vijyanagaram
-
ఆ 93 పల్లె సీమల్లో అంతా ప్రకృతి సేద్యమే!
‘‘అమాయకమైన మనసుకే నిండైన ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది..’’ అంటాడు ఓ తత్వవేత్త. విజయనగరం జిల్లా మారుమూల గ్రామాల్లోని గిరిజన రైతులను చూస్తే ఈ మాట ఎంత నిజమో తెలుస్తుంది. రసాయనిక వ్యవసాయం వల్ల మనకు, పశుపక్ష్యాదులకు, ప్రకృతికి ఎంత హాని జరుగుతోందో అర్థం చేసుకున్న ఆ అన్నదాతలు వెనువెంటనే ప్రకృతి వ్యవసాయంలోకి మారిపోయారు. ఒకరు, ఇద్దరు.. పది మంది కాదు.. ఊళ్లకు ఊళ్లే ఒకటి తర్వాత మరొకటి పూర్తిగా ప్రకృతి సేద్య గ్రామాలుగా మారిపోతున్నాయి (వీటినే అధికారులు ‘బయో గ్రామాలు’గా పిలుస్తున్నారు). కొండబారిడితో ప్రారంభమైన బయో గ్రామాల ప్రస్థానం మూడేళ్లలో 93కు చేరింది. మరికొన్ని గ్రామాలు ఈ వరుసలో ఉన్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు ఒక్క గ్రాము కూడా వాడకుండా నేల తల్లికి ప్రణమిల్లుతున్నాయి. బయో గ్రామాల చిన్న, సన్నకారు రైతులు ప్రకృతిని ప్రేమిస్తూ ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, పర్యావరణ పరంగా దినదినాభివృద్ధి సాధిస్తుండటం చాలా గొప్ప సంగతి. ‘ప్రపంచ నేలల పరిరక్షణ దినోత్సవం’ (డిసెంబర్ 5) సందర్భంగా.. బయో గ్రామాల నిర్మాతలైన భూమి పుత్రులందరికీ వినమ్ర ప్రణామాలు! కొండబారిడి.. విజయనగరం జిల్లా కురుపాం మండలంలో మారుమూల పల్లె. నాడు నక్సల్బరి ఉద్యమానికి పురుడు పోసిన ‘కొండబారిడి’ గ్రామామే.. నేడు సంపూర్ణ ప్రకృతి వ్యవసాయ విప్లవానికి నాంది పలికింది. పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కొండబారిడి ‘తొలి బయో గ్రామం’గా మారటం విశేషం. ప్రకృతి వ్యవసాయ ప్రేమికులకు పాఠశాలైంది. కొండబారిడి స్ఫూర్తితో తదుపరి రెండేళ్లలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో మరో 92 (2019లో 51, 2020లో మరో 41) గిరిజన గ్రామాలు వంద శాతం ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా మారాయి. వరితో పాటు రాగి తదితర చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. జీడిమామిడి తదితర తోటల్లోనూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. బయో గ్రామాల్లో వరి, రాగి పంటలను ‘శ్రీ’ విధానంలోనే రైతులు సాగు చేస్తున్నారు. ‘అన్నపూర్ణ’ నమూనాలో ఇంటింకి అరెకరం స్థలంలో కూరగాయలు, పండ్లు తదితర 20 రకాల పంటలు పండిస్తున్నారు. 365 రోజులూ భూమికి ఆకుపచ్చని ఆచ్ఛాదన కల్పిస్తున్నారు. గతంలో సేంద్రియ కర్బనం 0.5 శాతం మేరకు ఉండేది ప్రకృతి సేద్యం వల్ల రెండేళ్ల క్రితం 120 జీడిమామిడి తోటల్లో రెండేళ్ల క్రితం భూసార పరీక్షలు చేసినప్పుడు 0.75 శాతానికి పెరిగిందని జట్టు కార్యనిర్వాహక ట్రస్టీ డా. పారినాయుడు ‘సాక్షి’తో చెప్పారు. పండించిన ధాన్యాన్ని మహిళా స్వయం సహాయక బృందాల మహిళా రైతులు రోకళ్లతో దంచి కిలో రూ. 65 రూపాయలకు నేరుగా ప్రజలకు అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మూడు చోట్ల వీరి ఆహారోత్పత్తులను విక్రయించేందుకు స్టాల్స్‌ను తెరిచారు. కొండబారిడి సహా మొత్తం 93 బయోగ్రామాల్లోని 3,690 మంది రైతులు 10,455 ఎకరాల్లో రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరంతా కాయకష్టం చేసుకునే చిన్న, సన్నకారు రైతులే. అంతా వర్షాధార సేద్యమే. వరి సాగు ఖర్చు ఎకరానికి రూ. 3 వేల నుంచి 4 వేల వరకు తగ్గింది. అంతకు ముందు ఎకరానికి 20 బస్తాల (75 కిలోల) ధాన్యం పండేది ఇప్పుడు 30 బస్తాలకు పెరిగింది. అంటే.. దాదాపు 40 నుంచి 50 శాతం అధిక దిగుబడి పొందుతున్నారు. పొల్లు లేకపోవడం, గింజ బరువు పెరగడంతో నికర బియ్యం దిగుబడితో పాటు రైతు ఆదాయం కూడా పెరిగింది. 93 బయో గ్రామాల్లో రైతులతో పాటు ప్రజలంతా ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యదాయక ఆహారం తింటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. బయో గ్రామాల్లో 98 మంది కోవిడ్ బారిన పడినప్పటికీ ఏ ఒక్కరూ చనిపోలేదు. మలేరియా కేసులు నమోదు కాలేదు. గత పదేళ్ల గణాంకాలు సేకరించగా.. బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యల తీవ్రత 30–40% మేరకు తగ్గిందని డా. పారినాయుడు వివరించారు. మరో 83 గ్రామాల్లో 80% మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారని, వచ్చే రెండేళ్లలో ఈ గ్రామాలు కూడా పూర్తి బయో గ్రామాలుగా మారనున్నాయని ఆయన సంతోషంగా చెప్పారు. ‘స్కోచ్’ అవార్డుకు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైతు సాధికార సంస్థ, జట్టు ట్రస్టు, రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల సహాయ సహకారాలు ప్రకృతి సేద్యంలో రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గిరిజన రైతుల అపూర్వ విజయాలను చూపి ముచ్చటపడిన జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి ‘స్కోచ్’ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపారు. నేలల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ‘అమృత భూమి’ పేరుతో ‘జట్టు’ ఆధ్వర్యంలో కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కూడా ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించటం విశేషం. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరం -
కాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే ఊహించని విషాదం
సాక్షి,విజయనగరం : జిల్లా కేంద్రానికి సమీపంలోని చాకలిపేటలో పెళ్లింట విషాదం అలముకుంది. భారీ వర్షంతో పాటు పిడుగుపడి ఇద్దరు వ్యక్తు లు మృతిచెందగా ముగ్గురు గాయపడ్డారు. విజయనగరం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాకలిపేటలో శుక్రవారం జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఐదుగురు వ్యక్తులు సాయంత్రం రామనారాయణం వద్ద ఉన్న మామిడి తోటలో చెట్ల కింద కూర్చొన్నారు. అనుకోకుండా కురిసిన వర్షానికి తోటలోనే ఉండిపోయారు. అదే సమయంలో పిడుగులు పడడంతో ఒక పక్క కూర్చొన్న చాకలిపేటకు చెందిన పి.ఎర్నిబాబు (28), సురేష్ (26)లు అక్కడికక్కడే చనిపోయారు. మరో వైపు కూర్చొన్న సారిక శ్రీను, వెంకటేష్, కళింగపట్నం పెంటయ్యలు గాయపడ్డారు. ముగ్గురూ కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నారాయణరావు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
కరోనా నేర్పిన కొత్త జీవితం..
విజయనగరం: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంపైనే కాదు... జీవితాల్లోనూ ఎన్నో మార్పులకు కారణమైంది. ప్రస్తుతం ప్రజల జీవనం కరోనాకు ముందు.. తర్వాత అన్నంతగా మారిపోయాయి. లాక్డౌన్ కారణంగా రెండు నెలలపాటు ఇంటికే పరిమితమైన జనం గత కొద్ది రోజులుగా సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. మనసులో మెదిలే భయాందోళన నడుమ.. మున్ముందుకు అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జీవనయానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా భయంతో కొన్ని విషయాల జోలికి వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడడం లేదు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ.. కొత్త తరహా జీవితానికి నాంది పలుకుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తున్నారు. పునర్వినియోగం కానివే మేలు.. నిన్నమొన్నటి వరకు పునరి్వనియోగించే వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. కరోనాతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. పునరి్వనియోగం జరగని వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక్కసారి వాడిపారేసే వస్తువులైతే మరొకరు తాకే అవకాశం ఉండదని భావిస్తున్నారు. దీనివల్ల ఒక్కసారి వాడిపారేసే పెన్నులు, సంచులు, తినబండారాల ప్లేట్లు, కాగితాలు, గ్లాసులు.. తదితర వస్తువుల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాలుష్య కారక వస్తువులకు దూరంగా ఉంటున్నారు. వ స్తువులను తాకేందుకు భయపడుతున్నారు. సాయం అడిగినా.. వాహనం ఆగదే ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైంది.. లాక్డౌన్ సడలింపులు అనంతరం కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా నడిచి వెళ్తుంటే వాహనదారులు ఆగి మరీ లిఫ్టు ఇచ్చి తీసుకెళ్లేవారు. ఇప్పుడు కరోనా భూతం కారణంగా లిఫ్టు అడిగినా ఆపేందుకు వాహనదారులు జంకుతున్నారు. తెలిసిన వ్యక్తులకు దూరంగా ఉంటున్న సమయంలో తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడమా.. అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన పార్టీల జోరు... ఆధునిక ప్రపంచంలో కష్టం వచ్చినా... ఆనందం వచ్చినా పారీ్టల జోరు పెరిగిందనే చెప్పాలి. ఏ చిన్న విజయం సాధించినా ‘దావత్ ఎప్పుడు మామా’ అని అడగడటం మనకు అలవాటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నిరోజుల పాటు దావత్‌లు బంద్ కావాల్సిందే. జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు దావత్ల ద్వారా విస్తరిస్తున్నవే. సరదాగా గడిపేందుకో లేదా పుట్టినరోజనో ఒకచోట చేరి పార్టీ చేసుకున్న సందర్భాల్లో కరోనా పంజా విసురుతోంది. అందుకు దావత్‌లకు ప్రజలంతా దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత రవాణాకే మొగ్గు ప్రస్తుతం జిల్లాల బస్సులకే ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ ప్రజల నుంచి స్పందన తక్కువేనని చెప్పాలి. బస్సుల వద్ద శానిటైజర్లు వంటివి ఉంచామని అధికారులు చెబుతున్నా.. ప్రజా రవాణాకు మొగ్గు చూపేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. నగరంలోనూ వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. బైక్‌లు, కార్లునే ప్రయాణానికి వినియోగిస్తున్నారు. బైక్‌లపై ఒక్కొ క్కరే ప్రయాణిస్తున్నారు. తీసుకెళ్లండి.. తినండి.. లాక్‌డౌన్‌కు ముందు జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు రద్దీగా కనిపించేవి. ప్రస్తుతం వాటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించినా భోజన ప్రియులు మాత్రం వచ్చేందుకు జంకుతున్నారు. పది మందిలో కలిసి తింటే కరోనా వైరస్ వ్యాప్తిస్తుందన్న భయంతో కేవలం పార్సిల్ సర్వీసులకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కూర్చుని తినాలంటే ఆందోళన పడాల్సిన పరిస్థితి. పార్సిల్ తీసుకెళ్లడం ద్వారా ఇంట్లోనే ఉండి తినే వీలుంటుంది. నగరంలోని ఓ హోటల్లో టేబుల్‌కు ఒక్కరు చొప్పునే వడ్డింపు జాగ్రత్తలతోనే ఆరోగ్యకర జీవనం ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోడం తప్పనిసరిగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం నిత్యకృత్యం చేసుకోవాల్సిందే. ప్రపంచా న్ని గడగడలాడిస్తున్న వైరస్ బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఉత్తమం. – ఎస్.ఎస్.వర్మ, కమిషనర్, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ -
భర్తను చంపించిన సరస్వతి కేసులో మరో నిజం
సాక్షి, విజయనగరం : పెళ్లైన కొన్ని రోజులకే ఫేస్బుక్ లవర్‌తో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించి, రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్వతీపురం సరస్వతి కేసులో మరో విస్తుపోయే నిజం పోలీసులు వెల్లడించారు. ఆదివారం విజయనగరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తనకు కాబోయే భర్త తన మేనబావ అయిన గౌరీ శంకర్‌ను హత్య చేయించడానికి సరస్వతి బెంగుళూరు ముఠాతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. పెళ్లికి ముందే ఫేస్బుక్ లవర్ శివతో కలిసి బెంగుళూరుకు చెందిన ఓ ముఠాకు 25 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారని వెల్లడించారు. ఆ నగదును శివ ఆన్లైన్ నగదు చెల్లింపు యాప్ ద్వారా పంపినట్టు తెలిపారు. అయితే అడ్వాన్సు తీసుకున్న ముఠా ఫోన్ ఎత్తకపోవడంతో, విజయనగరానికి చెందిన మరో ముఠాతో ఒప్పందం చేసుకుని శివతో కలిసి సరస్వతి ఆమె భర్త గౌరీ శంకర్‌ను హత్య చేయించి, దుండగుల దాడిలో మరణించాడని నాటకమాడిన విషయం తెలిసిందే. -
ఫేస్బుక్ లవర్‌తో కలిసి భర్తను చంపిన సరస్వతి
సాక్షి, విజయనగరం : పార్వతీపురంలో నవ వరుడి హత్య ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పథకం ప్రకారమే భర్తను భార్య హత్య చేయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులోని పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ పాలరాజు మీడియాకు తెలిపారు. ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడ్డ నిందితురాలు సరస్వతి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న మేనబావను ఫేస్బుక్ ప్రేమికుడితో కలిసి హత్య చేసింది. పెళ్లికి ముందే ఫేస్బుక్లో శివ అనే వ్యక్తితో సరస్వతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంతలోనే తన మేనబావతో ఆమెకు పెళ్లి జరిగిపోయింది. ప్రేమించిన యువకుడి కోసం పెళ్లి చేసుకున్న భర్తను అడ్డుతొలగించుకోవడానికి పథకం పన్నింది. దాని కోసం ప్రియుడితో కలిసి గోపి, రామకృష్ణ అనే ఇద్దరు పాత నేరస్తులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఎనిమిది వేల నగదును, పెళ్లి ఉంగరాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చింది. ప్లాన్ ప్రకారం తోటపల్లి ప్రాజెక్టు వద్దకు రాగానే మూత్రవిసర్జన సాకుతో భర్తను ద్విచక్ర వాహనాన్ని ఆపాల్సిందిగా కోరింది. బండి ఆపిన సరస్వతి భర్త శంకర్రావుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి అతని తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఎవరో దుండగులు తన భర్తను హత్య చేశారని సరస్వతీ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఎస్పీకి అనుమానం రావడంతో అసలు విషయం బయట పడింది. పోలీసుల సమిష్టి కృషి, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు కేసును త్వరితగతిన ఓ కొల్కికి వచ్చేలా చేశాయని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను పోలీసు అరెస్టు చేశారు. ఒక నిందితుడు పరారిలో ఉన్నట్లు పోలీసు తెలిపారు. -
జంగారెడ్డిగూడెం సీటీవో బదిలీ
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం సీటీవో వి.కేదారేశ్వరరావు బదిలీ అయ్యారు. ఆయనను విజయనగరం జిల్లా తోమయ్యవలస బోర్డర్ చెక్‌పోస్టుకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీసీటీవో ఎ న్ .దుర్గారావు ఇటీవలే ఆకివీడుకు బదిలీ కాగా, సీటీవో కేదారేశ్వరరావును బోర్డర్ చెక్‌పోస్టుకు బదిలీ చేశారు. జంగారెడ్డిగూడెంలో అనధికార వసూళ్ల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో ‘వసూల్ రాజాలు’ శీర్షికన గత డిసెంబర్ 1న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు సీటీవో వి.కేదారేశ్వరరావును విచారణ అధికారిగా నియమించారు. విచారణ నేపథ్యంలో డీసీటీవో, సిబ్బంది తనను బెదిరిస్తున్నారని కేదారేశ్వరరావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో జంగారెడ్డిగూడెం ఇన్ చార్జ్ సీటీవోగా తణుకు సీటీవో కేవీఎస్ ఆంజనేయులు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావు సీటీవో కేదారేశ్వరరావును తోమయ్యవలస బోర్డర్ చెక్‌పోస్టుకు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎయిర్పోర్ట్ భూసేకరణపై గ్రామస్తుల ఆగ్రహం
భోగాపురం(విజయనగరం): ‘ఎయిర్పోర్ట్ కోసం భూములు తీసుకోబోమని హామీ ఇస్తేనే మా గ్రామాల్లోకి రండి.. లేకపోతే వెళ్లిపోండి’అని అధికారులను విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం, కవులవాడ గ్రామాల ప్రజలు నిలదీశారు. శనివారం నీరు-చెట్టు కార్యక్రమ నిర్వహణకు ఈ గ్రామాలకు వెళ్లిన ఎంపీడీవో, ఇతర అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమాన్ని రైతులు, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. గ్రామస్తుల డిమాండ్‌ను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. విమానాశ్రయం నిర్మాణానికి ఒక్క భోగాపురం మండలం నుంచి 15 వేల ఎకరాలు తీసుకోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నందున అక్కడ ఐదు వేల ఎకరాలు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని విజయనగరంలో విలేకరులకు తెలిపారు.