ధైర్యసాహసాలతో నిర్ణయం
తెలంగాణ ఏర్పాటుకు ఎన్ని అడ్డంకులున్నా సోనియా అత్యంత సాహసోపేతంగా నిర్ణయం అమలుచేశారు. అన్ని పార్టీలను ఒప్పించి ఏకతాటిపైకి తెచ్చారు. ఆమెను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఆత్మబలిదానాలు చేసుకున్న అమరులందరికీ ఈ తెలంగాణ అంకితం.
- ఎంపీలు పొన్నం ప్రభాకర్, షెట్కార్, రాజయ్య
తెలంగాణ కల నెరవేరింది
తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదంతో యాభై ఏడేళ్ల తెలంగాణ కల ఫలించింది. సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజలందరికీ శుభాభినందనలు.
- మంత్రి శ్రీధర్‌బాబు
ఎన్నో ఏళ్ల కల నిజమైంది
తెలంగాణవాదుల ఎన్నో ఏళ్ల కల నేటితో సాకారమైంది. సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించిన బీజేపీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలకు కృతజ్ఞతలు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో 16 నుంచి 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాకు బహుమతిగా ఇవ్వాలి.
- పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ
అన్నదమ్ముల్లా కలిసుందాం
ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసుందాం. రెండు ప్రాంతాలు కలసి ఉమ్మడిగా అభివృద్ధి చెందుదాం. ఇది గెలుపోటములకు సంబంధించిన విషయం కాదు. అన్ని పార్టీలు, జేఏసీలు, ప్రజాసంఘాలు కలసి పోరాడితేనే తెలంగాణ కల సాకారమైంది.
- ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కె.రాజగోపాల్‌రెడ్డి, మధుయాష్కీ
తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతాం
రాష్ట్ర విభ జనకు సహకరించిన సోనియా, సుష్మాలకు కృతజ్ఞతలు. ఇక తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతాం. ఇది సంబరాల సమయం. పార్టీ విలీనం, పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉంది. - వినోద్, టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ
సామాజిక తెలంగాణ ఆకాంక్షిస్తున్నాం
ఈ తెలంగాణ అమరవీరులకు అంకితం. సామాజిక తెలంగాణ కావాలని మేం ఆకాంక్షిస్తున్నాం. - టీడీపీ ఎంపీలు దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి
సోనియా మాట నిలబెట్టుకున్నారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రజలకిచ్చిన మాటను సోనియా నిలబెట్టుకున్నారు. రాష్ట్రం ఆలస్యానికి కాంగ్రెస్సే కారణమైనా బిల్ పాస్ చేయడానికి పార్టీ నేతలు పడిన కష్టాలు తెలంగాణ ప్రజలంతా గుర్తించాలి. - నిరంజన్ (తెలంగాణ సారథ్య బృందం)
పెద్దమ్మ, చిన్నమ్మ కలసి రాష్ట్రాన్ని చీల్చారు
పెద్దమ్మ సోనియా, చిన్నమ్మ సుష్మాస్వరాజ్ కలసి రాష్ట్రాన్ని చీల్చారు. సీమాంధ్రులకు ఇస్తామన్న ప్యాకేజీలు హైదరాబాద్ కాలిగోటికి సరిపోవు. ప్రజాస్వామ్యంపై వీరికి గౌరవం లేదని తేటతెల్లమైంది. తెలంగాణ ఏర్పాటుతో గేమ్ ముగిసింది. ఇక సీమాంధ్రుల హక్కుల పరిరక్షణకు పోరాడతాం. - టీడీపీ ఎంపీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
- సాక్షి, న్యూఢిల్లీ
బిల్లు ఆమోదంపై ఎవరేమన్నారంటే..
Published Fri, Feb 21 2014 4:01 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement