
సౌందర్య రంగంలో వజ్రాలకు ఆదరణ, విలువ, గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విలాసవంతమైన జీవనానికి వజ్రాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం వంటివి ఎన్ని ఉన్నా వజ్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే చాలామందికి డైమండ్ రింగ్ కొనుగోలు చేయాలనే ఆశ ఉంటుంది.
ఈ నేపథ్యంలో మధ్య తరగతి కుటుంబాల్లో కూడా వజ్రాలపై ఆసక్తి పెరిగింది. వీటన్నింటి దృష్ట్యా ల్యాబ్‌లో తయారు చేస్తున్న కృత్రిమ వజ్రాలు (ల్యాబ్‌గ్రోన్ డైమండ్స్)కు డిమాండ్ పెరిగింది. సహజమైన వజ్రాలు.. ప్రత్యేకంగా ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాలు చూసేందుకు ఒకేలా ఉండటం వీటి ప్రత్యేకత. ధర కూడా తక్కువ ఉండటంతో వీటికి విపరీతమైన ఆదరణ పెరిగింది.
ప్రకృతి ప్రసాదంగా లభించే వజ్రాలు చాలా అరుదైనవి, తక్కువగా దొరుకుతాయి. ఈ వజ్రాలు భూమి పొరల్లోని అంతర్భాగంలో తయారు కావడానికి సుమారు 1 నుంచి 3 బిలియన్ సంవత్సరాల సమయం పడుతుందని పరిశోధకులు చెబుతారు. ఇంతటి అరుదైనవి కాబట్టే వజ్రాలకు ధరలు ఎక్కువగా ఉంటాయి.
అయితే ప్రస్తుత కాలంలో అచ్చం వజ్రాలను పోలినవి.. ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు అందుబాటులోకి రావడంతో వజ్రాల ప్రియులు అధికంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు.
ఈ వజ్రాలు కేవలం వారాలు, నెలల వ్యవధితో తయారు చేస్తున్నారు. సాధారణంగా ఈ రెండు రకాల వజ్రాలు శాస్త్రీయ రసాయణాల పరంగా ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ నాణ్యత, పదార్థ విశిష్టత దృష్ట్యా చాలా వ్యత్యాసం ఉంటుంది.
వజ్రాల నిపుణులు, ఆభరణాల తయారీదారులు మాత్రమే వీటి మధ్య తేడాను గుర్తించగలరు. వీటి కటింగ్, పాలిషింగ్, సెట్టింగ్‌లో చాలా వైవిధ్యంతో పాటు శాస్త్రీయత పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సహజమైన వజ్రాలను కొనలేని వారు ఈ కృత్రిమ వజ్రాలపై మక్కువ చూపిస్తున్నారు.
సహజ వజ్రాల్లో పరిమాణం పెరుగుతున్న కొద్దీ.. దాని క్యారెట్లను బట్టి ధర అంతకంతకూ పెరిగిపోతుంది. కానీ ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు తక్కువ ధరకే అదే పరిమాణంలో లభిస్తుండటం విశేషం. సహజ వజ్రాల కంటే ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు సుమారు 30 నుంచి 85 శాతం తక్కువ ధరల్లో లభిస్తుండటం విశేషం.
అమాంతం పెరిగిన వ్యాపారం..
ఆర్థిక పరమైన అంశాలే కాకుండా సామాజికంగా సౌందర్య రంగంలోని వజ్రాల ప్రాధాన్యత వల్ల ఫ్యాషన్ రంగంలో కూడా ఈ డైమండ్స్‌కు మంచి ప్రచారం లభించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వజ్రాల వ్యాపారం అమాంతంగా పెరిగిపోయింది.
ఈ వజ్రాల ప్రస్థానం 2000 సంవత్సరం నుంచి పుంజుకోగా.. ఐదేళ్ల నుంచి మరింత ఎక్కువగా పెరిగిందని బంజారాహిల్స్‌లోని ఓ వ్యాపారి తెలిపారు. మొదట్లో ఉత్తరాది ప్రాంతాలకు చెందినవారే వజ్రాలు అధికంగా కొనుగోలు చేసేవారు. కొన్ని ఏళ్లుగా హైదరాబాద్, బెంగళూరులో వీటి వ్యాపారం పుంజుకుందని సోమాజిగూడలోని మరో వజ్రాల వ్యాపారి పేర్కొన్నారు.
ఇలాంటి కారణాలతో ప్రస్తుతం నగరంలో ల్యాబ్ గ్రోన్ వజ్రాలకు ప్రత్యేక స్టోర్లు ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ డైమండ్ బ్రాండ్లు సైతం వారి స్టోర్లలో ల్యాబ్ గ్రోన్ వజ్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సహజ వజ్రాలు, తయారు చేసిన వజ్రాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి నిపుణుల పరిశోధక పత్రాలు, డైమండ్ వెరిఫికేషన్ ఇన్‌స్ట్రుమెంట్ విధానాలను వినియోగిస్తున్నారు.
వజ్రాన్ని కత్తిరించి పాలిష్ చేసిన తర్వాత ప్రయోగశాలలో సర్టిఫికేట్‌కు అనుగుణంగా లేజర్‌తో టెక్నాలజీతో ధృవీకరిస్తారు.
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్‌కే క్రేజ్
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అమ్మకాలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా మా స్టోర్‌లో గతేడాదిలో మరింత ఎక్కువగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లో పెద్ద సైజుల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. పెద్ద సైజులో ఉండే సహజమైన వజ్రాలు కొనుగోలు చేయలేని వారు దాదాపు 50 నుంచి 90 శాతం తక్కువ ధరలకు లభించే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ రెండు వజ్రాల మధ్య తేడాలను ప్రయోగశాలలోని ప్రత్యేక పరికరాలు ఉంటే తప్ప ఎవరూ గుర్తించలేరు. స్థానికంగా నిశ్చితార్థాలకు ఈ డైమండ్స్ ఎక్కువగా కొంటున్నారు. పార్టీలు, ఫ్యాషన్ వేర్, విభిన్న డిజైన్ల కోసం కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
– స్వాతి షాగర్లమూడి, రీయా లైఫ్‌స్టైల్–మణికొండ
(చదవండి: ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..వంద మందికి పైగా మనవరాళ్లు..)
Comments
Please login to add a commentAdd a comment