‘ఆదర్శ’లో ఆరుబయటే వంటలు
ఆత్మకూర్ (ఎస్) :
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వంటగది లేకపోవడంతో మధ్యాహ్న భోజనాన్ని ఆరుబయటే వండుతున్నారు. ఎండాకాలంలో ఎండకు, వర్షాకాలంలో చిరుజల్లులు, గాలులతో ఏజెన్సీ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించినప్పటికీ వంటగదిని నిర్మించలేదు. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదవ తరగతికి చెందిన సుమారు 500 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 450 మంది విద్యార్థులకు దాకా భోజనాన్ని ఏజెన్సీ మహిళలు వండి వడ్డిస్తున్నారు. ఇంత మందికి వంట వండేందుకు గది లేకపోవడంతో ఏజెన్సీ మహిళలు పాఠశాల ఆవరణలోనే ఆరుబయట వంట చేస్తున్నారు. ప్రస్తుతం చిరుజల్లులతో కూడిన ముసురు కారణంగా వంట సామగ్రి తడిసిపోయి భోజనం సరిగా ఉడకడం లేదు. ఆరు బయట కావడంతో గాలులకు మంట తగలక బియ్యం బియ్యంగా ఉంటుందని, ఈ భోజనం తిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెన్సీ మహిళలు వంట వండేందుకు నానా తంటాలు పడుతున్నారు. వంట గది లేకపోవడంతో నానా అవస్థలు పడి 500 మందికి భోజనం వండే సమయంలో కొన్ని సందర్భాల్లో వంట సరిగా కావడం లేదని ఏజెన్సీ మహిళలు పేర్కొంటున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో మోడల్ స్కూల్‌ను నిర్మించిన ప్రభుత్వం ముందు చూపు లేకుండా వంట గదిని నిర్మించకపోవడంతో విద్యార్థులు, ఏజెన్సీ మహిళలు ఇబ్బంది పడుతున్నారని మండల ప్రజలు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వంటగది నిర్మించి ఆదర్శ పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందించాలని విద్యార్ధుల తల్లితండ్రులు కోరుతున్నారు.
ఆరుబయట వంటచేయలేకపోతున్నాం – దాసరి శశిరేఖ, ఏజెన్సీమహిళ
ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం దాదాపు రోజుకు 450 మంది వరకూ వండాలి. ఆరుబయట వంటచేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గాలి తగలడంతో మంట సక్రమంగా తగలక అన్నం సక్రమంగా ఉడకడం లేదు. కొన్నిసార్లు ఆలస్యమవుతుంది. కొద్దిపాటి వర్షం పడినా కట్టెలు మండక పోవడంతో పాటు పాఠశాలలో పొగ అలుముకుంటున్నది. వెంటనే వంటగది నిర్మించి వంటగ్యాస్ అందించాలి.