ప్రాణం తీసిన వివాహేతర సంబంధం | Police chase Mystery Murder Case | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Published Wed, Mar 21 2018 7:28 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM

Police chase Mystery Murder Case - Sakshi

నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ, సీఐ 

కాటారం : జిల్లాలో సంచలనం సృష్టించిన టీడీపీ మహిళా విభాగం  మండల అధ్యక్షురాలు రామిళ్ల కవిత(35) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కాటారం మండలం కొత్తపల్లిలో ఈ నెల 11 అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రామిళ్ల కవితను దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన విషయం విధితమే. కాగా కవిత హత్యకు అసలు కారణం వివాహేతర సంబ ంధమే అని పోలీసులు తేల్చారు. 

తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న కవితను పలుమా ర్లు హెచ్చరించినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో విరక్తి చెంది పథకం ప్రకారం ఓ భార్య కాంట్రాక్ట్‌ మర్డర్‌ చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు, సీఐ చింతల శంకర్‌రెడ్డి నిందితుల అరెస్ట్, హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కవితకు కాటారంకు చెందిన రామిళ్ల మల్లయ్యకు గత 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి శ్రీజ, శిరిణి కూతుర్లు ఉన్నారు. 

భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో గత పదేళ్లుగా విడిపోయి కవిత తన తల్లిగారి ఊరైన కొత్తపల్లిలో కూతుర్లతో కలిసి జీవనం సాగిస్తుంది. గత రెండేళ్లుగా టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో కవితకు దూరపు బంధువు వరుసకు బావ అయిన ములుగు సర్పంచ్‌ గుగ్గిళ్ల సాగర్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా కొంత కాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరుచు ఇరువురు కలుస్తుండడంతో విషయం కాస్తా సాగర్‌ భార్య సుజాతకు తెలియడంతో వారిద్దరిపై నిఘా పెంచింది. 

గత ఏడాది కవిత–సాగర్‌లు కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సుజాత పద్ధతి మార్చుకోవాలని కవితను తీవ్రంగా మందలించింది. పెద్దమనుషులు సర్దిచెప్పడంతో పాటు పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్‌ సైతం ఇచ్చారు. ఇదంతా జరిగినప్పటికీ కవిత–సాగర్‌ల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో తన భర్త ఎక్కడ దూరమవుతాడో తన పిల్లల పరిస్థితి ఏంటని తీవ్ర మనోవేదనకు గురైన సుజాత తన పిల్లలతో కలిసి పలుమార్లు ఆత్మహత్యకు యత్నించింది.

హత్యకు ప్లాన్‌ జరిగిందిలా.. 
గత కొంత కాలంగా సాగర్‌–సుజాత ఇంట్లో ఆశ్రయం పొందుతున్న వెంకటాపూర్‌ మండల పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన రజనీకాంత్‌కు తన బాధను చెప్పుకొని సుజాత కన్నీరుమున్నీరయింది. ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని నీ జీవితాన్ని నాశనం చేస్తున్న కవితను అడ్డుతప్పిస్తే ఎలాంటి గొడవ ఉండదని అది నేను చూసుకుంటానని రజనీకాంత్‌ సుజాతకు భరోసా కల్పించాడు. 

కవితను హత్య చేయించాలని నిర్ణయానికి వచ్చిన సుజాత రజనీకాంత్‌ సాకారం కోరుతుంది. గతంలో ప్రజాప్రతిఘటన కొరియర్‌గా పని చేసిన రజనీకాంత్‌ పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన నిషేధిత పీపీజీ కొరియర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పని చేసిన కన్నూరి కుమారస్వామిని సంప్రదించాడు. కుమారస్వామి కవితను చంపేందుకు ఒప్పుకోవడంతో సాగర్‌ భార్య సుజాతతో రజనీకాంత్‌ ఫోన్‌లో మాట్లాడించి రూ.5లక్షలకు సుపారి మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఇదే క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉండి విభేధాలతో దూరమైన కొత్తపల్లి మాజీ ఉపసర్పంచ్‌ చిట్యాల చంద్రయ్య ద్వారా కవిత కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న సుజాత సమాచారాన్ని కుమారస్వామికి చేరవేస్తూ వచ్చింది. కవితను హత్య చేసేందుకు రజనీకాంత్, కుమారస్వామి, బస్వరాజుపల్లికి చెందిన కుక్కుమూడి అశోక్, పందికుంటకు చెందిన దుప్పటి మోహన్‌ అలియాస్‌ చింటూ, మాడుగుల జగదీశ్, హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆత్కూరి రాజుతో కలిసి ఫిబ్రవరి నెల నుంచి పలుమార్లు కొత్తపల్లికి వచ్చి కవిత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. మార్చి 11 అర్థరాత్రి అశోక్, రజనీకాంత్, మలుగు మండలం పందికుంటకు చెందిన నూనుగంటి చిరంజీవి అలియాస్‌ అభిలాష్‌తో కలిసి భూపాలపల్లిలో చేతి గ్లౌజులు, మంకీ క్యాప్స్, కిచెన్‌ నైఫ్స్‌ కొనుక్కొని కొత్తపల్లికి చేరుకున్నారు. 

కవిత తన ఇంట్లో పెద్ద కూతురు శ్రీజతో కలిసి నిద్రిస్తుండగా ఇంటి వెనక గల తలుపులు లేని కిటీకి నుంచి అశోక్, చిరంజీవి మంకీ క్యాప్‌లు ధరించి ఇంట్లోకి వెళ్లగా రజనీకాంత్‌ ఇంటి బయట కాపలగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు కలిసి నిద్రిస్తున్న కవితను తమ వెంట తెచ్చుకున్న కత్తులతో కవిత ముఖంపై దాడి చేయడానికి ప్రయత్నించగా పక్కనే నిద్రిస్తున్న శ్రీజ నిద్రలేచి కేకలు వేయబోగా దుండగులు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. ఇంట్లో ఉన్న కత్తిపీటతో కవిత ముఖం, గొంతుపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురైన కవిత అక్కడికక్కడే మృతి చెందింది. కవిత మృతి చెందినట్లు నిర్థారించుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. 

హత్య విషయాన్ని తెలుసుకున్న ఏఎస్పీ రాజమహేంద్రనాయక్, కాటారం డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు, సీఐ చింతల శంకర్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతి, నరేశ్, రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందం ద్వారా వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. కవిత కాల్‌ డేటా, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో పాటు కూతురు శ్రీజ చెప్పిన వివరాలను తీసుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టి చివరకు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య మిస్టరీ వీడినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ఏడుగురు నిందితులు సుజాత, రజనీకాంత్, కుమారస్వామి, అశోక్, మోహన్, చంద్రయ్య, జగదీష్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కాగా హత్యలో పాల్గొన్న మరో నిందితుడు చిరంజీవి, హత్యతో సంబంధం ఉన్న రాజులు పరారీలో ఉన్నట్లు త్వరలోనే వారిని పట్టుకోనున్నట్లు ఆయన తెలిపారు. హత్య కేసును చాకచక్యంగా చేధించిన సీఐ శంకర్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతి, రాజు, నరేశ్‌లను ఈ సందర్భంగా డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement