మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. హాజరైన మంత్రులు, అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్ మహమ్మారి మరింత విస్తరించకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులు, కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఆస్పత్రితోపాటు వికారాబాద్‌లోని టీబీ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేసినట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు మెడికల్ అనుబంధ ఆసుపత్రుల్లో 3 వేల పడకలను అందుబాటులో ఉంచాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వాటిలో కొన్నింటిని సాధారణ ఐసొలేషన్ కోసం, కొన్నింటిని ప్రత్యేక చికిత్స కోసం ముందు జాగ్రత్తగా తీసుకున్నట్లు వివరించారు.
మంత్రి ఈటల నేతృత్వంలోని ఆరోగ్య మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం కోవిడ్‌పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, పలు శాఖల ఉన్నతాధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.
వైరస్ వ్యాపించకుండా ఏయే శాఖలు ఏయే చర్యలు తీసుకోవాలో మంత్రులు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. కోవిడ్ విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైరస్ సోకిన బాధితుని పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని తెలిపారు. కోవిడ్‌కు ఇవ్వాల్సిన చికిత్సపై అధ్యయనం చేసేందుకు 15 మంది డాక్టర్లు, జిల్లా వైద్యాధికారుల బృందాన్ని కేరళకు పంపిస్తున్నామని చెప్పారు. వైరస్ కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు పాటిస్తున్నామన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కార్యదర్శి ప్రీతి సుడాన్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొరత ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి 50 వేలు మాస్కులు పంపించాలని అడిగామని చెప్పారు.
ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు..
కోవిడ్ వైరస్ గాలి ద్వారా వ్యాపించదని, అయితే రోగి దగ్గినా, తుమ్మినా తుంపర్లు గాలిలో 12 గంటల పాటు ఉంటాయని, వాటి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదముందని ఈటల తెలిపారు. వైరస్ భయం పోయేదాకా ప్రజలు షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలని సూచించారు. ఆప్తులకూ నమస్కారమే చేయాలన్నారు. కోవిడ్ వైరస్ సోకిన వాళ్లు మాస్క్‌లు ధరిస్తే సరిపోతుందని, అందరూ ధరించాల్సిన అవసరం లేదని ఈటల సూచించారు. కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కర్చీఫ్ లేదా చెయ్యి అడ్డం పెట్టుకోవాలన్నారు. శానిటైజర్లు వినియోగించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హోటళ్లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల వంటి జన సమ్మర్థ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నవారు కూడా జాగ్రత్తలు వహించాలన్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఈ చర్యలన్నీ వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తలో భాగమేనని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మన దగ్గర అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం తక్కువగా ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో వైరస్ విస్తరించే అవకాశం తక్కువని మంత్రి చెప్పారు.
రోగుల ట్రావెల్ హిస్టరీ కనుక్కోండి..
రోగుల ట్రావెల్ హిస్టరీ అడగాలని, బయటి దేశాలకు వెళ్లొచ్చిన వారితో సన్నిహితంగా మెలిగారేమో కనుక్కోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు ఈటల విజ్ఞప్తి చేశారు. ట్రావెల్ హిస్టరీ, విదేశాలకు వెళ్లొచ్చిన వాళ్లతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు వస్తే వెంటనే వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి, లక్షణాలపై అవగాహన కల్పించేందుకు భారీ ప్రచారం నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందన్నారు.
అంతా ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నా..
కోవిడ్ కేసు తెలంగాణలో నమోదు కావడంతో తనకు నిద్ర కూడా పట్టడంలేదని మంత్రి ఈటల రాజేందర్ విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి 12 గంటలకు నిద్రపోయానని, మళ్లీ ఉదయం 4 గంటలకే మెలకువ వచ్చిందన్నారు. అంతా ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. 88 మంది అనుమానితుల్లో ఎవరికీ పాజిటివ్ రాకూడదని దేవుడిని ప్రార్ధించానన్నారు. నిద్రాహారాలు మాని కోవిడ్ వైరస్ రాకుండా అందరూ పనిచేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment