ఆర్టికల్-3 సవరణకు కలసిరండి | let us amend article 3, Andhra pradesh parirakshana vedika asks political parties | Sakshi
Sakshi News home page

ఆర్టికల్-3 సవరణకు కలసిరండి

Published Tue, Nov 26 2013 12:26 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

ఆర్టికల్-3 సవరణకు కలసిరండి - Sakshi

ఆర్టికల్-3 సవరణకు కలసిరండి

సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని ఆర్టికల్-3 సవరణకు కలసిరావాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. విశాలాంధ్ర మహాసభ నాయకుడు చేగొండి రామజోగయ్య, ఏపీఎన్జీవో మాజీ కార్యదర్శి సత్యనారాయణ, డాక్టర్ ఎల్వీకే రెడ్డి, ఐటీ జేఏసీ నేతలు పోతుల శివ, పుత్తా శివశంకర్ తదితరులతో కలసి వేదిక నేతలు జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, వి.లక్ష్మణరెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేస్తూ ఆర్టికల్-3కి సవరణ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దిశగా దేశంలోని పలు రాజకీయ పార్టీలను కలసి మద్దతు కూడగట్టడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. పార్టీ విధానాలతో సంబంధం లేకుండా ఆర్టికల్-3 సవరణకు అన్ని పార్టీలు కలసి రావాలని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించాల్సింది పోయి కొన్ని పార్టీలు విమర్శలు చేయడాన్ని తప్పబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కృషి చేస్తున్న వారిని విమర్శిస్తే ప్రజల్లో పలచనకావడం తప్ప వచ్చే ప్రయోజనం లేదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి వీలుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న ఉద్యమ సంస్థలు, మేధావులు, విద్యార్థులను కలుపుకొని జస్టిస్ లక్ష్మణరెడ్డి నేతృత్వంలో ‘సమైక్య ఉద్యమ సమన్వయ సమితి’ పేరిట కమిటీ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో.. డిసెంబర్ రెండో వారంలో చలో ఢిల్లీ, శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో చలో అసెంబ్లీ కార్యక్రమాల ను ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సమైక్యతను కోరుతూ సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి త్వరలో అఫిడవిట్లు స్వీకరించనున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమానికి కోదండరాం నేతృత్వంలో అన్ని పార్టీలు, సంఘాలు కలసి పనిచేస్తున్న విధంగా ఏపీఎన్జీవోలు సమైక్య ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్జీవోలు విఫలమైన పక్షంలో ఆ బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement