సాక్షి, హైదరాబాద్: ‘ఎంసెట్’లీకేజీ వ్యవహారంలో ఎంత మంది విద్యార్థులు ప్రశ్నపత్రంపై శిక్షణ తీసుకున్నారో లెక్క తేల్చాలని దర్యాప్తు అధికారులను సీఐడీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకోసం వాసుబాబు, శివనారాయణను లోతుగా ప్రశ్నించాలని, వారికున్న లింకులు తెలుసుకోవాలని చెప్పారు.
ఇప్పటివరకు అరెస్టయిన బ్రోకర్ల ద్వారా 250 మంది విద్యార్థులు క్యాంపులకు వెళ్లినట్లు సీఐడీ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో వారి నుంచి వాంగ్మూలాలు సేకరించడం, బ్రోకర్లకు తల్లిదండ్రులు ఇచ్చిన నగదు, చేసుకున్న ఒప్పందాల వివరాలు రాబట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. బ్రోకర్ల లింకులు బయటపడటం, కార్పొరేట్ కాలేజీల వ్యవహారం వెలుగులోకి రావడంతో సీఐడీ మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు 73 మంది అరెస్టు
కేసుకు సంబంధించి ఇప్పటివరకు 73 మందిని సీఐడీ అరెస్టు చేసింది. వీరిలో కీలకమైన బ్రోకర్లకు సంబంధిం చి దర్యాప్తు పూర్తిస్థాయిలో జరిగింది. మిగతా బ్రోకర్లకు సంబంధించి ఏయే విద్యార్థి, ఎక్కడెక్కడ క్యాంపునకు వెళ్లారు? వారి తల్లిదండ్రులు బ్రోకర్‌కు ఎంత చెల్లించారో లింకు చేయాల్సి ఉంది.
శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ సీఐడీ కస్టడీలో ఉండటంతో ఈ కాలేజీల నుంచి ఎంత మంది వెళ్లారు, ఎంత మొత్తంలో సొమ్ము ముట్టజెప్పారో తేల్చా లని సీఐడీ యత్నిస్తోంది. ఇందుకు విద్యార్థుల వాంగ్మూ లాలు సేకరించాలని.. వారి తల్లిదండ్రులను పిలిచి బ్రోకర్లు, వాసుబాబు, శివనారాయణ ఎదుట ప్రశ్నించా లని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులను కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు ఆదేశించనున్నారు.
కటక్ నుంచి హైదరాబాద్‌కు
శివనారాయణ కటక్‌లో క్యాంపు నడపడంతో అక్కడ ఏ హోటల్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు, ఆ హోటల్‌కు వచ్చిన కీలక సూత్రధారులు, వారికి సంబంధించిన ఆధారాల కోసం అధికారులు కటక్ వెళ్లారు. అక్కడ విచారణ, సీన్ ఆఫ్ అఫెన్స్ అధ్యయనం పూర్తవడంతో శివనారాయణతో సహా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు.
శివనారాయణకు కమిలేశ్‌కుమార్ సింగ్, డాక్టర్ ధనుంజయ్, సందీప్‌కు ఉన్న లింకు తేల్చే దిశగా సీఐడీ దర్యాప్తు చేయబోతోంది. కటక్‌లో నేరుగా కమిలేశ్‌ను శివనారాయణ కలసినట్లు ఆరోపిస్తున్న సీఐడీ కమిలేశ్‌ను శివనారాయణ కలిశాడో లేదో ధనుంజయ్, సందీప్, గణేశ్ ప్రసాద్‌ల విచారణలో తేలుతుందని భావిస్తోంది.
మళ్లీ రావాల్సిందే
కేసు విచారణలో ముందుగా అరెస్టయిన అగర్వాల్, కొల్లి రాజేశ్‌కుమార్‌లను మళ్లీ విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు ఆదేశించనున్నారు. వీరితో పాటు ధనుంజయ్‌ను కూడా మరోమారు విచారించనున్నారు. అగర్వాల్, రాజేశ్‌కుమార్, ధనుంజయ్‌లతో కూడా శివనారాయణ, వాసుబాబు సంప్రదింపులు జరిపినట్లు సీఐ డీ గుర్తించింది. వారిని కూడా పిలిచి ఫేస్ టు ఫేస్ విచారిస్తే కథ మొత్తం బయటపడుతుందని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment