ ప్రక్రియను కొంతవరకు ముందుకు నడిపించి, తాము ప్రయత్నం చేశామని చెప్పుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 'రాహుల్ గాంధీ ఎన్నికల ఎజెండా' అని తెలంగాణ బిల్లును బీజేపీ అభివర్ణిస్తోంది. దీన్ని బట్టే కాంగ్రెస్ వ్యూహాలు అర్థమవుతాయి. ''ప్రజలు వద్దనుకుంటున్నప్పుడు, అసెంబ్లీ కూడా విభజన బిల్లును తిరస్కరించినప్పుడు కూడా పార్లమెంటులో ఎలాగోలా బిల్లును ముందుకు తీసుకెళ్లాలనుకోవడం తగదు'' అంటూ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా సైతం వ్యాఖ్యానించడంతో ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు తెలుసుకుంటారేమో!!