నెల్లిపాక : మిస్టరీగా మారిన చెన్నూరి శంకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎటపాక సీఐ వీరయ్యగౌడ్ మంగళవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎటపాక మండలంలోని తునికిచెరువు అటవీ ప్రాంతంలో ఓ మృతదేహం ఉందని ఈ నెల 6న పోలీసులకు సమాచారం అందింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా గుర్తించి చెన్నూరి శంకర్ అనే వ్యక్తిని తామే హతమార్చామని వారం రోజుల తర్వాత పత్రికలకు మావోయిస్టుల పేరిట లేఖలు అందాయి.
చాలా రోజుల తర్వాత లేఖలు రావడంపై అనుమానం కలిగిన పోలీసులు ఇది మావోయిస్టులు చేసిన హత్య కాదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మార్చి 30న భద్రాచలంలోని తనసోదరుడి రూం నుంచి శంకర్ బయటకు వెళ్లాడు. అతడి సోదరుడిని పోలీసులు విచారణ చేయగా, తాను స్నేహితులతో మందు పార్టీలో ఉన్నానని ఫోన్‌లో శంకర్ చెప్పినట్టు తెలిపాడు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శంకర్‌తో ఆ రోజు మందు పార్టీలో నందిగామ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ దుర్గం నరేందర్, ఎటపాకకు చెందిన పలకల ధర్మారావు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, వాస్తవాలు వెలుగు చూశాయి.
హత్యకు దారితీసిన పరిస్థితులు
శంకర్, నరేందర్ వరంగల్ జిల్లాకు చెందిన సమీప బంధువులు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లిలో ఉంటూ శంకర్ జిరాక్స్ షాపు నడుపుతున్నాడు. నరేందర్ ఎటపాక మండలంలోని నందిగామలో ఆర్‌ఎంపీగా జీవనం సాగిస్తున్నాడు. శంకర్ తరచూ నరేం దర్ ఇంటికి వస్తున్న క్రమంలో నరేందర్ భార్య కవితపై అతడి కన్నుపడింది. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పడంతో, నరేందర్ స్నేహితుడు ధర్మారావుతో కలిసి వారిద్దరూ శంకర్‌ను హతమార్చేందుకు పథకం వేశారు. మార్చి 30న సాయంత్రం మందు పార్టీకి శంకర్‌ను పిలిచారు. బీరు బాటిళ్లు తీసుకుని శంకర్, నరేందర్, ధర్మారావు కలిసి ఎటపాక-పిచుకలపాడు మధ్య ఉన్న కల్వర్టు వద్దకు చేరుకున్నారు. పథకం ప్రకారం బీరు బాటిల్‌లో నిద్రమాత్రలు కలిపి శంకర్‌కు ఇచ్చారు. దానిని తాగి అపస్మారక స్థితికి చేరుకున్న శంకర్‌ను తునికిచెరువు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, కర్రలతో అతడి తలపై కొట్టి హతమార్చారు. మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయారు. వీరిద్దరితో పాటు నరేందర్ భార్య కవితను కూడా అరెస్ట్ చేశారు.
వీడిన మర్డర్ మిస్టరీ
Published Wed, Apr 27 2016 1:18 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM
Advertisement
Advertisement