వాళ్లకు వజ్రాల కడియాలు తొడగాలి!
ఒకప్పుడు ఆడవాళ్లు వంటింటికే పరిమితమయ్యారు. ఇప్పుడు వంట గది వైపు తొంగి చూడనివాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాప్సీ ఆ రకం కాదు కానీ, సునాయాసంగా వంట చేసే సత్తా అయితే ఆమెకు లేదు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయం గురించి తాప్సీ ప్రస్తావిస్తూ - ‘‘తినడం సులువు కానీ, వంట చేయడం మాత్రం చాలా కష్టమండీ బాబూ. పోపు పెట్టడంలో తేడా వస్తే, రుచిలో తేడా వచ్చేస్తుంది. చిటికెడు ఉప్పు ఎక్కువైందనుకోండి... చేసిన వంట అంతా వృథాయే.
అసలు మసాలా దినుసులు, ఉప్పు, కారం.. అన్నీ సమపాళ్లలో ఎలా వేస్తారో? నిజంగా అద్భుతంగా వంట చేసేవాళ్ల చేతులకు వజ్రాలు పొదిగిన కడియాలు తొడగాలి’’ అన్నారు. మరి, మీరెప్పుడైనా వంట చేయడానికి ప్రయత్నించారా? అనే ప్రశ్న తాప్సీ ముందుంచితే - ‘‘నాకప్పుడు పన్నెండేళ్లు. ఒకరోజు టీ తయారు చేసుకోవాలనిపించింది. ‘రంగు, రుచి, వాసన’ అనే టీ పొడియాడ్ ఉంది కదా.. దాన్ని గుర్తు చేసుకుంటూ టీ పెట్టేశాను. కానీ, రంగూ, రుచీ ఏదీ లేదు. ఆ తర్వాత వంటగది జోలికి వెళ్లలేదు. సినిమాల్లోకొచ్చాక ఒంటరిగా ఉంటున్నాను కదా.. అందుకని నూడుల్స్ చేయడం, ఆమ్లెట్ వేయడం నేర్చుకున్నాను. మొన్నీ మధ్య మా అమ్మ పర్యవేక్షణలో రాజ్మా కర్రీ వండాను. అమ్మ వల్లనో ఏమో బాగా కుదిరింది’’ అని పేర్కొన్నారు.