
ఏఎస్‌ఐ సంపాదన వంద కోట్లా?
సాక్షి, హైదరాబాద్: పోలీసుగా ఉంటూ భారీ మొత్తాలను వడ్డీకి ఇవ్వడమే కాక, వడ్డీ కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చి ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుైడైన కరీంనగర్ ఏఎస్‌ఐ బొబ్బల మోహన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో వడ్డీ వ్యాపారం ద్వారా మోహన్‌రెడ్డి రూ.100 కోట్లకు పైగా సంపాదించినట్లు అదనపు పీపీ రామిరెడ్డి ద్వారా తెలుసుకున్న న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు.
ఓ ఏఎస్‌ఐ సంపాదన వంద కోట్లా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు చెందిన కెన్ క్రెస్ట్ స్కూల్స్ అధినేత రామవరం ప్రసాదరావు ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి నుంచి రూ.75 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇందులో రూ.50 లక్షలు తిరిగి చెల్లించారు. మిగిలిన మొత్తం విషయంలో వడ్డీ కోసం ప్రసాదరావుపై మోహన్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. మోహన్‌రెడ్డి, మరికొందరు తన ఆత్మహత్యకు కారణమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రసాదరావు భార్య గౌతమి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసేందుకు కింది కోర్టు నిరాకరించడంతో ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. సీఐడీ అధికారుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ మోహన్‌రెడ్డి ఏఎస్‌ఐ విధులు నిర్వర్తిస్తూనే భారీ మొత్తాలను వడ్డీకి ఇస్తూ వ్యాపారం చేశారన్నారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దాని ప్రభావం సాక్షులపై ఉంటుందని ఆయన కోర్టుకు నివేదించారు.