వీడిన హత్య కేసు మిస్టరీ
నిందితులను పట్టించిన మృతురాలి గాటు
పార్వతీపురం : మృతురాలి పీకపై ఉన్న గాటు ఆధారంగా పార్వతీపురం పోలీసులు హత్యకేసు మిస్టరీని ఛేదించారు. వివాహిత మృతిపై ఆమె సోదరుడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితులను ఐదు రోజుల్లోనే పట్టుకొని మంగళవారం మీడియా ముందుంచారు. పార్వతీపురం సీఐ వి.చంద్రశేఖర్ అందించిన వివరాలిలా ఉన్నాయి...
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన అనుపోజు సరస్వతి(25)ని పార్వతీపురం చెరువు గట్టు వీధికి చెందిన రాలి అప్పారావు, ఈశ్వరమ్మల కుమారుడు రాలి సంతోష్ కుమార్‌కు గత ఏడాది అక్టోబర్‌లో ఇచ్చి వివాహం చేశారు. గతంలో తనకు వేరే మహిళతో ఉన్న సంబంధంపై అనుమానించడం, ఇంట్లో ప్రతి పనికీ అడ్డుతగలడంతో సరస్వతిని అంతం చేయాలని సంతోష్‌కుమార్ భావించాడు. దీనికితోడు సరస్వతి చనిపోతే వేరే పెళ్లి చేసుకోవచ్చని భావించి అవకాశం కోసం ఎదురుచూశాడు. కుటుంబసభ్యులంతా గత నెల 30నఇంట్లో అగ్నిగంగమ్మ పండగ జరుపుకున్నారు.
ఈ వేడుకకు వచ్చిన గజపతినగరం చుట్టం ధర్మవరపు పుష్ప ఓ గదిలో, తల్లిదండ్రులు మరొక గదిలో, భార్యాభర్తలు వేరే గదిలోనూ పడుకున్నారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో సంతోష్‌కుమార్ తన తండ్రి వద్దకు వెళ్లి మన మాటకు అడ్డు తగులుతూ అనుమానిస్తున్న సరస్వతిని చంపేద్దామని చెప్పాడు. దీనికి తండ్రి అంగీకరించాడు. వెంటనే సంతోష్‌కుమార్ తన గదిలోకి వెళ్లి నిద్రిస్తున్న సరస్వతిని జుట్టుపట్టుకొని తీసుకొచ్చి మంచం కోడుకు పీక ఆనించి గొంతు పెగలకుండా బలంగా నొక్కిపట్టాడు.
ఆమె కాళ్లు కదలకుండా తండ్రి గట్టిగా పట్టుకోవడంతో అతి కిరాతకంగా చంపేశారు. తర్వాత పైకప్పుకు చున్నీతో వేలాడ దీసి ఉరి వేసుకున్నట్లు చేశారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన సంతోష్‌కుమార్ తల్లి ఈశ్వరమ్మ, చుట్టం పుష్పకు సరస్వతి ఉరి వేసుకున్నట్లు నమ్మించారు. విషయం బయటకు తెలిస్తే సమస్య వస్తుందని, మామూలుగా ఇంట్లో పడిపోయి చనిపోయినట్లు అందరికీ నమ్మబలికారు. తమ కులాచారం ప్రకారం మృతదేహానికి పసుపు రాసి, మెడపై ఉన్న మంచం కోడు గాటును, ఉరి తాలూకా అచ్చులు కనిపించకుండా మెడకు తువ్వాలు చుట్టి రోకలిని ఆనించి కూర్చోబెట్టారు.
సోదరుడి ఫిర్యాదుతో వెలుగులోకి..
ముందు రోజు వరకు సంతోషంగా ఉన్న తమ సోదరి అకస్మాత్తుగా మరణించిందనే విషయాన్ని జీర్ణించుకోలేని మృతురాలి సోదరుడు అనుపోజు అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మృతురాలి పీకపై ఉన్న గాటును గుర్తించారు. దీంతో నిందితులను అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో పట్టణ, రూరల్ ఎస్‌ఐలు బి.సురేంద్రనాయుడు, వి.అశోక్ కుమార్, సిబ్బంది ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
అనుమానిస్తోందని అంతమొందించారు
Published Tue, Apr 5 2016 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
Advertisement
Advertisement