
సాక్షి, విజయనగరం : పార్వతీపురంలో నవ వరుడి హత్య ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పథకం ప్రకారమే భర్తను భార్య హత్య చేయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులోని పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ పాలరాజు మీడియాకు తెలిపారు. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడ్డ నిందితురాలు సరస్వతి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న మేనబావను ఫేస్‌బుక్ ప్రేమికుడితో కలిసి హత్య చేసింది. పెళ్లికి ముందే ఫేస్‌బుక్‌లో శివ అనే వ్యక్తితో సరస్వతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంతలోనే తన మేనబావతో ఆమెకు పెళ్లి జరిగిపోయింది. ప్రేమించిన యువకుడి కోసం పెళ్లి చేసుకున్న భర్తను అడ్డుతొలగించుకోవడానికి పథకం పన్నింది. దాని కోసం ప్రియుడితో కలిసి గోపి, రామకృష్ణ అనే ఇద్దరు పాత నేరస్తులతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పందం ప్రకారం ఎనిమిది వేల నగదును, పెళ్లి ఉంగరాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చింది. ప్లాన్ ప్రకారం తోటపల్లి ప్రాజెక్టు వద్దకు రాగానే మూత్రవిసర్జన సాకుతో భర్తను ద్విచక్ర వాహనాన్ని ఆపాల్సిందిగా కోరింది. బండి ఆపిన సరస్వతి భర్త శంకర్‌రావుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి అతని తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఎవరో దుండగులు తన భర్తను హత్య చేశారని సరస్వతీ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఎస్పీకి అనుమానం రావడంతో అసలు విషయం బయట పడింది. పోలీసుల సమిష్టి కృషి, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు కేసును త్వరితగతిన ఓ కొల్కికి వచ్చేలా చేశాయని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను పోలీసు అరెస్టు చేశారు. ఒక నిందితుడు పరారిలో ఉన్నట్లు పోలీసు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment