న్యాయవాదులు.. ఉపాధ్యాయులు.. దేశానికి పట్టుగొమ్మలు
=తెలంగాణ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు రాదు
=న్యాయవాదుల శంఖారావంలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు
విజయవాడ, న్యూస్‌లైన్ : దేశానికి న్యాయవాదులు, ఉపాధ్యాయులే పట్టుగొమ్మలని, స్వాతంత్య్రోద్యమంలో కూడా వారే ముందుండి నడిపించారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఆధ్వర్యంలో న్యాయవాద సమైక్య శంఖారావం సభను స్థానిక నక్కలరోడ్డు కూడలి వద్ద అమరజీవి పొట్టిశ్రీరాములు ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అశోక్‌బాబు మాట్లాడుతూ ఉద్యమానికి న్యాయవాదులు కళ్లూ చెవులని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చాలా దూకుడుగా, దుర్మార్గంగా ఆలోచిస్తోందన్నారు. రైతులు రెండు తుపానులతో విలవిలలాడుతుంటే వారి బాధలు గాలికొదిలేసి రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలా అని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. తెలంగాణ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు రాదని ఆయన చెప్పారు.
జీవోఎంలో మంత్రులు.. ఎందుకు పనికిరారు...
13 జిల్లాల జేఏసీ కన్వీనర్, బీబీఏ అధ్యక్షుడు మట్టా జయకర్ మాట్లాడుతూ జీవోఎంలో ఉన్న మంత్రులు వారి రాష్ట్రాలలో ఎందుకు పనికిరారని, వాళ్ల నాయకత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలు వద్దనుకున్నారని దుయ్యబట్టారు. అవిశ్వాసానికి నోటీసులిచ్చిన ఎంపీలను గౌరవిస్తున్నామని చెప్పారు. ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను ఆ పార్టీ ఎంపీలే విశ్వసించలేదని ఎద్దేవా చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికినే కోల్పోతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించిన ఎంపీలు, శాసనసభ్యులు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. విద్యార్థులు, మహిళలు, న్యాయవాదులు, ఉద్యోగులు తదితర జేఏసీలతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా అందరు సమైక్యాంధ్రకు మద్దతునిస్తారని చెప్పారు. రాహుల్‌ని ప్రధానిని చేయడానికి సోనియా అష్టకష్టాలు పడుతోందని విమర్శించారు.
ఇది ఆఖరి పోరాటం...
హైకోర్టు న్యాయవాది సీహెచ్ కోటేశ్వరి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తమది ఆఖరు పోరాటమన్నారు. దిగ్విజయ్‌సింగ్‌కి దమ్ముంటే సీమాంద్ర ప్రజలలో తిరగాలన్నారు. నజరానాల కోసమో, సూట్‌కేసుల కోసమో రాజకీయ నాయకులు చూడకుండా ప్రభుత్వాలను త్వరగా పడ గొట్టాలని కోరారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, ముప్పాల సుబ్బారావు, గోకుల్‌కృష్ణ, కనకమేడల రవీంద్రకుమార్, మచిలీపట్నం బార్ అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, గోగుశెట్టి వెంకటేశ్వరరావు, నరహరిశెట్టి శ్రీహరి, చోడిశెట్టి మన్మథరావు, ఎన్‌ఎస్ రాజు, వలిబోయిన కిరణకుమార్, ఆటోనగర్ టెక్నీషియన్ అసోసియేషన్ నాయకులు ఎ.నాగేశ్వరరావు, వేముల హజరత్తయ్య గుప్తా, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ వి.నారాయణరావు, పిళ్లా రవి, విద్యాసాగర్ ప్రసంగించారు. సమావేశానికి ముందు మహిళా న్యాయవాదులు వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వేదిక పైకి వక్తలను బీబీఏ ప్రధాన కార్యదర్శి లాం చిన ఇజ్రాయేల్ ఆహ్వానించారు.