cooking room
-
‘ఆదర్శ’లో ఆరుబయటే వంటలు
ఆత్మకూర్ (ఎస్) : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వంటగది లేకపోవడంతో మధ్యాహ్న భోజనాన్ని ఆరుబయటే వండుతున్నారు. ఎండాకాలంలో ఎండకు, వర్షాకాలంలో చిరుజల్లులు, గాలులతో ఏజెన్సీ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించినప్పటికీ వంటగదిని నిర్మించలేదు. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదవ తరగతికి చెందిన సుమారు 500 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 450 మంది విద్యార్థులకు దాకా భోజనాన్ని ఏజెన్సీ మహిళలు వండి వడ్డిస్తున్నారు. ఇంత మందికి వంట వండేందుకు గది లేకపోవడంతో ఏజెన్సీ మహిళలు పాఠశాల ఆవరణలోనే ఆరుబయట వంట చేస్తున్నారు. ప్రస్తుతం చిరుజల్లులతో కూడిన ముసురు కారణంగా వంట సామగ్రి తడిసిపోయి భోజనం సరిగా ఉడకడం లేదు. ఆరు బయట కావడంతో గాలులకు మంట తగలక బియ్యం బియ్యంగా ఉంటుందని, ఈ భోజనం తిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెన్సీ మహిళలు వంట వండేందుకు నానా తంటాలు పడుతున్నారు. వంట గది లేకపోవడంతో నానా అవస్థలు పడి 500 మందికి భోజనం వండే సమయంలో కొన్ని సందర్భాల్లో వంట సరిగా కావడం లేదని ఏజెన్సీ మహిళలు పేర్కొంటున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో మోడల్ స్కూల్‌ను నిర్మించిన ప్రభుత్వం ముందు చూపు లేకుండా వంట గదిని నిర్మించకపోవడంతో విద్యార్థులు, ఏజెన్సీ మహిళలు ఇబ్బంది పడుతున్నారని మండల ప్రజలు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వంటగది నిర్మించి ఆదర్శ పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందించాలని విద్యార్ధుల తల్లితండ్రులు కోరుతున్నారు. ఆరుబయట వంటచేయలేకపోతున్నాం – దాసరి శశిరేఖ, ఏజెన్సీమహిళ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం దాదాపు రోజుకు 450 మంది వరకూ వండాలి. ఆరుబయట వంటచేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గాలి తగలడంతో మంట సక్రమంగా తగలక అన్నం సక్రమంగా ఉడకడం లేదు. కొన్నిసార్లు ఆలస్యమవుతుంది. కొద్దిపాటి వర్షం పడినా కట్టెలు మండక పోవడంతో పాటు పాఠశాలలో పొగ అలుముకుంటున్నది. వెంటనే వంటగది నిర్మించి వంటగ్యాస్ అందించాలి. -
వెజ్జీ బజ్జీ
బంగాళాఖాతంలో వాయుగుండం... అల్పపీడనం... హోరున గాలి... జోరున వాన... ఇంకేముంది... నాలుక ఒక్కసారిగా ఒళ్లు విదిల్చింది... వాసన... వాసన... అంటూ నాసికా రంధ్రాలు పెద్దవయ్యాయి... వంట గదిలో పిండి, కూరలు కంటికి ఇంపుగా కనిపించాయి... మరో కుంభకర్ణుడు, మరో ఘటోత్కచుడు ఆవహించారు... అంతే... ఈ రోజు బజ్జీలు పెట్టు అంది ఉదరం... ఆలస్యం దేనికి... వెజ్జీ బజ్జీలు చేసుకుని మనం కూడా నాలుకకు విందు చేద్దాం! బ్రెడ్ బజ్జీ కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 3 (త్రికోణాకారంలో కట్ చేయాలి); సెనగ పిండి - కప్పు; మైదా పిండి - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ఉప్పు - తగినంత; నల్ల ఉప్పు పొడి - చిటికెడు; కారం - టీ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట; పచ్చి మిర్చి - 4; నూనె - వేయించడానికి తగినంత; ఆమ్చూర్ పొడి - టీ స్పూను; ధనియాల పొడి - టీ స్పూను తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, మైదా పిండి వేసి బాగా కలపాలి కొత్తిమీర, పచ్చి మిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి గ్లాసుడు నీళ్లు పోసి, వడకట్టి, ఆ నీళ్లు పిండిలో పోయాలి ఉప్పు, వంట సోడా, కారం, నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, త్రికోణాకారంలో కట్ చేసిన బ్రెడ్ ముక్కలను బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి చిన్న పాత్రలో ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి, బజ్జీలు వేడిగా ఉండగానే పైన చల్లి వేడివేడిగా అందించాలి. టొమాటో బజ్జీ కావలసినవి: టొమాటోలు - 6 (బెంగళూరు టొమాటోలు, చిన్న సైజువి); పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; వంట సోడా - కొద్దిగా; నూనె - వేయించడానికి తగినంత; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - కప్పు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; కరివేపాకు - ఒక రెమ్మ; నిమ్మరసం - టీ స్పూను; ఉల్లి తరుగు - టేబుల్ స్పూను; పల్లీలు - అర కప్పు తయారీ: టొమాటోలను శుభ్రంగా కడగాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, టొమాలోలను పిండిలో ముంచి, నూనెలో వేసి దోరగా వేయించాలి కరివేపాకు, కొత్తిమీరలను సన్నగా తరగాలి ఒక పాత్రలో ఉల్లితరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, నిమ్మ రసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి బజ్జీలను మధ్యకు కొద్దిగా కట్ చేసి, ఉల్లితరుగు మిశ్రమం కొద్దిగా ఉంచి, ఆ పైన రెండు పల్లీలు ఉంచి, వేడివేడిగా అందించాలి. వంకాయ బజ్జీ కావలసినవి : వంకాయలు - పావు కేజీ; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ధనియాల పొడి - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత; స్టఫింగ్ కోసం... వాము - టీ స్పూను; చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను; సెనగ పిండి - టేబుల్ స్పూను తయారీ: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, గుత్తి వంకాయ మాదిరిగా నాలుగు పక్షాలుగా తరిగి పక్కన ఉంచాలి (కాయలను ఉప్పు వేసిన నీటిలో ఉంచాలి. లేదంటే నల్లబడతాయి) ఒక పాత్రలో వాము, చింతపండు గుజ్జు, సెనగ పిండి గుజ్జు వేసి బాగా కలిపి, వంకాయలలో స్టఫ్ చేయాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి ఉప్పు, కారం, వంట సోడా వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ కలుపుకోవాలి బాణలిలో నూనె పోసి కాగాక వంకాయలను జాగ్రత్తగా విడిపోకుండా పట్టుకుని పిండిలో ముంచి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు రెండువైపులా వేయించి తీసేయాలి చిన్న పాత్రలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి బజ్జీలు వేడిగా ఉండగానే కొద్దిగా ఈ పొడి మిశ్రమం బజ్జీల మీద చల్లాలి సాస్‌తో కాని, కొత్తిమీర చట్నీతో కాని వేడివేడిగా అందించాలి. బీరకాయ బజ్జీ కావలసినవి: బీరకాయలు - పావు కేజీ; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ధనియాల పొడి - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత తయారీ: ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి, పైన తొక్కు తీసి చక్రాలుగా తరిగి పక్కన ఉంచాలి ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి ఉప్పు, కారం, వంట సోడా వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ జారుగా కలుపుకోవాలి బాణలిలో నూనె పోసి కాగాక బీరకాయ చక్రాలను పిండిలో ముంచి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు రెండువైపులా వేయించి తీసేయాలి చిన్న పాత్రలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి బజ్జీలు వేడిగా ఉండగానే కొద్దిగా ఈ పొడి మిశ్రమం చల్లాలి సాస్‌తో కాని, కొత్తిమీర చట్నీతో కాని వేడివేడిగా అందించాలి. క్యాలీఫ్లవర్ బజ్జీ కావలసినవి: సెనగ పిండి - కప్పు బియ్యప్పిండి - టేబుల్ స్పూను, కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను, కారం - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి తగినంత, క్యాలీఫ్లవర్ - చిన్నది (క్యాలీఫ్లవర్ని పువ్వులు పువ్వులుగా విడదీసి, గోరు వెచ్చని నీళ్లలో కడిగి పక్కన ఉంచాలి) తయారీ: ముందుగా ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, కారం, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి జారుగా కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, క్యాలీ ఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి హాట్ అండ్ స్వీట్ సాస్‌తో సర్వ్ చేయాలి. ఉల్లి బజ్జీ కావలసినవి: ఉల్లిపాయలు - 3 (తొక్క తీసి సన్నగా చక్రాల్లా తరగాలి), సెనగ పిండి - కప్పు, మైదా పిండి - టీ స్పూను, వంట సోడా - కొద్దిగా, ఉప్పు - తగినంత, నల్ల ఉప్పు పొడి - చిటికెడు, కారం - టీ స్పూను, కొత్తిమీర - చిన్న కట్ట, పచ్చి మిర్చి - 4, నూనె - వేయించడానికి తగినంత, ఆమ్చూర్ పొడి - టీ స్పూను, ధనియాల పొడి - టీ స్పూను తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, మైదా పిండి వేసి బాగా కలపాలి కొత్తిమీర, పచ్చి మిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి గ్లాసుడు నీళ్లు పోసి, వడకట్టి, ఆ నీళ్లు పిండిలో పోయాలి ఉప్పు, వంట సోడా, కారం, నల్ల ఉప్పు వేసి జారుగా కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక, ఉల్లి చక్రాలు బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి చిన్న పాత్రలో ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి, బజ్జీలు వేడిగా ఉండగానే పైన చల్లి వేడివేడిగా అందించాలి. - సేకరణ: డా. ైవె జయంతి, సాక్షి, చెన్నై -
వంటింటికి వన్నె
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు వంట గదిలో వెండితో చేసిన పాత్రలు, గ్లాసులుండటం దర్పానికి సంకేతం. మరి నేడో.. వంట గదిలో విలువైన లోహపు సామగ్రిని పక్కకు తోస్తూ క్రిస్టల్ వేర్స్ రంగప్రవేశం చేశాయి. వీటిని బహుమతులుగానూ ఇవ్వటం స్టేటస్ సింబల్‌గా మారింది. దీంతో ప్రస్తుతం వంట గది మరింత వన్నెలద్దుకుంటోంది. ఫ్రాన్స్, ఇంగ్లండ్, జర్మనీ, చైనా, ఇటలీ, రష్యాలకు చెందిన పలు భిన్నమైన క్రిస్టల్ వేర్స్‌ని అమ్మకానికి సిద్ధం చేశారు వ్యాపారులు. చెకోస్లోవియా, రష్యా కంపెనీలైతే ఇంటిని అలంకరించుకునే క్రిస్టల్ వస్తువులను తయారుచేస్తున్నాయి. ఈ కంపెనీలు తయారుచేస్తున్న భారీ షాండ్లీయర్లు కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తున్నాయి కూడా. - నాణ్యమైన క్రిస్టల్ వస్తువులపై గీతలు పడవు. కింద పడినా పగలవు. వీటిని అధికమైన రాపిడికి గురి చేసినప్పుడు వెంట్రుక వాసి పరిమాణంతో నిప్పు రవ్వలను వెదజల్లుతుంది. ఇవన్నీ క్రిస్టల్ ఉత్పత్తుల నాణ్యతకు పరీక్షలు. నాణ్యమైన క్రిస్టల్ వస్తువుల్ని కళాకారులు హస్త నైపుణ్యంతో రూపొందిస్తారు. వీటి తయారీలో రసాయనాలు, యంత్రాలు వాడరు. - డిటర్జెంట్స్, ఆమ్లాలు, స్ప్రేలను క్రిస్టల్ వస్తువులపై ఉపయోగించరాదు. ఎందుకంటే రసాయనాలు క్రిస్టల్ వస్తువుల కాంతిని, పారదర్శకతను తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటితో మాత్రమే వీటిని శుభ్రం చేయాలి. నిమ్మరసం తగలరాదు. కాలక్రమంలో క్రిస్టల్ వస్తువులు లేత గులాబీ రంగులోకి మారడాన్ని రోజ్ చిప్పింగ్ అంటారు. అయితే దీన్ని సులభంగా నివారించవచ్చు. క్రిస్టల్ వస్తువులను శుభ్రం చేసిన తర్వాత వాటిపై తడి లేకుండా మెత్తని గుడ్డతో తుడిస్తే మంచిది. -
వాళ్లకు వజ్రాల కడియాలు తొడగాలి!
ఒకప్పుడు ఆడవాళ్లు వంటింటికే పరిమితమయ్యారు. ఇప్పుడు వంట గది వైపు తొంగి చూడనివాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాప్సీ ఆ రకం కాదు కానీ, సునాయాసంగా వంట చేసే సత్తా అయితే ఆమెకు లేదు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయం గురించి తాప్సీ ప్రస్తావిస్తూ - ‘‘తినడం సులువు కానీ, వంట చేయడం మాత్రం చాలా కష్టమండీ బాబూ. పోపు పెట్టడంలో తేడా వస్తే, రుచిలో తేడా వచ్చేస్తుంది. చిటికెడు ఉప్పు ఎక్కువైందనుకోండి... చేసిన వంట అంతా వృథాయే. అసలు మసాలా దినుసులు, ఉప్పు, కారం.. అన్నీ సమపాళ్లలో ఎలా వేస్తారో? నిజంగా అద్భుతంగా వంట చేసేవాళ్ల చేతులకు వజ్రాలు పొదిగిన కడియాలు తొడగాలి’’ అన్నారు. మరి, మీరెప్పుడైనా వంట చేయడానికి ప్రయత్నించారా? అనే ప్రశ్న తాప్సీ ముందుంచితే - ‘‘నాకప్పుడు పన్నెండేళ్లు. ఒకరోజు టీ తయారు చేసుకోవాలనిపించింది. ‘రంగు, రుచి, వాసన’ అనే టీ పొడియాడ్ ఉంది కదా.. దాన్ని గుర్తు చేసుకుంటూ టీ పెట్టేశాను. కానీ, రంగూ, రుచీ ఏదీ లేదు. ఆ తర్వాత వంటగది జోలికి వెళ్లలేదు. సినిమాల్లోకొచ్చాక ఒంటరిగా ఉంటున్నాను కదా.. అందుకని నూడుల్స్ చేయడం, ఆమ్లెట్ వేయడం నేర్చుకున్నాను. మొన్నీ మధ్య మా అమ్మ పర్యవేక్షణలో రాజ్మా కర్రీ వండాను. అమ్మ వల్లనో ఏమో బాగా కుదిరింది’’ అని పేర్కొన్నారు. -
నిధులు లే‘వంట’!
ఇది ప్రొద్దుటూరు మండలం డీసీఎస్‌ఆర్ కాలనీలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు నిర్మించిన వంట గది. ప్రభుత్వం తొలి విడతగా కేవలం రూ.75వేలు మంజూరు చేయడంతో నిర్మాణం ఆగిపోయింది. అధికారులు మళ్లీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని నిర్మాణ పనులు మొదలు పెట్టారు. అయితే ఇంత వరకు నిర్మాణం పూర్తికాలేదు. 2002లో జిల్లాలోని అనేక ప్రాథమిక పాఠశాలలకు వంటగదులు మంజూరు కాగా నిధుల కొరత కారణంగా ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రొద్దుటూరు: సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలల్లో కనీస వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సర్వశిక్షా అభియాన్ కింద రెండో విడత గత నెల 22న జిల్లాలోని 272 ఉన్నత పాఠశాలలకు వంట గదులు మంజూరయ్యాయి. విద్యార్థుల సంఖ్య 90 కంటే పైగా ఉన్న పాఠశాలలకు వీటిని మంజూరు చేశారు. మొత్తం 302 చదరపు అడుగులలో వంటగదితో పాటు స్టోర్ రూంను నిర్మించాల్సి ఉంది. ఈ నిర్మాణానికి సంబంధించి ఒక్కోదానికి రూ.1.50లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ నిధులు ఏమాత్రం సరిపడవు. రూ.2.16లక్షలు మంజూరు చేస్తేనే నిర్మించేందుకు సాధ్యమవుతుందని ఎస్ఎస్ఏ ఇంజనీరింగ్ అధికారులు స్వయంగా జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో నిర్మాణ పనులను తాత్కాలికంగా వాయిదా వేశారు. గతంలో ప్రాథమిక పాఠశాలలకు వంట గదులు మంజూరు చేసినప్పుడు కూడా ఇదే సమస్య ఏర్పడింది. జిల్లాలో 1100లకుపైగా ప్రాథమిక పాఠశాలలకు వంట గదులు మంజూరుకాగా ఇప్పటికీ పూర్తికాని నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ఇతర నిధుల నుంచి బడ్జెట్ కేటాయించి పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మళ్లీ ఉన్నత పాఠశాలలకు కూడా ఇదే సమస్య ఏర్పడటం గమనార్హం. ఉన్నతాధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా తరచూ ఇలా ఎందుకు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై డీఈఓ అంజయ్యను వివరణ కోరగా ఈ విషయాన్ని ఇంజనీరింగ్ అధికారులు తన దృష్టికి తెచ్చారన్నారు. సమస్యను జిల్లా కలెక్టర్‌కు తెలిపి నిర్మాణాలు ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో ప్రాథమిక పాఠశాలలకు సంబంధించిన వంట గదుల నిర్మాణంలో కూడా ఈ సమస్య ఏర్పడిందన్నారు. తర్వాత చాలా వరకు సమస్యను పరిష్కరించామని, ఇంకా 200లకుపైగా వంటగదుల నిర్మాణం పూర్తి కావలసి ఉందన్నారు.