కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలను కర్నూలులో నిర్వహించాలని తలపెట్టిందని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ సిహెచ్.విజయ్‌మోహన్ పిలుపునిచ్చారు. జిల్లా అధికారులతో కలిసి మంగళవారం ఏపీఎస్పీ పటాలంలోని మైదానాన్ని ఆయన పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
సభా వేదిక, జాతీయ జెండావిష్కరణకు సంబంధించిన దిమ్మె ఏర్పాట్లు ఎలా ఉండాలనేదానిపై అధికారులతో చర్చించారు. శకటాల ప్రవేశం, పెరేడ్ నిర్వహణ, హెలిపాడ్ నిర్మాణం తదితర వాటికి సంబంధించి రూపొందించిన రూట్ మ్యాప్‌ను కూడా పరిశీలించారు. వీఐపీల గ్యాలరీ, వీక్షకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే షామియానాలు ఎక్కడెక్కడ ఉండాలనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పటాలానికి రెండు వైపులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
బారికేడ్స్ నిర్మాణం, మెటల్ డిక్టేటర్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ వెంట పటాలం కమాండెంట్ విజయ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ వివిఎస్.మూర్తి, కర్నూలు ఆర్‌డీఓ రఘుబాబు, మునిసిపల్ ఇంజినీర్ రాజశేఖర్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉన్నారు.
18 లేదా 19 చీఫ్ సెక్రటరీ వచ్చే అవకాశం...
స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నందున ఈనెల 18 లేదా 19 తేదీల్లో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవి.కృష్ణారావు కర్నూలుకు రానున్నారు. ఈ మేరకు ఏపీఎస్పీ పటాలం అధికారులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. స్వాతంత్య్ర వేడుకలకు బెటాలియన్‌లోని ట్రైనింగ్ సెంటర్ మైదానాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం కావడంతో వాటిని పరిశీలించేందుకు ఐవి.కృష్ణారావు కర్నూలుకు వచ్చి స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
స్వాతంత్య్ర వేడుకలను విజయవంతం చేద్దాం
Published Wed, Jul 16 2014 3:56 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement