Hundred crores
-
టీకాల కోసం 100 కోట్ల ‘కాంగ్రెస్’ నిధులు
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ స్థానిక ప్రాంత అభివృద్ధి(ఎల్ఏడీ) నిధి నుంచి రూ.100 కోట్లను కోవిడ్ టీకా కొనుగోలుకు ఉపయోగి స్తామని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ శాసనసభాపక్ష నేత సిద్దరామయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు టీకా కూడా ఇవ్వలేకపోవడం విచారకరమన్నారు. అందుకే, రాష్ట్రంలోని తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి దాదాపు 95 మంది కనీసం రూ.కోటి ఎల్ఏడీ నిధులను టీకా కొనుగోలుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. -
కరోనా అలర్ట్
-
కోవిడ్ కట్టడికి 100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్ మహమ్మారి మరింత విస్తరించకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులు, కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఆస్పత్రితోపాటు వికారాబాద్‌లోని టీబీ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేసినట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు మెడికల్ అనుబంధ ఆసుపత్రుల్లో 3 వేల పడకలను అందుబాటులో ఉంచాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వాటిలో కొన్నింటిని సాధారణ ఐసొలేషన్ కోసం, కొన్నింటిని ప్రత్యేక చికిత్స కోసం ముందు జాగ్రత్తగా తీసుకున్నట్లు వివరించారు. మంత్రి ఈటల నేతృత్వంలోని ఆరోగ్య మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం కోవిడ్‌పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, పలు శాఖల ఉన్నతాధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. వైరస్ వ్యాపించకుండా ఏయే శాఖలు ఏయే చర్యలు తీసుకోవాలో మంత్రులు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. కోవిడ్ విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైరస్ సోకిన బాధితుని పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని తెలిపారు. కోవిడ్‌కు ఇవ్వాల్సిన చికిత్సపై అధ్యయనం చేసేందుకు 15 మంది డాక్టర్లు, జిల్లా వైద్యాధికారుల బృందాన్ని కేరళకు పంపిస్తున్నామని చెప్పారు. వైరస్ కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు పాటిస్తున్నామన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కార్యదర్శి ప్రీతి సుడాన్‌తో తాను ఫోన్లో మాట్లాడానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొరత ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి 50 వేలు మాస్కులు పంపించాలని అడిగామని చెప్పారు. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు.. కోవిడ్ వైరస్ గాలి ద్వారా వ్యాపించదని, అయితే రోగి దగ్గినా, తుమ్మినా తుంపర్లు గాలిలో 12 గంటల పాటు ఉంటాయని, వాటి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదముందని ఈటల తెలిపారు. వైరస్ భయం పోయేదాకా ప్రజలు షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలని సూచించారు. ఆప్తులకూ నమస్కారమే చేయాలన్నారు. కోవిడ్ వైరస్ సోకిన వాళ్లు మాస్క్‌లు ధరిస్తే సరిపోతుందని, అందరూ ధరించాల్సిన అవసరం లేదని ఈటల సూచించారు. కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కర్చీఫ్ లేదా చెయ్యి అడ్డం పెట్టుకోవాలన్నారు. శానిటైజర్లు వినియోగించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోటళ్లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల వంటి జన సమ్మర్థ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నవారు కూడా జాగ్రత్తలు వహించాలన్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఈ చర్యలన్నీ వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తలో భాగమేనని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మన దగ్గర అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం తక్కువగా ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో వైరస్ విస్తరించే అవకాశం తక్కువని మంత్రి చెప్పారు. రోగుల ట్రావెల్ హిస్టరీ కనుక్కోండి.. రోగుల ట్రావెల్ హిస్టరీ అడగాలని, బయటి దేశాలకు వెళ్లొచ్చిన వారితో సన్నిహితంగా మెలిగారేమో కనుక్కోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు ఈటల విజ్ఞప్తి చేశారు. ట్రావెల్ హిస్టరీ, విదేశాలకు వెళ్లొచ్చిన వాళ్లతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు వస్తే వెంటనే వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి, లక్షణాలపై అవగాహన కల్పించేందుకు భారీ ప్రచారం నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందన్నారు. అంతా ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నా.. కోవిడ్ కేసు తెలంగాణలో నమోదు కావడంతో తనకు నిద్ర కూడా పట్టడంలేదని మంత్రి ఈటల రాజేందర్ విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి 12 గంటలకు నిద్రపోయానని, మళ్లీ ఉదయం 4 గంటలకే మెలకువ వచ్చిందన్నారు. అంతా ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. 88 మంది అనుమానితుల్లో ఎవరికీ పాజిటివ్ రాకూడదని దేవుడిని ప్రార్ధించానన్నారు. నిద్రాహారాలు మాని కోవిడ్ వైరస్ రాకుండా అందరూ పనిచేస్తున్నారన్నారు. -
ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో వంద కోట్ల కుంభకోణం
-
ఎంసెట్ లీకేజ్ 100 కోట్ల స్కాం
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కిందటి ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ వైపు నిందితుల జాబితా పెరిగిపోతుండగా.. మరోవైపు లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్గా మారిన ఈ స్కాం విలువ ఎంత? ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.100 కోట్లు. ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా జప్తు చేసిన సీఐడీ.. కుంభకోణం విలువ వంద కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని చెబుతోంది. ఒక్కో విద్యార్థితో రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు లీకేజీ మాఫియా వసూలు చేయగా.. కొంత మంది తల్లిదండ్రులు సైతం తమ పిల్లలతోపాటు మరికొందరు విద్యార్థులను క్యాంపునకు పంపించి లక్షల్లో దండుకున్నారు. ఎట్టకేలకు మొత్తం వ్యవహారం బట్టబయలు కావడంతో వసూలు చేసిన డబ్బంతా సీఐడీ సీజ్ చేస్తూ వెళ్తోంది. త్వరలోనే ఆ మొత్తం రూ.వంద కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 250 మందికిపైగా విద్యార్థులు! ముందుగా 60 మంది విద్యార్థులు మాత్రమే లీకైన ప్రశ్నపత్రంతో పరీక్ష రాసి ఉంటారని సీఐడీ అనుమానించింది. 2016 నుంచి సాగుతున్న దర్యాప్తులో ఈ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 250కి పైగా చేరిపోయింది. అలాగే అరెస్టయిన కీలక సూత్రధారులు, వారి నుంచి కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డ బ్రోకర్ల సంఖ్య కూడా 100కు చేరువైంది. 90 మంది నిందితులను ఇప్పటికే పట్టుకున్న సీఐడీ.. మరో 10 మంది కీలక నిందితుల కోసం వేట సాగిస్తోంది. రేపో మాపో కీలక సూత్రధారులను పట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా సీఐడీ ఇప్పటివరకు రూ.70 కోట్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకుంది. మరికొందరు బ్రోకర్లు పరారీలో ఉండగా, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన పది మంది కీలక నిందితులు అరెస్టయితే వీరి నుంచి మరికొంత రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణం విలువ రూ.100 కోట్లకు చేరే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు తెలిపాయి. మరి ఇంతటి కుంభకోణంలో ఎంతటి తలలుంటాయి? ఎంత పెద్ద వ్యక్తులు పాత్రధారులై ఉంటారానే దానిపై సీఐడీ దృష్టి సారించింది. అరెస్టులకు అరకోటిపైనే ఖర్చు ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో కీలక సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు సంస్థ సీఐడీకి రూ.65 లక్షలకు పైగా ఖర్చు వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి ప్రాంతాలకో చెందిన నిందితులను గుర్తించి, వారికోసం రోజుల తరబడి నిఘా పెట్టి పట్టుకునేందుకు భారీ స్థాయిలోనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒక్క కేసులో ఇంత మంది నిందితులను పట్టుకోవడం అంతసులభమైన పనేం కాదని, ప్రతి అధికారి కూడా సిబ్బంది బృందాల్లో ఉండి కీలకంగా వ్యవహరించారని సీఐడీ సీనియర్ అధికారులు తెలిపారు. -
జన్‌ధన్ ఖాతాలోకి వంద కోట్ల రూపాయలు
-
ఖాతాలోకి రూ. 99,99,99,394
ఘజియాబాద్: తనకు తెలియకుండానే తన జన్‌ధన్∙ఖాతాలోకి వంద కోట్ల రూపాయలు వచ్చి చేరాయంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఘజియాబాద్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ కొన్ని రోజుల క్రితం కొంత నగదును విత్‌డ్రా చేసేందుకు స్థానిక ఏటీఎంకు వెళ్లింది. అక్కడ తన ఖాతాలో రూ. 99,99,99,394 ఉండటం చూసి ఆశ్చ్యర్యానికి గురై.. పక్కన నిల్చున్న వ్యక్తిని అడిగి మరోసారి రూఢీ చేసుకుంది. మరో రెండు ఏటీఎంలలోనూ బ్యాలన్స్‌ను చెక్ చేసింది. చివరకు ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది. అనంతరం ఖాతా ఉన్న బ్యాంక్ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. వారు పట్టించుకోకపోవడంతో తన భర్త సాయంతో పీఎంఓకు ఫిర్యాదు చేసింది. -
వందల కోట్లు ఏం చేద్దాం?
-
వందల కోట్లు ఏం చేద్దాం?
► అంత డబ్బు ఎలా కాపాడుకోవాలంటూ శేఖర్‌రెడ్డితో ఫోన్లో రామ్మోహన్రావు మంతనాలు ► అప్పటికే శేఖర్‌రెడ్డి సెల్‌ఫోన్‌పై నిఘా ► పక్కా ఆధారాలతో 13 చోట్ల ఐటీ దాడులు ► తమిళనాడు సీఎస్ రామ్మోహన్రావు సస్పెన్షన్.. ► అతని కుమారుడు వివేక్, స్నేహితుని ఇంటిపైనా దాడులు ► ఆరుగురు మంత్రులపై ఐటీ కన్ను.. ఆంధ్రప్రదేశ్ సంబంధాలపై ఆరా ► శేఖర్‌రెడ్డితో పరిచయం ఉన్న వారిపై త్వరలో దాడులకు రంగం సిద్ధం చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు బుధ, గురు వారాల్లో నిర్వహించిన దాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపగా, శేఖర్‌రెడ్డితో గంటల కొద్దీ జరిపిన సంభాషణే ఆయన్ను పట్టించినట్లు స్పష్టమైంది. దీంతో ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. చెన్నై అన్నానగర్‌లోని రామ్మోహన్రావు నివాసం, తిరువాన్మియూర్లోని ఆయన కుమారుని ఇల్లు సహా మొత్తం 13 చోట్ల ఐటీ అధికారులు బుధవారం తెల్లవారుజాము 5.30 గంటలకు ప్రారంభించిన దాడులు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. రామ్మోహన్రావు పీఏలైన శేఖర్, కుమార్‌లను కూడా ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసును శేఖర్‌రెడ్డి కేసుతో కలపాలా.. లేక వేరుగా విచారించాలా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ దాడుల్లో రామ్మోహన్రావు ఇంటి నుంచి రూ.30 లక్షల కొత్త కరెన్సీ, రూ.5 కోట్ల విలువైన బంగారం, రూ.100 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు వివేక్ ఇంటి నుంచి 10 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వలసరవాక్కంలో నివసించే వివేక్ స్నేహితుడు, న్యాయవాది అమలనాథన్ ఇంటిపై కూడా గురువారం ఐటీ దాడులు జరిగాయి. ఆరుగురితో కూడిన అధికారుల బృందం సోదాలు చేపట్టింది. వివేక్ స్నేహితుడి ఇంట్లో ఏమి స్వాధీనం చేసుకున్నారో వివరాలు వెల్లడి కాలేదు. డబ్బులెలా కాపాడుకోవాలంటూ దొరికిపోయారు.. అక్రమార్జనను కాపాడుకోవడం కోసం జరిపిన సెల్‌ఫోన్ సంభాషణే రామ్మోహన్‌రావును పట్టించింది. శేఖర్‌రెడ్డి ఆస్తులపై దాడుల అనంతరం బినామీ పెద్దలెవరో తెలపాలని విచారణలో ఐటీ అధికారులు అడగ్గా, విధిలేని పరిస్థితుల్లో రామ్మోహన్రావు పేరు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి ఇంటిపై కేవలం ఒకరి వాంగ్మూలంతో దాడులు చేసేందుకు వీలుకాదని తొలుత సంశయించారు. మరేదైనా బలమైన ఆధారం కోసం అన్వేషించగా ఇసుక క్వారీల అనుమతిపై భారీ ఎత్తున రాయితీలకు రామ్మోహన్రావు సిఫార్సు చేసినట్లు పర్యావరణ అధికారులు స్పష్టం చేశారు. ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లను కూడా సమర్పించారు. మరో కోణంలో కూడా ఆధారాల కోసం ఆరా తీశారు. ఇందులో భాగంగా ఇసుక తదితర వ్యాపార లావాదేవీలతో సమకూరిన సొమ్ముపై శేఖర్‌రెడ్డితో గంటల కొద్దీ సాగించిన సంభాషణే రామమోహన్‌రావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. జయలలిత మరణించిన మరుసటి రోజున వారిద్దరూ ఫోన్ ద్వారా ‘మన వద్ద ఉన్న కొన్ని వందల కోట్ల రూపాయలను ఎలా కాపాడుకోవాలి’ అంటూ మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రి మరణించి రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి.. అంత్యక్రియల ఏర్పాట్లను చూడకుండా, డబ్బును దాచుకోవడం ఎలా అనే కంగారును ప్రదర్శించడం తమను విస్మయానికి గురి చేసిందని ఐటీ శాఖలోని ఒక ఉన్నతాధికారి చెప్పారు. శేఖర్‌రెడ్డి ఫోన్‌పై నిఘా పెట్టి, ఇద్దరి మధ్య సాగిన సంభాషణలను నిర్ధారించుకున్న తర్వాతే దాడులు జరిపామని ఆయన తెలిపారు. ఇసుక క్వారీల ద్వారా ఏడాదికి రూ.15 వేల కోట్ల లావాదేవీలు సాగుతుండగా, తద్వారా వచ్చిన రూ.17 కోట్ల ఆదాయాన్ని శేఖర్‌రెడ్డి నుంచి రామ్మోహన్రావు పొందినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అయితే రామ్మోహన్రావు పేరున స్థిరాస్తులు పెద్దగా లేనట్లు తేలింది. సుమారు రెండు వారాల క్రితమే ఐటీ అధికారులు దాడులకు సిద్ధమైనా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంలో జాప్యమైంది. ఈ జాప్యం వల్ల రామ్మోహన్‌రావుకు విషయం లీకయింది. దీంతో ఆయన జాగ్రత్త పడ్డట్లు సమాచారం. రెండు వారాల క్రితమే దాడులు జరిపి ఉంటే రామ్మోహన్రావు, బంధువుల ఇళ్ల నుంచి భారీగా ఆస్తులు, నగదు పట్టుబడి ఉండేవని అంటున్నారు. సస్పెన్షన్ వేటు ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుపై సస్పెన్షన్ వేటు పడింది. అతన్ని వేకెన్సీ రిజర్వు(వీఆర్)కు పంపారు. ఐటీ దాడుల నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తొలగించడం ఖాయమని బుధవారం నుంచే ప్రచారం జరుగుతున్న తరుణంలో గురువారం తెల్లారేసరికి ఆయనను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం పన్నీర్ సెల్వం గురువారం మంత్రులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులను పోస్టుద్వారా రామ్మోహన్రావు ఇంటికి పంపారు. కాగా, ఐఏఎస్ అధికారుల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా తీవ్రంగా స్పందించే ఐఏఎస్ సంఘం రామ్మోహన్రావు విషయంలో మౌనం పాటిస్తోంది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకుండా రామ్మోహన్రావు ఒక వీవీఐపీగా కొందరు మంత్రులతో రహస్య సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల నిర్మాణ పనులు ఆయన కనుసన్నల్లోనే సాగాలనే ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇలా సర్వాధికారిగా మారడాన్ని సహించలేని కొందరు అధికారులే ఐటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సచివాలయంలో సీఎస్ చాంబర్లో ఐటీ దాడులను ఐఏఎస్ అధికారులు అవమానకరంగా భావిస్తూనే మరోవైపు సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలో మరిన్ని దాడులు ఇదిలా ఉండగా త్వరలో రాష్ట్రంలో మరికొన్ని దాడులు జరుపనున్నట్లు ఐటీ అధికారి ఒకరు తెలిపారు. తమిళనాడుతో పాటూ ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎవరెవరితో వ్యాపార లావాదేవీలు జరిపారో విచారిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు ప్రభుత్వంలోని ఆరుగురు మంత్రులతో శేఖర్‌రెడ్డి, రావులకు వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నామని ఆయన అన్నారు. దాడుల్లో పట్టుబడిన సొమ్ములో ఈ ఆరుగురు మంత్రులకు వాటా ఉన్నట్లు తెలుసుకున్నామని చెప్పారు. కొందరు పారిశ్రామికవేత్తలు సైతం వీరి మనుషులుగా తేలిందన్నారు. శేఖర్‌రెడ్డితో పరిచయం ఉన్న అందరు వ్యక్తులపై తమకు సందేహాలు ఉన్నాయని, అవసరమైతే అందరి ఇళ్లపై దాడులు చేస్తామని చెప్పారు. శేఖర్‌రెడ్డి, రామ్మోహన్రావులకు కొత్త కరెన్సీని చేరవేసిన బ్యాంకు అధికారుల జాబితాను సైతం సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఏఎస్ఐ సంపాదన వంద కోట్లా?
సాక్షి, హైదరాబాద్: పోలీసుగా ఉంటూ భారీ మొత్తాలను వడ్డీకి ఇవ్వడమే కాక, వడ్డీ కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చి ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుైడైన కరీంనగర్ ఏఎస్ఐ బొబ్బల మోహన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో వడ్డీ వ్యాపారం ద్వారా మోహన్‌రెడ్డి రూ.100 కోట్లకు పైగా సంపాదించినట్లు అదనపు పీపీ రామిరెడ్డి ద్వారా తెలుసుకున్న న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ఓ ఏఎస్ఐ సంపాదన వంద కోట్లా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు చెందిన కెన్ క్రెస్ట్ స్కూల్స్ అధినేత రామవరం ప్రసాదరావు ఏఎస్ఐ మోహన్‌రెడ్డి నుంచి రూ.75 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇందులో రూ.50 లక్షలు తిరిగి చెల్లించారు. మిగిలిన మొత్తం విషయంలో వడ్డీ కోసం ప్రసాదరావుపై మోహన్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. మోహన్‌రెడ్డి, మరికొందరు తన ఆత్మహత్యకు కారణమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రసాదరావు భార్య గౌతమి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు కింది కోర్టు నిరాకరించడంతో ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. సీఐడీ అధికారుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ మోహన్‌రెడ్డి ఏఎస్ఐ విధులు నిర్వర్తిస్తూనే భారీ మొత్తాలను వడ్డీకి ఇస్తూ వ్యాపారం చేశారన్నారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దాని ప్రభావం సాక్షులపై ఉంటుందని ఆయన కోర్టుకు నివేదించారు. -
గత్యంతరం లేకే పరారయ్యా..
= రెండు మాసాలుగా నగరంలోనే మకాం = పథకం ప్రకారమే లొంగుబాటు = పోలీసు విచారణలో వంశీ వెల్లడి విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ‘నగరంలో రకరకాలుగా చీటింగ్ చేసి చివరకు బాధితులు ఏం చేస్తారో అనే భయంతో, గత్యంతరం లేక పరారయ్యా. కాలువలో దూకి ఆత్మహ్యత్య చేసుకుందామని అమ్మకు చెప్పా. ఆమె వద్దని సలహా ఇచ్చింది. దాంతో కారును కాలువలో తోసేసి అదృశ్యమయ్యా. రెండు మాసాలుగా నగరంలోనే ఉంటున్నాను.’ నగరంలో కోట్లాది రూపాయలు చీటింగ్ చేసి పరారైన రియల్టర్ నార్ల వంశీకృష్ణ బుధవారం పోలీసుల ఇంటరాగేషన్‌లో వెల్లడించిన విషయాలివి. మోస్ట్‌వాంటెడ్ చీటర్‌గా పోలీసు రికార్డుల్లో నమోదైన వంశీకృష్ణ పోలీసులకు చిక్కిన తరువాత కూడా తనదైన శైలిలో కట్టుకథలు చెపుతూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. పైసా పెట్టుబడి లేకుండా తన మాయమాటలతో ప్రజలనుంచి వంద కోట్లు వసూలు చేసిన వంశీకృష్ణ ఇప్పుడు చేతిలో చిల్లుగవ్వలేదంటూ చెప్పడంతో పోలీసులే అవాక్కవుతున్నారు. వీనస్ డవలపర్స్ పేరుతో నగరంలో బిల్డర్‌గా వ్యాపారం చేసి పేదల నుంచి, పోలీస్ అధికారులు, పారిశ్రామికవేత్తల వరకు అనేక మందికి లక్షలాది రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన వంశీకృష్ణ పోలీసు ఇంటరాగేషన్‌లో తాను అమాయకుడినని, తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని పొలీసులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2011 జనవరి 4న తాను తన తల్లితో కలిసి గుంటూరు జిల్లాకు వెళుతూ దుగ్గిరాలవద్ద జరిగిన సంఘటనపై మరో కట్టు కథ చెప్పినట్లు తెలిసింది. అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, తన తల్లి వద్దని వారించిందని చె ప్పాడు. తాను కనపడితే మోసపోయిన జనం చంపేస్తారనే భయంతో చనిపోయినట్లు నమ్మించే విధంగా కారును కాలువలో తోసి పరారయ్యామని వివరించాడు. ఇక్కడి నుంచి పరారయ్యాక చేతిలో డబ్బులేక తాను అనేక చోట్ల తన తల్లితో కలిసి తిరిగానని చెప్పడు. చివరకు గత్యంతరం లేక వైజాగ్ చేరుకుని అక్కడే ఏడాదిన్నర కాలంగా చిరుద్యోగం చేసుకుంటూ జీవనం సాగించానని చెప్పాడు. తప్పని పరిస్థితిలో తిరిగి రెండు నెలల క్రితం విజయవాడ చేరుకుని ఇక్కడ కాలం వెళ్లబుచ్చుతున్నాని పోలీసులకు చెప్పాడు. పక్కా పథకంతోనే లొంగుబాటు.... చీటర్ వంశీకృష్ణ పోలీసులకు లొంగడంలో కూడా పక్కా వ్యూహంతో వ్యవహరించాడని ప్రజలు భావిస్తున్నారు. తనపై ఏ కేసులు లేని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తనకు సన్నిహత సంబంధాలున్న ఇంటి సమీపంలోనే దొరకడం చర్చనీయాంశమైంది. రాత్రి 9గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూంకు పథకం ప్రకారమే ఫోన్ చేయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. కంట్రోల్ రూం నుంచి వచ్చిన కాల్‌తో ఆ ఏరియాలో బీట్ తిరుగుతున్న బ్లూకోట్స్ కానిస్టేబుల్ ఆ ప్రదే శానికి వెళ్లి అతన్ని సూర్యారావుపేట స్టేషన్‌కు తరలించారు. పద్ధతి ప్రకారం అతన్ని జేబులు పరిశీలించారు. రెండు మనీపర్సులున్నాయి. రూ. 50 నోటు, కట్టుబట్టలు మాత్ర మే అతని వద్ద ఉన్నాయి. చేతికి వెండి కడియం ఉంది. ఇదంతా చూస్తుంటే నిందితుడు పక్కా ప్రణాళికతో లొంగిపోయినట్లు భావిస్తున్నారు. బినామీ పేర్లలో ఆస్తులు.. కాగా బినామీ పేర్లతో ఆస్తులు బదలాయించినట్లు తెలుస్తోంది. అదృశ్యం కావడానికి ముందే అతను ఆస్తులను పక్కా వ్యూహంతో తన బంధు మిత్రులు, సన్నిహితుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. అతని భార్య, అత్త వారధి సమీపంలోని వైస్రాయ్ హైట్స్ అపార్టుమెంటులో రూ. 30లక్షల ప్లాటులో నివాసం ఉంటున్నారు. అదే అపార్టుమెంటులో 14 ప్లాట్లలో ఆరు ప్లాట్లు బిల్డర్‌కు చెందినవి కాగా, మిగిలిన 9 ప్లాట్లు ఒకే వ్యక్తి పేరుతో ఉండటం అనుమానాస్పదంగా ఉందని పలువురు బాధితులు చెబుతున్నారు. ఇవిగాక నగరంలో అతని అనుచర గణం పేరుతో వెంచర్లలో ఐదు ప్లాట్లు బినామీగా పెట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా నగరంలో ఓ డాక్టర్ నిర్వహిస్తున్న హాస్పటల్‌కు కొంత ఫండ్స్ డైవర్ట్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. క్రైం డీసీపీ గీతాదేవి పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.