సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై ఉందని, తెలంగాణకు సరిపడా టీకా డోసులు కేంద్రం పంపుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ సమస్యను త్వరలోనే కేంద్రం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా తగ్గించి ఆరోగ్య రంగానికి కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోలేవని చెప్పారు. ఆక్సిజన్ విషయంలో ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ పాటించాలన్నారు. కరోనా ట్రీట్‌మెంట్‌ను ప్రొటోకాల్స్ మేరకే ఇవ్వాలని ప్రభుత్వ ఆస్పత్రులకు సూచించారు. తెలంగాణ ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత లేదని స్పష్టం చేశారు.
కేవలం 5, 6 ఆస్పత్రుల్లో బెడ్స్ నిండిపోయాయని, రాష్ట్రంలో 60 వేల బెడ్స్ ఖాళీగా ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. స్వీయ నియంత్రణ తప్ప మరో మార్గం లేదని, బంద్‌లు, లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే అవకాశం లేదని తెలిపారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలి, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాల్లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment