
సెక్షన్-8పై రౌండ్ టేబుల్ సమావేశం రసాభాస
విశాఖ : సెక్షన్-8పై విశాఖపట్నంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులు తమ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు సెక్షన్-8 గుర్తుకొచ్చిందా అని వారు ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులపైనా, న్యాయమూర్తులపైనా దాడి జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదన్నారు. ఇప్పుడు వేదికపై ఉన్నవారంతా అప్పుడు ఎందుకు స్పందించలేదని న్యాయవాదులు సూటిగా ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు అంటే... విశాఖ ఎందుకు చర్చ పెట్టారని పలువురు న్యాయవాదులు నిలదీశారు.
ప్రస్తుతం వేదికపై ఉన్నవారంతా సమైక్య ఉద్యమంలో తప్పుకున్నారని, తామే చివరివరకూ పోరాడమని, 200 రోజుల పాటు కోర్టుల్లో విధులకు హాజరు కాలేదని గుర్తు చేశారు. హైకోర్టులో అలజడి రేగినప్పుడు ఎందుకు స్పందించలేదని లాయర్లు ప్రశ్నించారు. కాగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం నిర్వహణలో 'ఇంప్లిమెంటేషన్ అండ్ అమెండ్మెంట్ టు సెక్షన్ 8 ఆఫ్ ఏపీ రీఆర్గనైజింగ్ యాక్ట్' అంశంపై హోటల్ దసపల్లాలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు పాల్గొన్నారు.