eamcet leackage
-
బ్రోకర్ల లింకు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: ‘ఎంసెట్’లీకేజీ వ్యవహారంలో ఎంత మంది విద్యార్థులు ప్రశ్నపత్రంపై శిక్షణ తీసుకున్నారో లెక్క తేల్చాలని దర్యాప్తు అధికారులను సీఐడీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకోసం వాసుబాబు, శివనారాయణను లోతుగా ప్రశ్నించాలని, వారికున్న లింకులు తెలుసుకోవాలని చెప్పారు. ఇప్పటివరకు అరెస్టయిన బ్రోకర్ల ద్వారా 250 మంది విద్యార్థులు క్యాంపులకు వెళ్లినట్లు సీఐడీ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో వారి నుంచి వాంగ్మూలాలు సేకరించడం, బ్రోకర్లకు తల్లిదండ్రులు ఇచ్చిన నగదు, చేసుకున్న ఒప్పందాల వివరాలు రాబట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. బ్రోకర్ల లింకులు బయటపడటం, కార్పొరేట్ కాలేజీల వ్యవహారం వెలుగులోకి రావడంతో సీఐడీ మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 73 మంది అరెస్టు కేసుకు సంబంధించి ఇప్పటివరకు 73 మందిని సీఐడీ అరెస్టు చేసింది. వీరిలో కీలకమైన బ్రోకర్లకు సంబంధిం చి దర్యాప్తు పూర్తిస్థాయిలో జరిగింది. మిగతా బ్రోకర్లకు సంబంధించి ఏయే విద్యార్థి, ఎక్కడెక్కడ క్యాంపునకు వెళ్లారు? వారి తల్లిదండ్రులు బ్రోకర్‌కు ఎంత చెల్లించారో లింకు చేయాల్సి ఉంది. శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ సీఐడీ కస్టడీలో ఉండటంతో ఈ కాలేజీల నుంచి ఎంత మంది వెళ్లారు, ఎంత మొత్తంలో సొమ్ము ముట్టజెప్పారో తేల్చా లని సీఐడీ యత్నిస్తోంది. ఇందుకు విద్యార్థుల వాంగ్మూ లాలు సేకరించాలని.. వారి తల్లిదండ్రులను పిలిచి బ్రోకర్లు, వాసుబాబు, శివనారాయణ ఎదుట ప్రశ్నించా లని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులను కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు ఆదేశించనున్నారు. కటక్ నుంచి హైదరాబాద్‌కు శివనారాయణ కటక్‌లో క్యాంపు నడపడంతో అక్కడ ఏ హోటల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు, ఆ హోటల్‌కు వచ్చిన కీలక సూత్రధారులు, వారికి సంబంధించిన ఆధారాల కోసం అధికారులు కటక్ వెళ్లారు. అక్కడ విచారణ, సీన్ ఆఫ్ అఫెన్స్ అధ్యయనం పూర్తవడంతో శివనారాయణతో సహా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. శివనారాయణకు కమిలేశ్‌కుమార్ సింగ్, డాక్టర్ ధనుంజయ్, సందీప్‌కు ఉన్న లింకు తేల్చే దిశగా సీఐడీ దర్యాప్తు చేయబోతోంది. కటక్‌లో నేరుగా కమిలేశ్‌ను శివనారాయణ కలసినట్లు ఆరోపిస్తున్న సీఐడీ కమిలేశ్‌ను శివనారాయణ కలిశాడో లేదో ధనుంజయ్, సందీప్, గణేశ్ ప్రసాద్‌ల విచారణలో తేలుతుందని భావిస్తోంది. మళ్లీ రావాల్సిందే కేసు విచారణలో ముందుగా అరెస్టయిన అగర్వాల్, కొల్లి రాజేశ్కుమార్లను మళ్లీ విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు ఆదేశించనున్నారు. వీరితో పాటు ధనుంజయ్‌ను కూడా మరోమారు విచారించనున్నారు. అగర్వాల్, రాజేశ్‌కుమార్, ధనుంజయ్‌లతో కూడా శివనారాయణ, వాసుబాబు సంప్రదింపులు జరిపినట్లు సీఐ డీ గుర్తించింది. వారిని కూడా పిలిచి ఫేస్ టు ఫేస్ విచారిస్తే కథ మొత్తం బయటపడుతుందని భావిస్తోంది. -
ఎంసెట్ లీకేజ్ 100 కోట్ల స్కాం
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కిందటి ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ వైపు నిందితుల జాబితా పెరిగిపోతుండగా.. మరోవైపు లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్గా మారిన ఈ స్కాం విలువ ఎంత? ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.100 కోట్లు. ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా జప్తు చేసిన సీఐడీ.. కుంభకోణం విలువ వంద కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని చెబుతోంది. ఒక్కో విద్యార్థితో రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు లీకేజీ మాఫియా వసూలు చేయగా.. కొంత మంది తల్లిదండ్రులు సైతం తమ పిల్లలతోపాటు మరికొందరు విద్యార్థులను క్యాంపునకు పంపించి లక్షల్లో దండుకున్నారు. ఎట్టకేలకు మొత్తం వ్యవహారం బట్టబయలు కావడంతో వసూలు చేసిన డబ్బంతా సీఐడీ సీజ్ చేస్తూ వెళ్తోంది. త్వరలోనే ఆ మొత్తం రూ.వంద కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 250 మందికిపైగా విద్యార్థులు! ముందుగా 60 మంది విద్యార్థులు మాత్రమే లీకైన ప్రశ్నపత్రంతో పరీక్ష రాసి ఉంటారని సీఐడీ అనుమానించింది. 2016 నుంచి సాగుతున్న దర్యాప్తులో ఈ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 250కి పైగా చేరిపోయింది. అలాగే అరెస్టయిన కీలక సూత్రధారులు, వారి నుంచి కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డ బ్రోకర్ల సంఖ్య కూడా 100కు చేరువైంది. 90 మంది నిందితులను ఇప్పటికే పట్టుకున్న సీఐడీ.. మరో 10 మంది కీలక నిందితుల కోసం వేట సాగిస్తోంది. రేపో మాపో కీలక సూత్రధారులను పట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా సీఐడీ ఇప్పటివరకు రూ.70 కోట్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకుంది. మరికొందరు బ్రోకర్లు పరారీలో ఉండగా, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన పది మంది కీలక నిందితులు అరెస్టయితే వీరి నుంచి మరికొంత రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణం విలువ రూ.100 కోట్లకు చేరే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు తెలిపాయి. మరి ఇంతటి కుంభకోణంలో ఎంతటి తలలుంటాయి? ఎంత పెద్ద వ్యక్తులు పాత్రధారులై ఉంటారానే దానిపై సీఐడీ దృష్టి సారించింది. అరెస్టులకు అరకోటిపైనే ఖర్చు ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో కీలక సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు సంస్థ సీఐడీకి రూ.65 లక్షలకు పైగా ఖర్చు వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి ప్రాంతాలకో చెందిన నిందితులను గుర్తించి, వారికోసం రోజుల తరబడి నిఘా పెట్టి పట్టుకునేందుకు భారీ స్థాయిలోనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒక్క కేసులో ఇంత మంది నిందితులను పట్టుకోవడం అంతసులభమైన పనేం కాదని, ప్రతి అధికారి కూడా సిబ్బంది బృందాల్లో ఉండి కీలకంగా వ్యవహరించారని సీఐడీ సీనియర్ అధికారులు తెలిపారు. -
ఎంసెట్ కేసులో.. శివ ‘నారాయణ’ హీట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ స్కాం ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మంత్రి కార్యాలయంలో కలవరం సృష్టిస్తోంది. శ్రీచైతన్యతోపాటు నారాయణ కాలేజీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న వెంకట శివనారాయణరావు అరెస్ట్‌తో ఆ మంత్రి క్యాంపు కార్యాలయం తీవ్ర ఆందోళనకు లోనవుతున్నట్లు అక్కడి ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని బట్టి తెలుస్తోంది. శివనారాయణరావుకు బెయిల్ వచ్చేట్టు చూడాలని కొందరు ఐపీఎస్ అధికారుల నుంచి సీఐడీకి ఫోన్లు వెళ్లినట్లు తెలిసింది. ఎంసెట్ కేసులో కటకటాల్లోకి వెళ్లిన శివనారాయణరావుతో ఏపీ మంత్రి, ఆయన కార్యాలయంలోని చాలా మంది అధికారులకు లింకులుండటమే దీనికి కారణం. విచారణలో ఆయన అన్ని విషయాలు వెల్లడిస్తాడేమోనన్న భయం వారిని వణికిస్తున్నట్టు తెలుస్తోంది. శివనారాయణకు నేరుగా సంబంధిత మంత్రితో సంబంధాలుండటం, కాలేజీల వ్యవహారాలను శివనారాయణే డీల్ చేయడంతో ప్రశ్నపత్రం స్కాంతో మంత్రి కార్యాలయానికి ఏదో సంబంధమున్నట్టు సీఐడీ అనుమానిస్తోంది. ఈ అనుమానాలకు బలం కలిగించేలా శివనారాయణరావు వ్యవహారాలున్నాయని సీఐడీ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సిమ్ కార్డులు మార్చేయండి... సరిగ్గా రెండురోజుల క్రితం మంత్రి తనతో రెగ్యులర్‌గా ఫోన్లో మాట్లాడే వాళ్లకి, తన సంబంధీకులకు, తన కార్యాలయంలో ఉండే ప్రైవేట్ సిబ్బందికి సిమ్‌కార్డులు మార్చుకోవాలని హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఎంసెట్ స్కాంలో నిందితులతో మాట్లాడిన సందర్భంలో ప్రతీసారి మంత్రి క్యాంపు కార్యాలయంలో పనిచేసే వ్యక్తిగత సిబ్బందితో కాల్స్ ఉన్నట్టు సీఐడీ దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీనితో ఎప్పుడు సీఐడీ అధికారులు తమను అదుపులోకి తీసుకుంటారో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏకంగా తన వ్యక్తిగత సిబ్బందిగా చెప్పుకునే 8 మంది సిమ్‌కార్డులు, సెల్ఫోన్లు మార్చేసినట్టు సీఐడీ అధికారుల విచారణలో బయటపడింది. అతడిని అరెస్ట్ చెయ్యొద్దు... ఎంసెట్ స్కాంలో శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబుతోపాటు శివనారాయణను అరెస్ట్ చేయడానికి ముందు కూడా సీఐడీ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ఐపీఎస్, డీఎస్పీ స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడంతోపాటు భవిష్యత్‌లో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న నలుగురు ఐపీఎస్ అధికారులు, తెలంగాణలో పనిచేస్తున్న ఆరుగురు ఐఏఎస్‌లు, మంత్రుల కార్యాలయాల్లో ఉన్న ముగ్గురు కీలక అధికారులతోపాటు ఢిల్లీలో ఉన్న ఇద్దరు, తెలంగాణలో ఉన్న ఇద్దరు పోలీస్ అధికారులు ఫోన్ల ద్వారా దర్యాప్తు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు సీఐడీ వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసే పూర్తి ఆధారాలు తాము సేకరించామని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అరెస్ట్‌పై ముందుకు కదిలామని సంబంధిత అధికారులకు దర్యాప్తు అధికారి ఒకరు సూటిగా సమాధానమిచ్చినట్టు తెలిసింది. అరెస్ట్ చేయవద్దని చెప్పిన అధికారుల పిల్లలంతా కార్పొరేట్ కాలేజీలో చదవడంతోపాటు సంబంధిత మంత్రికి సన్నిహితులుగా ముద్రపడ్డ వారేనని సీఐడీ భావిస్తోంది. నా గురించి మీకు తెలియదు... నారాయణ, శ్రీచైతన్య కాలేజీల ఏజెంట్ శివనారాయణను అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో అతడు దర్యాప్తు అధికారికే ఎదురు తిరిగే ప్రయత్నం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తన బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా పట్టుకువచ్చారని, తనకు మద్దతుగా 9 మంది న్యాయవాదులు వచ్చారని, ఇప్పటికైనా తన రేంజ్ ఏంటో తెలుసుకోవాలని దర్యాప్తు అధికారులకే వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. తనతో పెట్టుకుంటే భవిష్యత్‌లో పోస్టింగ్స్, పదోన్నతులకు అంతరాయం ఏర్పడుతుందని, ఇప్పటికే మీ ఉన్నతాధికారుల ఒత్తిడి తీవ్రతరం అయ్యుంటుందని విచారణ సమయంలో సంబంధిత అధికారిని బెదిరించినట్టు సీఐడీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తప్పు చేసి దొరికిపోయిన వ్యక్తి పాల్పడే బెదిరింపులకు తాము భయపడమని, ఉన్నతాధికారుల ఆదేశాలతో తాము ముందుకువెళ్తామని, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండని దర్యాప్తు అధికారి తేల్చిచెప్పినట్టు తెలిసింది. పోలీసులంటే చాలా నీచమైన భావంతో శివనారాయణ వ్యవహరించినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. ఆ 26 మంది పీఆర్వోలపై నజర్... శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలతోపాటు సంబంధిత మంత్రి, ఇతర బ్రాంచులు, కాలేజీల్లో పనిచేస్తున్న 26 మంది పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ (పీఆర్వో)లపై సీఐడీ తాజాగా దృష్టి సారించింది. ప్రశ్నపత్రం లీకేజీ స్కాంతో పీఆర్వోలకు లింకు ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ 26 మందితో డాక్టర్ ధనుంజయ్, సందీప్‌కు లింకుందని, వీరి ద్వారా మిగతా బ్రాంచుల్లోని విద్యార్థులను సైతం కటక్ క్యాంపుతో ఇతర క్యాంపులకు విద్యార్థులను తరలించి ఉంటారన్న కోణంలోనూ సీఐడీ దర్యాప్తు చేస్తోంది. మంచి ర్యాంకులు, మెడికల్ సీట్లు వచ్చేలా చేస్తామని చెప్పి శివనారాయణ పీఆర్వోల ద్వారా సంబంధిత కాలేజీల్లోని విద్యార్థుల తల్లిదండ్రులను ట్రాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నవారికి శివనారాయణ లింక్, మిగతా కాలేజీల్లోని పీఆర్వోల లింకు తేలితే మంత్రికి చుక్కలు కనిపించడం ఖాయమని తెలుస్తోంది. -
ఎంసెట్ లీక్‌లో మంత్రుల హస్తం
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అనిల్‌రెడ్డి జహీరాబాద్ టౌన్: ఎంసెట్-2 పేపర్ లీక్‌లో రాష్ర్ట మంత్రుల హస్తం ఉందని, వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ యెన్నం అనిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో మంగళవారం నగర మహాసభను నిర్వహించారు. అనిల్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, కన్వీనర్ రమణరావు కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయన్నారు. ఫలితంగా పేద విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. వీరిని తొలగించిన తరువాతే ఎంసెట్-3 నిర్వహించాలన్నారు. సమావేశంలో బాగ్ కన్వీనర్ ఆనందీశ్వర్, నాయకులు విజయ్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.