నిధులు లే‘వంట’!
ఇది ప్రొద్దుటూరు మండలం డీసీఎస్‌ఆర్ కాలనీలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు నిర్మించిన వంట గది. ప్రభుత్వం తొలి విడతగా కేవలం రూ.75వేలు మంజూరు చేయడంతో నిర్మాణం ఆగిపోయింది. అధికారులు మళ్లీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని నిర్మాణ పనులు మొదలు పెట్టారు. అయితే ఇంత వరకు నిర్మాణం పూర్తికాలేదు. 2002లో జిల్లాలోని అనేక ప్రాథమిక పాఠశాలలకు వంటగదులు మంజూరు కాగా నిధుల కొరత కారణంగా ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి.
ప్రొద్దుటూరు: సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలల్లో కనీస వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సర్వశిక్షా అభియాన్ కింద రెండో విడత గత నెల 22న జిల్లాలోని 272 ఉన్నత పాఠశాలలకు వంట గదులు మంజూరయ్యాయి. విద్యార్థుల సంఖ్య 90 కంటే పైగా ఉన్న పాఠశాలలకు వీటిని మంజూరు చేశారు. మొత్తం 302 చదరపు అడుగులలో వంటగదితో పాటు స్టోర్ రూంను నిర్మించాల్సి ఉంది. ఈ నిర్మాణానికి సంబంధించి ఒక్కోదానికి రూ.1.50లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ నిధులు ఏమాత్రం సరిపడవు. రూ.2.16లక్షలు మంజూరు చేస్తేనే నిర్మించేందుకు సాధ్యమవుతుందని ఎస్‌ఎస్‌ఏ ఇంజనీరింగ్ అధికారులు స్వయంగా జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో నిర్మాణ పనులను తాత్కాలికంగా వాయిదా వేశారు. గతంలో ప్రాథమిక పాఠశాలలకు వంట గదులు మంజూరు చేసినప్పుడు కూడా ఇదే సమస్య ఏర్పడింది. జిల్లాలో 1100లకుపైగా ప్రాథమిక పాఠశాలలకు వంట గదులు మంజూరుకాగా ఇప్పటికీ పూర్తికాని నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ఇతర నిధుల నుంచి బడ్జెట్ కేటాయించి పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మళ్లీ ఉన్నత పాఠశాలలకు కూడా ఇదే సమస్య ఏర్పడటం గమనార్హం. ఉన్నతాధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా తరచూ ఇలా ఎందుకు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై డీఈఓ అంజయ్యను వివరణ కోరగా ఈ విషయాన్ని ఇంజనీరింగ్ అధికారులు తన దృష్టికి తెచ్చారన్నారు. సమస్యను జిల్లా కలెక్టర్‌కు తెలిపి నిర్మాణాలు ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో ప్రాథమిక పాఠశాలలకు సంబంధించిన వంట గదుల నిర్మాణంలో కూడా ఈ సమస్య ఏర్పడిందన్నారు. తర్వాత చాలా వరకు సమస్యను పరిష్కరించామని, ఇంకా 200లకుపైగా వంటగదుల నిర్మాణం పూర్తి కావలసి ఉందన్నారు.