హత్యకు గురైన టీచర్ ఉషారాణి, బంగారు నగల తయారీదారు కిరణ్ (ఫైల్ ఫొటోలు)
కదిరి: అంతుచిక్కని నేరాలకు కదిరి ప్రాంతం కేంద్రమవుతోందా? కేసుల దర్యాప్తులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? మర్డర్ ఫర్ గెయిన్ కేసుల్లోని మిస్టరీ వీడేది ఎన్నడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ‘పట్టుకోండి చూద్దాం’ అంటూ పోలీసులకు హంతకులు, దోపిడీ దొంగలు సవాల్ విసురుతున్నారు. వరుసగా చోటు చేసుకున్న మర్డర్ ఫర్ గెయిన్ ఘటనలను మరువక ముందే కదిరి వాసులను దోపిడీ దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. పలు వీధుల్లో రాత్రిపూట అగంతకులు హల్‌చల్ చేస్తుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
అంతా పథకం ప్రకారమే..
గత నెల 16న ఎన్జీఓ కాలనీలో టీచర్ శంకర్‌రెడ్డి సతీమణి టీచర్ ఉషారాణి (47)ని అగంతకులు దారుణంగా హతమార్చి విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకెళ్లారు. అదే సమయంలో ఉషారాణి ఇంటి పక్కనే ఉంటున్న టీస్టాల్ నిర్వాహకుడు రమణ ఇంటిలో చొరబడి ఆయన భార్య శివమ్మను సైతం తీవ్రంగా గాయపరిచారు. 20 రోజుల పాటు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ఇటీవలే ఇంటికి చేరుకున్నారు.
ఈ రెండు ఘటనల్లో దుండగులు పక్కా పథకం ప్రకారమే పని చక్కెబెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటన జరిగిన రోజుకు వారం రోజుల ముందు నుంచి ఎన్జీఓ కాలనీ సెల్‌టవర్ పరిధిలోని కాల్‌డేటాను పోలీసులు సేకరించి పరిశీలించారు. అపరిచిత నంబర్ల నుంచి ఎలాంటి కాల్స్ వెళ్లలేదని నిర్ధారించుకున్నారు. దుండగులు సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో కేసు దర్యాప్తు మిస్టరీగానే మిగిలిపోయింది.
దర్యాప్తునకు ఏఎస్పీ స్థాయి అధికారి..
టీచర్ ఉషారాణి హత్యకేసును ఛేదించేందుకు ఏఎస్పీ రామకృష్ణప్రసాద్‌ను ప్రత్యేకంగా నియమించారు. అలాగే పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో కూడిన ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉషారాణి హత్య కేసులో నిందితుల కోసం దాదాపు 50 మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయినా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. ఎన్జీఓ కాలనీతో పాటు కదిరిలోని ప్రధాన రహదారుల్లోని సీసీ ఫుటేజీలను, చెక్‌పోస్టుల వద్ద వాహనాల కదలికలను పరిశీలించారు. అయినా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు.
మిస్టరీగా కిరణ్ హత్య..
కదిరిలోని ఎంజీ రోడ్డులో తాను అద్దెకుంటున్న గదిలో నిద్రిస్తున్న బంగారు ఆభరణాల తయారీదారు కిరణ్(23) ఈ ఏడాది సెపె్టంబర్ 12న హత్యకు గురయ్యాడు. ఇది జరిగి 3 నెలలకు పైగా అవుతున్నా హంతకులను పసిగట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ కేసు విచారణలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి పట్టణ సీఐగా ఉన్న కుచల శ్రీనివాసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే కేసులోని మిస్టరీ వీడలేదు.
Comments
Please login to add a commentAdd a comment