చిరుతను చూసిన రైతు మునిశేఖర్ ,చిరుత పాదముద్రలు ,
చిత్తూరు, భాకరాపేట : ‘వామ్మో పులి...రాండ్రో రండి కాపాడండి..వచ్చేసింది చెట్లో ఉండా... చెట్టుకాడికి వచ్చేస్తోందంటూ పొలాల నుంచి గ్రామస్తులకు అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. కాసేపటికే గ్రామస్తులు గుమికూడారు. పెద్ద ఎత్తున అరుపులు కేకలతో పల్లె పక్కనే ఉన్న పొలాల్లోకి కట్టెలు, బరిసెలు, కొడవళ్లు చేతబట్టుకుని పరుగులు పెట్టారు. గ్రామస్తుల అరుపులు...టార్చిలైట్ల వెలుగులు చూసి చిరుత అక్కడి నుంచి జారుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్ల పంచాయతీ సిరిగెలవారిపల్లె పొలాల్లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన రైతు మునిశేఖర్ రోజూలాగే గురువారం రాత్రి మామిడి తోటలోకి కాపాలా వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో అలికిడి అయింది. టార్చిలైట్ వేసి చూస్తే చిరుత మెల్లగా అడుగులు వేస్తూ వస్తోంది. వెంటనే అతడు భయపడి పెద్ద చెట్టు ఎక్కేశాడు. ఫోన్ ద్వారా పక్కనే ఉన్న గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తులు పరుగున అక్కడికి చేరుకుంటుండగా శబ్ధాలు విని చిరుత వెళ్లిపోయింది.
అటవీ అధికారుల సందర్శన
సిరిగెలవారిపల్లె పొలాల్లో చిరుత సంచరించిన ప్రాంతాన్ని భాకరాపేట ఎఫ్‌ఎస్‌వో నాగరాజ సిబ్బందితో కలసి సందర్శించారు. చిరుత పాదముద్రలను తీసుకున్నారు. ఎండలు ఎక్కువ కావడం.. అడవుల్లో మేత, నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పల్లెల వైపు వస్తున్నాయని ఎఫ్‌ఎస్‌వో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment