రాష్ట్రంలో పాలకులే దోపిడీదారులు
రాష్ట్రంలో పాలకులే దోపిడీదారులు
Published Sun, Dec 11 2016 9:16 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
వినుకొండ టౌన్: ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులే దోపిడీదారులుగా వ్యవహరించడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. కాసు మహేష్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికను పురష్కరించుకొని జనసమీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల సొమ్మును లూఠీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ దోపిడీ చేసిన సొమ్మును అణాపైసలతో సహా వసూలు చేయడం ఖాయమంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. వ్యాపార ముసుగులో అడ్డగోలుగా సంపాదించిన జీవి ఆంజనేయులుకు జగన్‌ను విమర్శించే స్థాయి ఉందా అని ప్రశ్నించారు. చరిత్రలో రాజన్న పాలనకు ముందు, రాజన్న పాలన తరువాత అన్న ముద్ర పడిందని, నాటి రామ పాలన మరలా తిరిగి రాష్ట్రంలో నెలకొనాలంటే జగనన్న వల్లే సాధ్యమవుతుందన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధికార పార్టీ తుంగలో తొక్కడంతో పేదలు, బడుగులు, బలహీనవర్గాలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాసు మహేష్ రెడ్డి చేరికతో పల్నాడులో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. మహేష్ రెడ్డి పార్టీలో చేరిక సభకు లక్షలాదిమంది తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో వందల హామీలు గుప్పించిన టీడీపీ పార్టీ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. సమావేశం జరుగుతున్నంత సేపు యువత ఈలలు, కేరింతలతో తమ మద్దతును వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా యువత అధ్యక్షులు డైమండ్ బాబు, ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, బీసీ సెల్ కన్వీనర్ సునీల్, మైనార్టీ సెల్ ముస్తఫా, పట్టణ,మండల కన్వీనర్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Advertisement