కడప: మూడేళ్లుగా ఎలాంటి పదవులు లేకపోవడంతో నిరుత్సాహంగా కాలం గడిపిన పట్టణాల్లోని రాజకీయనేతలు మునిసిపల్ ఎన్నికల సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉన్న ఫళంగా మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం... అభ్యర్థుల ఎంపికకు వారం మాత్రమే గడువుండటంతో ఓ వైపు అభ్యర్థుల ఎంపిక.. మరో వైపు ఎన్నికల ఖర్చుకు డబ్బుల మూటలను పోగు చేసుకోవడంపై దృష్టి సారించారు. క్షణం తీరిక లేకుండా చర్చలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
వారం రోజులు...
236 మంది అభ్యర్థులు:
మునిసిపల్ ఎన్నికల నామినేషన్లు ఈ నెల 10 నుంచి స్వీకరిస్తారు. అంటే అభ్యర్థుల ఎంపికకు వారం రోజులు మాత్రమే గడువుంది. ఈ వారంలో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న పార్టీలు కార్పొరేషన్‌తో పాటు ఎన్నికలు జరగబోయే అన్ని మునిసిపాలిటీల్లోని 236వార్డులకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయడం అన్నిపార్టీలకు కత్తిమీద సాముగా మారింది. ముఖ్యంగా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ హవా జోరుగా ఉండటంతో మునిసిపల్ ఎన్నికలకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కదనోత్సాహంతో సిద్ధమయ్యారు.
మునిసిపల్ ఎన్నికల బరిలో ప్రథమంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు దిగుతుండటంతో ఏ వార్డుకు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా వారి గెలుపే ధ్యేయంగా పనిచేసి అన్ని మునిసిపాలిటీల పాలకవర్గాలను దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో కార్యకర్తలు ఉన్నారు. నాయకత్వం కూడా ఆ దిశగానే పావులు కదుపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కాంగ్రెస్‌పార్టీ మునిసిపల్ ఎన్నికల రేసులో ఉన్నా నామమాత్రపు పోటీకే పరిమితమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
గతం పునరావృతమవుతుందనే
టెన్షన్‌లో టీడీపీ:
గత మునిసిపల్ ఎన్నికలు కడప కార్పొరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలులో జరిగాయి. అప్పట్లో ఒక్కపాలక వర్గాన్ని కూడా తెలుగుదేశంపార్టీ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ హవా జోరుగా ఉండటంతో ఈ ఎన్నికల్లో కూడా గతేడాది అనుభవం తప్పదనే భయం టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. అలాగే కొత్తగా ఆవిర్భవించిన మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో కూడా టీడీపీ గెలుపొందడం కష్టమే.
దీనికి తోడు ఎన్నికల వ్యయం భారీగా పెరగడంతో పోటీచేసేందుకు అభ్యర్థులు జంకుతున్నారు. ఈ క్రమంలో వారంలోపు అభ్యర్థులను వెతకడం తమ్ముళ్లకు విషమపరీక్షగా మారింది. వామపక్షపార్టీలు జిల్లాలో ఉన్న కొన్ని వార్డులకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి.
డబ్బుమూటల వేటలో నేతలు:
ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కు 26 రోజులు గడువుంది. దీంతో ఎన్నికల వ్యయానికి అవసరమయ్యే డబ్బుమూటల వేటకు సన్నద్ధమయ్యారు. బరిలో నిలవాలనుకునే వ్యక్తులు తమకు బాకీలు ఉన్నవారి వద్ద వసూళ్లు,స్థిరాస్తుల అమ్మకాలు, అప్పులు తెచ్చుకోవడం, విరాళాలతో పాటు అన్నిమార్గాలను అన్వేషించి డబ్బులు పోగు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే మద్యం దుకాణాలకు అడ్వాన్స్‌లు చెల్లించి మద్యం కేసులను దిగుమతి చేసుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల సరిహద్దుల్లో పోలీస్ నిఘా కట్టుదిట్టంగా ఉంటుంది. ఈక్రమంలో ఎన్నికల వ్యయం కోసం డబ్బులు సేకరించుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవడం పార్టీలకు కష్టతరమైన పని. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా నెలరోజుల పాటు కోరుకున్న పదవిని దక్కించుకునేందుకు అన్నిపార్టీలు అవిశ్రాంతంగా పోరాడేందుకు సన్నద్ధమయ్యాయి.