సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కిందటి ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ వైపు నిందితుల జాబితా పెరిగిపోతుండగా.. మరోవైపు లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్గా మారిన ఈ స్కాం విలువ ఎంత? ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.100 కోట్లు. ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా జప్తు చేసిన సీఐడీ.. కుంభకోణం విలువ వంద కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని చెబుతోంది.
ఒక్కో విద్యార్థితో రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు లీకేజీ మాఫియా వసూలు చేయగా.. కొంత మంది తల్లిదండ్రులు సైతం తమ పిల్లలతోపాటు మరికొందరు విద్యార్థులను క్యాంపునకు పంపించి లక్షల్లో దండుకున్నారు. ఎట్టకేలకు మొత్తం వ్యవహారం బట్టబయలు కావడంతో వసూలు చేసిన డబ్బంతా సీఐడీ సీజ్ చేస్తూ వెళ్తోంది. త్వరలోనే ఆ మొత్తం రూ.వంద కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
250 మందికిపైగా విద్యార్థులు!
ముందుగా 60 మంది విద్యార్థులు మాత్రమే లీకైన ప్రశ్నపత్రంతో పరీక్ష రాసి ఉంటారని సీఐడీ అనుమానించింది. 2016 నుంచి సాగుతున్న దర్యాప్తులో ఈ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 250కి పైగా చేరిపోయింది. అలాగే అరెస్టయిన కీలక సూత్రధారులు, వారి నుంచి కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డ బ్రోకర్ల సంఖ్య కూడా 100కు చేరువైంది. 90 మంది నిందితులను ఇప్పటికే పట్టుకున్న సీఐడీ.. మరో 10 మంది కీలక నిందితుల కోసం వేట సాగిస్తోంది. రేపో మాపో కీలక సూత్రధారులను పట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దర్యాప్తులో భాగంగా సీఐడీ ఇప్పటివరకు రూ.70 కోట్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకుంది. మరికొందరు బ్రోకర్లు పరారీలో ఉండగా, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన పది మంది కీలక నిందితులు అరెస్టయితే వీరి నుంచి మరికొంత రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణం విలువ రూ.100 కోట్లకు చేరే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు తెలిపాయి. మరి ఇంతటి కుంభకోణంలో ఎంతటి తలలుంటాయి? ఎంత పెద్ద వ్యక్తులు పాత్రధారులై ఉంటారానే దానిపై సీఐడీ దృష్టి సారించింది.
అరెస్టులకు అరకోటిపైనే ఖర్చు
ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో కీలక సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు సంస్థ సీఐడీకి రూ.65 లక్షలకు పైగా ఖర్చు వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి ప్రాంతాలకో చెందిన నిందితులను గుర్తించి, వారికోసం రోజుల తరబడి నిఘా పెట్టి పట్టుకునేందుకు భారీ స్థాయిలోనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒక్క కేసులో ఇంత మంది నిందితులను పట్టుకోవడం అంతసులభమైన పనేం కాదని, ప్రతి అధికారి కూడా సిబ్బంది బృందాల్లో ఉండి కీలకంగా వ్యవహరించారని సీఐడీ సీనియర్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment