సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు వైద్యశాలలకు సుస్తీ చేసింది. ఏడాది కాలంగా నిధుల లేమితో ఆస్పత్రుల నిర్వహణ గాడి తప్పింది. ప్రభుత్వం ఏటా విడుదల చేసే నిర్వహణ నిధులు ఈ ఏడు ఇప్పటికీ జాడలేవు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ పద్దుల కింద ఇచ్చే వార్షిక నిర్వహణ నిధులు వాస్తవానికి ఆరోగ్య కేంద్రాలకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేయాలి. కానీ మరో రెండున్నర నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికీ.. నిధుల ఊసే లేదు. అసలే అరకొర వైద్యం అందించే సర్కారు దవాఖానాల్లో నిధుల సమస్యను సాకుగా చూపిస్తున్న వైద్యశాఖ.. ఏకంగా ఆస్పత్రుల నిర్వహణను గాలికొదిలే సింది.
రావాల్సింది రూ.1.02 కోట్లు
జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) ఉన్నాయి. ఇవికాకుండా మరో 7 పట్టణ ఆరోగ్య
కేంద్రాలు (యూహెచ్‌సీ) ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఏటా వివిధ పద్దుల కింద గరిష్టంగా రూ.1.75లక్షల నిధులు ఇస్తోంది. అవ సరాన్ని బట్టి నిధుల విడుదలలో హెచ్చుతగ్గులు పాటిస్తోంది. ఈ నిధులను ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ ఖాతాలో జమ చేస్తుంది. ఈ నిధులతో ఆస్పత్రి అభివృద్ధి కార్యక్రమాలకోసం రూ.లక్ష వినియోగించాల్సి ఉంటుంది. వీటితో చిన్నపాటి మరమ్మతులు, పెయింటింగ్, పరికరాల కొనుగోలు తదితర వాటికి వినియోగించాలి. మరో రూ.50వేలు ఏడాది పొడవునా ఆస్పత్రి నిర్వహణకు ఖర్చు చేయాలి. మిగిలిన రూ.25వేలను ఆస్పత్రిలో పారిశుద్ధ్యం మెరుగుకోసం వెచ్చించాలి. అయితే ఈ ఏడాది మూడు పద్దులకు సంబంధించి రూ.1.02 కోట్లు రావాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అయితే నిధులు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ఆస్పత్రుల్లో పరిస్థితులు అధ్వానంగా, వైద్యసేవలు అరకొరగా మారాయి.
ఆఖరి నిమిషంలో జేబుల్లోకి!
ఆస్పత్రి అభివృద్ధి సొసైటీకి కేటాయించే నిధులను ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో విడుదల చేస్తే ప్రణాళికాబద్ధంగా ఖర్చవుతాయి. అయితే నిధుల విడుదల ప్రక్రియ గాడి తప్పుతుండడంతో ఒకవైపు ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారుతుండగా.. మరోవైపు ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. మరో రెండున్నర నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో ఇప్పటికిప్పుడు నిధులు విడుదలచేస్తే.. ఆదరాబాదరగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల అక్రమాలు జరిగే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నకిలీ బిల్లులతో గతంలో అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో నిధులు విడుదలైతే వినియోగంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
నిధులివ్వరు ..నిర్వహణ ఎలా?
Published Thu, Jan 16 2014 4:35 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement