parvathipuram police
-
దొంగలు బాబోయ్ దొంగలు
పార్వతీపురం : మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా దొంగలు చెలరేగిపోతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లతో పాటు ఊరికి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఉదయం వేళ పట్టణం వ్యాప్తంగా కలియదిరుగుతూ ఎక్కడ తాళాలు వేసి ఇళ్లు ఉన్నాయో, ఊరికి దూరంగా ఎక్కడ ఇళ్లు ఉన్నా యో గుర్తించి రాత్రి సమయంలో పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల పార్వతీపురం పురపాలకసంఘ పరిధిలోని వైకేఎం కాలనీలో ఒకే రోజు ఏడిళ్లలో దొంగతనాలకు పాల్పడడం సంచలనం రేపింది. అలాగే ఆ సంఘటన జరిగిన రెండోరోజే మళ్లీ నర్సిపురం పంచాయతీ ఓలేటి ఫారం వద్ద తలుపులు వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగింది. రెండురోజుల కిందట 15వ వార్డు అగురవీధిలో పట్టపగలు ఉదయం 8 గంటలకే ఇంటి లో చోరీ జరిగింది. ఇలా వరుస చోరీలతో పట్టణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఒకపక్క పార్థి గ్యాంగ్ తిరుగుతున్నట్లు వాట్సాప్‌లో విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలాంటి దొంగతనాలు జరగడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. చుక్కలు చూపిస్తున్న దొంగలు... వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. నిఘా విభాగం ఎంతో అభివద్ధి చెందిన రోజుల్లో కూడా దొంగలు పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. రాత్రి, పగలు పోలీసులు పహారా కాస్తున్నా వారి కళ్లు గప్పి మరీ దొంగలు తమ చేతికి పనిచెబుతున్నారు. పోలీసులకు ఎటువంటి ఆనవాళ్లు దొరకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఒకదాని వెంట ఒకటి వరుసగా జరుగుతున్న దొంగతనాలతో పోలీసులకు చెమటలు పడుతున్నాయి. ఇటీవల ఒకేరోజు వైకేఎం కాలనీలో ఏడు ఇళ్లలో దొంగతనాలు జరగడంతోనే ఆ ప్రభావం పట్టణ ఎస్సై ఎం. రాజేష్‌పై పడిందని.. అందులో భాగంగానే ఆయన ఇక్కడ నుంచి బదిలీ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం ఇవ్వాలి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తుగా సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమీపంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి వీధుల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిని గుర్తిస్తాం. దీంతో వెంటనే సిబ్బంది ఆయా ప్రాంతాలకు క్షణాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంటిలో లేనప్పుడు విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉంచకూడదు. – ఎం. దీపికాపాటిల్, పార్వతీపురం ఏఎస్పీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ప్రస్తుతం సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో బహుళ అంతస్తులు, గ్రూప్ హౌస్‌ల్లో ఉన్నవారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. కెమేరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరస్తులను సులువుగా పట్టుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇస్తే ఇంటిపై నిఘా పెడతాం. – జి.రాంబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ . -
ఫేస్బుక్ లవర్‌తో కలిసి భర్తను చంపిన సరస్వతి
సాక్షి, విజయనగరం : పార్వతీపురంలో నవ వరుడి హత్య ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పథకం ప్రకారమే భర్తను భార్య హత్య చేయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులోని పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ పాలరాజు మీడియాకు తెలిపారు. ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడ్డ నిందితురాలు సరస్వతి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న మేనబావను ఫేస్బుక్ ప్రేమికుడితో కలిసి హత్య చేసింది. పెళ్లికి ముందే ఫేస్బుక్లో శివ అనే వ్యక్తితో సరస్వతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంతలోనే తన మేనబావతో ఆమెకు పెళ్లి జరిగిపోయింది. ప్రేమించిన యువకుడి కోసం పెళ్లి చేసుకున్న భర్తను అడ్డుతొలగించుకోవడానికి పథకం పన్నింది. దాని కోసం ప్రియుడితో కలిసి గోపి, రామకృష్ణ అనే ఇద్దరు పాత నేరస్తులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఎనిమిది వేల నగదును, పెళ్లి ఉంగరాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చింది. ప్లాన్ ప్రకారం తోటపల్లి ప్రాజెక్టు వద్దకు రాగానే మూత్రవిసర్జన సాకుతో భర్తను ద్విచక్ర వాహనాన్ని ఆపాల్సిందిగా కోరింది. బండి ఆపిన సరస్వతి భర్త శంకర్రావుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి అతని తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఎవరో దుండగులు తన భర్తను హత్య చేశారని సరస్వతీ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఎస్పీకి అనుమానం రావడంతో అసలు విషయం బయట పడింది. పోలీసుల సమిష్టి కృషి, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు కేసును త్వరితగతిన ఓ కొల్కికి వచ్చేలా చేశాయని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను పోలీసు అరెస్టు చేశారు. ఒక నిందితుడు పరారిలో ఉన్నట్లు పోలీసు తెలిపారు. -
అనుమానిస్తోందని అంతమొందించారు
వీడిన హత్య కేసు మిస్టరీ నిందితులను పట్టించిన మృతురాలి గాటు పార్వతీపురం : మృతురాలి పీకపై ఉన్న గాటు ఆధారంగా పార్వతీపురం పోలీసులు హత్యకేసు మిస్టరీని ఛేదించారు. వివాహిత మృతిపై ఆమె సోదరుడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితులను ఐదు రోజుల్లోనే పట్టుకొని మంగళవారం మీడియా ముందుంచారు. పార్వతీపురం సీఐ వి.చంద్రశేఖర్ అందించిన వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన అనుపోజు సరస్వతి(25)ని పార్వతీపురం చెరువు గట్టు వీధికి చెందిన రాలి అప్పారావు, ఈశ్వరమ్మల కుమారుడు రాలి సంతోష్ కుమార్‌కు గత ఏడాది అక్టోబర్‌లో ఇచ్చి వివాహం చేశారు. గతంలో తనకు వేరే మహిళతో ఉన్న సంబంధంపై అనుమానించడం, ఇంట్లో ప్రతి పనికీ అడ్డుతగలడంతో సరస్వతిని అంతం చేయాలని సంతోష్‌కుమార్ భావించాడు. దీనికితోడు సరస్వతి చనిపోతే వేరే పెళ్లి చేసుకోవచ్చని భావించి అవకాశం కోసం ఎదురుచూశాడు. కుటుంబసభ్యులంతా గత నెల 30నఇంట్లో అగ్నిగంగమ్మ పండగ జరుపుకున్నారు. ఈ వేడుకకు వచ్చిన గజపతినగరం చుట్టం ధర్మవరపు పుష్ప ఓ గదిలో, తల్లిదండ్రులు మరొక గదిలో, భార్యాభర్తలు వేరే గదిలోనూ పడుకున్నారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో సంతోష్‌కుమార్ తన తండ్రి వద్దకు వెళ్లి మన మాటకు అడ్డు తగులుతూ అనుమానిస్తున్న సరస్వతిని చంపేద్దామని చెప్పాడు. దీనికి తండ్రి అంగీకరించాడు. వెంటనే సంతోష్‌కుమార్ తన గదిలోకి వెళ్లి నిద్రిస్తున్న సరస్వతిని జుట్టుపట్టుకొని తీసుకొచ్చి మంచం కోడుకు పీక ఆనించి గొంతు పెగలకుండా బలంగా నొక్కిపట్టాడు. ఆమె కాళ్లు కదలకుండా తండ్రి గట్టిగా పట్టుకోవడంతో అతి కిరాతకంగా చంపేశారు. తర్వాత పైకప్పుకు చున్నీతో వేలాడ దీసి ఉరి వేసుకున్నట్లు చేశారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన సంతోష్‌కుమార్ తల్లి ఈశ్వరమ్మ, చుట్టం పుష్పకు సరస్వతి ఉరి వేసుకున్నట్లు నమ్మించారు. విషయం బయటకు తెలిస్తే సమస్య వస్తుందని, మామూలుగా ఇంట్లో పడిపోయి చనిపోయినట్లు అందరికీ నమ్మబలికారు. తమ కులాచారం ప్రకారం మృతదేహానికి పసుపు రాసి, మెడపై ఉన్న మంచం కోడు గాటును, ఉరి తాలూకా అచ్చులు కనిపించకుండా మెడకు తువ్వాలు చుట్టి రోకలిని ఆనించి కూర్చోబెట్టారు. సోదరుడి ఫిర్యాదుతో వెలుగులోకి.. ముందు రోజు వరకు సంతోషంగా ఉన్న తమ సోదరి అకస్మాత్తుగా మరణించిందనే విషయాన్ని జీర్ణించుకోలేని మృతురాలి సోదరుడు అనుపోజు అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మృతురాలి పీకపై ఉన్న గాటును గుర్తించారు. దీంతో నిందితులను అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో పట్టణ, రూరల్ ఎస్ఐలు బి.సురేంద్రనాయుడు, వి.అశోక్ కుమార్, సిబ్బంది ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.