సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ స్కాం ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మంత్రి కార్యాలయంలో కలవరం సృష్టిస్తోంది. శ్రీచైతన్యతోపాటు నారాయణ కాలేజీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న వెంకట శివనారాయణరావు అరెస్ట్‌తో ఆ మంత్రి క్యాంపు కార్యాలయం తీవ్ర ఆందోళనకు లోనవుతున్నట్లు అక్కడి ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని బట్టి తెలుస్తోంది. శివనారాయణరావుకు బెయిల్ వచ్చేట్టు చూడాలని కొందరు ఐపీఎస్ అధికారుల నుంచి సీఐడీకి ఫోన్లు వెళ్లినట్లు తెలిసింది.
ఎంసెట్ కేసులో కటకటాల్లోకి వెళ్లిన శివనారాయణరావుతో ఏపీ మంత్రి, ఆయన కార్యాలయంలోని చాలా మంది అధికారులకు లింకులుండటమే దీనికి కారణం. విచారణలో ఆయన అన్ని విషయాలు వెల్లడిస్తాడేమోనన్న భయం వారిని వణికిస్తున్నట్టు తెలుస్తోంది. శివనారాయణకు నేరుగా సంబంధిత మంత్రితో సంబంధాలుండటం, కాలేజీల వ్యవహారాలను శివనారాయణే డీల్ చేయడంతో ప్రశ్నపత్రం స్కాంతో మంత్రి కార్యాలయానికి ఏదో సంబంధమున్నట్టు సీఐడీ అనుమానిస్తోంది. ఈ అనుమానాలకు బలం కలిగించేలా శివనారాయణరావు వ్యవహారాలున్నాయని సీఐడీ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
సిమ్ కార్డులు మార్చేయండి...
సరిగ్గా రెండురోజుల క్రితం మంత్రి తనతో రెగ్యులర్‌గా ఫోన్‌లో మాట్లాడే వాళ్లకి, తన సంబంధీకులకు, తన కార్యాలయంలో ఉండే ప్రైవేట్ సిబ్బందికి సిమ్‌కార్డులు మార్చుకోవాలని హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఎంసెట్ స్కాంలో నిందితులతో మాట్లాడిన సందర్భంలో ప్రతీసారి మంత్రి క్యాంపు కార్యాలయంలో పనిచేసే వ్యక్తిగత సిబ్బందితో కాల్స్ ఉన్నట్టు సీఐడీ దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీనితో ఎప్పుడు సీఐడీ అధికారులు తమను అదుపులోకి తీసుకుంటారో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏకంగా తన వ్యక్తిగత సిబ్బందిగా చెప్పుకునే 8 మంది సిమ్‌కార్డులు, సెల్‌ఫోన్లు మార్చేసినట్టు సీఐడీ అధికారుల విచారణలో బయటపడింది.
అతడిని అరెస్ట్ చెయ్యొద్దు...
ఎంసెట్ స్కాంలో శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబుతోపాటు శివనారాయణను అరెస్ట్ చేయడానికి ముందు కూడా సీఐడీ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ఐపీఎస్, డీఎస్పీ స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడంతోపాటు భవిష్యత్‌లో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న నలుగురు ఐపీఎస్ అధికారులు, తెలంగాణలో పనిచేస్తున్న ఆరుగురు ఐఏఎస్‌లు, మంత్రుల కార్యాలయాల్లో ఉన్న ముగ్గురు కీలక అధికారులతోపాటు ఢిల్లీలో ఉన్న ఇద్దరు, తెలంగాణలో ఉన్న ఇద్దరు పోలీస్ అధికారులు ఫోన్ల ద్వారా దర్యాప్తు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు సీఐడీ వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసే పూర్తి ఆధారాలు తాము సేకరించామని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అరెస్ట్‌పై ముందుకు కదిలామని సంబంధిత అధికారులకు దర్యాప్తు అధికారి ఒకరు సూటిగా సమాధానమిచ్చినట్టు తెలిసింది. అరెస్ట్ చేయవద్దని చెప్పిన అధికారుల పిల్లలంతా కార్పొరేట్ కాలేజీలో చదవడంతోపాటు సంబంధిత మంత్రికి సన్నిహితులుగా ముద్రపడ్డ వారేనని సీఐడీ భావిస్తోంది.
నా గురించి మీకు తెలియదు...
నారాయణ, శ్రీచైతన్య కాలేజీల ఏజెంట్ శివనారాయణను అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో అతడు దర్యాప్తు అధికారికే ఎదురు తిరిగే ప్రయత్నం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తన బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా పట్టుకువచ్చారని, తనకు మద్దతుగా 9 మంది న్యాయవాదులు వచ్చారని, ఇప్పటికైనా తన రేంజ్ ఏంటో తెలుసుకోవాలని దర్యాప్తు అధికారులకే వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. తనతో పెట్టుకుంటే భవిష్యత్‌లో పోస్టింగ్స్, పదోన్నతులకు అంతరాయం ఏర్పడుతుందని, ఇప్పటికే మీ ఉన్నతాధికారుల ఒత్తిడి తీవ్రతరం అయ్యుంటుందని విచారణ సమయంలో సంబంధిత అధికారిని బెదిరించినట్టు సీఐడీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తప్పు చేసి దొరికిపోయిన వ్యక్తి పాల్పడే బెదిరింపులకు తాము భయపడమని, ఉన్నతాధికారుల ఆదేశాలతో తాము ముందుకువెళ్తామని, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండని దర్యాప్తు అధికారి తేల్చిచెప్పినట్టు తెలిసింది. పోలీసులంటే చాలా నీచమైన భావంతో శివనారాయణ వ్యవహరించినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి.
ఆ 26 మంది పీఆర్‌వోలపై నజర్...
శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలతోపాటు సంబంధిత మంత్రి, ఇతర బ్రాంచులు, కాలేజీల్లో పనిచేస్తున్న 26 మంది పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ (పీఆర్‌వో)లపై సీఐడీ తాజాగా దృష్టి సారించింది. ప్రశ్నపత్రం లీకేజీ స్కాంతో పీఆర్‌వోలకు లింకు ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ 26 మందితో డాక్టర్ ధనుంజయ్, సందీప్‌కు లింకుందని, వీరి ద్వారా మిగతా బ్రాంచుల్లోని విద్యార్థులను సైతం కటక్ క్యాంపుతో ఇతర క్యాంపులకు విద్యార్థులను తరలించి ఉంటారన్న కోణంలోనూ సీఐడీ దర్యాప్తు చేస్తోంది. మంచి ర్యాంకులు, మెడికల్ సీట్లు వచ్చేలా చేస్తామని చెప్పి శివనారాయణ పీఆర్‌వోల ద్వారా సంబంధిత కాలేజీల్లోని విద్యార్థుల తల్లిదండ్రులను ట్రాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నవారికి శివనారాయణ లింక్, మిగతా కాలేజీల్లోని పీఆర్‌వోల లింకు తేలితే మంత్రికి చుక్కలు కనిపించడం ఖాయమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment