= రెండు మాసాలుగా నగరంలోనే మకాం
= పథకం ప్రకారమే లొంగుబాటు
= పోలీసు విచారణలో వంశీ వెల్లడి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ‘నగరంలో రకరకాలుగా చీటింగ్ చేసి చివరకు బాధితులు ఏం చేస్తారో అనే భయంతో, గత్యంతరం లేక పరారయ్యా. కాలువలో దూకి ఆత్మహ్యత్య చేసుకుందామని అమ్మకు చెప్పా. ఆమె వద్దని సలహా ఇచ్చింది. దాంతో కారును కాలువలో తోసేసి అదృశ్యమయ్యా. రెండు మాసాలుగా నగరంలోనే ఉంటున్నాను.’ నగరంలో కోట్లాది రూపాయలు చీటింగ్ చేసి పరారైన రియల్టర్ నార్ల వంశీకృష్ణ బుధవారం పోలీసుల ఇంటరాగేషన్‌లో వెల్లడించిన విషయాలివి.
మోస్ట్‌వాంటెడ్ చీటర్‌గా పోలీసు రికార్డుల్లో నమోదైన వంశీకృష్ణ పోలీసులకు చిక్కిన తరువాత కూడా తనదైన శైలిలో కట్టుకథలు చెపుతూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. పైసా పెట్టుబడి లేకుండా తన మాయమాటలతో ప్రజలనుంచి వంద కోట్లు వసూలు చేసిన వంశీకృష్ణ ఇప్పుడు చేతిలో చిల్లుగవ్వలేదంటూ చెప్పడంతో పోలీసులే అవాక్కవుతున్నారు.
వీనస్ డవలపర్స్ పేరుతో నగరంలో బిల్డర్‌గా వ్యాపారం చేసి పేదల నుంచి, పోలీస్ అధికారులు, పారిశ్రామికవేత్తల వరకు అనేక మందికి లక్షలాది రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన వంశీకృష్ణ పోలీసు ఇంటరాగేషన్‌లో తాను అమాయకుడినని, తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని పొలీసులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2011 జనవరి 4న తాను తన తల్లితో కలిసి గుంటూరు జిల్లాకు వెళుతూ దుగ్గిరాలవద్ద జరిగిన సంఘటనపై మరో కట్టు కథ చెప్పినట్లు తెలిసింది. అప్పుల వాళ్లకు
సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, తన తల్లి వద్దని వారించిందని చె ప్పాడు. తాను కనపడితే మోసపోయిన జనం చంపేస్తారనే భయంతో చనిపోయినట్లు నమ్మించే విధంగా కారును కాలువలో తోసి పరారయ్యామని వివరించాడు. ఇక్కడి నుంచి పరారయ్యాక చేతిలో డబ్బులేక తాను అనేక చోట్ల తన తల్లితో కలిసి తిరిగానని చెప్పడు. చివరకు గత్యంతరం లేక వైజాగ్ చేరుకుని అక్కడే ఏడాదిన్నర కాలంగా చిరుద్యోగం చేసుకుంటూ జీవనం సాగించానని చెప్పాడు. తప్పని పరిస్థితిలో తిరిగి రెండు నెలల క్రితం విజయవాడ చేరుకుని ఇక్కడ కాలం వెళ్లబుచ్చుతున్నాని పోలీసులకు చెప్పాడు.
పక్కా పథకంతోనే లొంగుబాటు....
చీటర్ వంశీకృష్ణ పోలీసులకు లొంగడంలో కూడా పక్కా వ్యూహంతో వ్యవహరించాడని ప్రజలు భావిస్తున్నారు. తనపై ఏ కేసులు లేని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తనకు సన్నిహత సంబంధాలున్న ఇంటి సమీపంలోనే దొరకడం చర్చనీయాంశమైంది. రాత్రి 9గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూంకు పథకం ప్రకారమే ఫోన్ చేయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. కంట్రోల్ రూం నుంచి వచ్చిన కాల్‌తో ఆ ఏరియాలో బీట్ తిరుగుతున్న బ్లూకోట్స్ కానిస్టేబుల్ ఆ ప్రదే శానికి వెళ్లి అతన్ని సూర్యారావుపేట స్టేషన్‌కు తరలించారు. పద్ధతి ప్రకారం అతన్ని జేబులు పరిశీలించారు. రెండు మనీపర్సులున్నాయి. రూ. 50 నోటు, కట్టుబట్టలు మాత్ర మే అతని వద్ద ఉన్నాయి. చేతికి వెండి కడియం ఉంది. ఇదంతా చూస్తుంటే నిందితుడు పక్కా ప్రణాళికతో లొంగిపోయినట్లు భావిస్తున్నారు.
బినామీ పేర్లలో ఆస్తులు..
కాగా బినామీ పేర్లతో ఆస్తులు బదలాయించినట్లు తెలుస్తోంది. అదృశ్యం కావడానికి ముందే అతను ఆస్తులను పక్కా వ్యూహంతో తన బంధు మిత్రులు, సన్నిహితుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. అతని భార్య, అత్త వారధి సమీపంలోని వైస్రాయ్ హైట్స్ అపార్టుమెంటులో రూ. 30లక్షల ప్లాటులో నివాసం ఉంటున్నారు. అదే అపార్టుమెంటులో 14 ప్లాట్లలో ఆరు ప్లాట్లు బిల్డర్‌కు చెందినవి కాగా, మిగిలిన 9 ప్లాట్లు ఒకే వ్యక్తి పేరుతో ఉండటం అనుమానాస్పదంగా ఉందని పలువురు బాధితులు చెబుతున్నారు. ఇవిగాక నగరంలో అతని అనుచర గణం పేరుతో వెంచర్లలో ఐదు ప్లాట్లు బినామీగా పెట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా నగరంలో ఓ డాక్టర్ నిర్వహిస్తున్న హాస్పటల్‌కు కొంత ఫండ్స్ డైవర్ట్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. క్రైం డీసీపీ గీతాదేవి పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గత్యంతరం లేకే పరారయ్యా..
Published Thu, Nov 21 2013 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement
Advertisement