వెజ్జీ బజ్జీ | veg bajji | Sakshi
Sakshi News home page

వెజ్జీ బజ్జీ

Published Mon, Sep 21 2015 11:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

వెజ్జీ బజ్జీ

వెజ్జీ బజ్జీ

బంగాళాఖాతంలో వాయుగుండం... అల్పపీడనం...
హోరున గాలి... జోరున వాన...
ఇంకేముంది... నాలుక ఒక్కసారిగా ఒళ్లు విదిల్చింది...
వాసన... వాసన... అంటూ నాసికా రంధ్రాలు పెద్దవయ్యాయి...
వంట గదిలో పిండి, కూరలు కంటికి ఇంపుగా కనిపించాయి...
మరో కుంభకర్ణుడు, మరో ఘటోత్కచుడు ఆవహించారు...
అంతే... ఈ రోజు బజ్జీలు పెట్టు అంది ఉదరం...
ఆలస్యం దేనికి... వెజ్జీ బజ్జీలు చేసుకుని
మనం కూడా నాలుకకు విందు చేద్దాం!

 
బ్రెడ్ బజ్జీ
కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 3 (త్రికోణాకారంలో కట్ చేయాలి); సెనగ పిండి - కప్పు; మైదా పిండి - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ఉప్పు - తగినంత; నల్ల ఉప్పు పొడి - చిటికెడు; కారం - టీ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట; పచ్చి మిర్చి - 4; నూనె - వేయించడానికి తగినంత; ఆమ్‌చూర్ పొడి - టీ స్పూను; ధనియాల పొడి - టీ స్పూను
 
తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, మైదా పిండి వేసి బాగా కలపాలి  కొత్తిమీర, పచ్చి మిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి గ్లాసుడు నీళ్లు పోసి, వడకట్టి, ఆ నీళ్లు పిండిలో పోయాలి  ఉప్పు, వంట సోడా, కారం, నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి  బాణలిలో నూనె కాగాక, త్రికోణాకారంలో కట్ చేసిన బ్రెడ్ ముక్కలను బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి  చిన్న పాత్రలో ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి, బజ్జీలు వేడిగా ఉండగానే పైన చల్లి వేడివేడిగా అందించాలి.
 
టొమాటో బజ్జీ
కావలసినవి:
టొమాటోలు - 6 (బెంగళూరు టొమాటోలు, చిన్న సైజువి); పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; వంట సోడా - కొద్దిగా; నూనె - వేయించడానికి తగినంత; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - కప్పు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; కరివేపాకు - ఒక రెమ్మ; నిమ్మరసం - టీ స్పూను; ఉల్లి తరుగు - టేబుల్ స్పూను; పల్లీలు - అర కప్పు
 
తయారీ: టొమాటోలను శుభ్రంగా కడగాలి  ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి  బాణలిలో నూనె కాగాక, టొమాలోలను పిండిలో ముంచి, నూనెలో వేసి దోరగా వేయించాలి  కరివేపాకు, కొత్తిమీరలను సన్నగా తరగాలి  ఒక పాత్రలో ఉల్లితరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, నిమ్మ రసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి  బజ్జీలను మధ్యకు కొద్దిగా కట్ చేసి, ఉల్లితరుగు మిశ్రమం కొద్దిగా ఉంచి, ఆ పైన రెండు పల్లీలు ఉంచి, వేడివేడిగా అందించాలి.
 
వంకాయ బజ్జీ
కావలసినవి
: వంకాయలు - పావు కేజీ; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ధనియాల పొడి - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత; స్టఫింగ్ కోసం... వాము - టీ స్పూను; చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను; సెనగ పిండి - టేబుల్ స్పూను
 
తయారీ: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, గుత్తి వంకాయ మాదిరిగా నాలుగు పక్షాలుగా తరిగి పక్కన ఉంచాలి (కాయలను ఉప్పు వేసిన నీటిలో ఉంచాలి. లేదంటే నల్లబడతాయి)  ఒక పాత్రలో వాము, చింతపండు గుజ్జు, సెనగ పిండి గుజ్జు వేసి బాగా కలిపి, వంకాయలలో స్టఫ్ చేయాలి  ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి  ఉప్పు, కారం, వంట సోడా వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ కలుపుకోవాలి  బాణలిలో నూనె పోసి కాగాక వంకాయలను జాగ్రత్తగా విడిపోకుండా పట్టుకుని పిండిలో ముంచి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు రెండువైపులా వేయించి తీసేయాలి  చిన్న పాత్రలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి  బజ్జీలు వేడిగా ఉండగానే కొద్దిగా ఈ పొడి మిశ్రమం బజ్జీల మీద చల్లాలి  సాస్‌తో కాని, కొత్తిమీర చట్నీతో కాని వేడివేడిగా అందించాలి.
 
బీరకాయ బజ్జీ
కావలసినవి:
బీరకాయలు - పావు కేజీ; సెనగ పిండి - కప్పు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; కార్న్ ఫ్లోర్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; వంట సోడా - కొద్దిగా; ధనియాల పొడి - టీ స్పూను; జీలకర్ర పొడి - టీ స్పూను; చాట్ మసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత
 
తయారీ: ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి, పైన తొక్కు తీసి చక్రాలుగా తరిగి పక్కన ఉంచాలి  ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి  ఉప్పు, కారం, వంట సోడా వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ జారుగా కలుపుకోవాలి  బాణలిలో నూనె పోసి కాగాక బీరకాయ చక్రాలను పిండిలో ముంచి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు రెండువైపులా వేయించి తీసేయాలి  చిన్న పాత్రలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి  బజ్జీలు వేడిగా ఉండగానే కొద్దిగా ఈ పొడి మిశ్రమం చల్లాలి  సాస్‌తో కాని, కొత్తిమీర చట్నీతో కాని వేడివేడిగా అందించాలి.
 
క్యాలీఫ్లవర్ బజ్జీ
కావలసినవి: సెనగ పిండి - కప్పు బియ్యప్పిండి - టేబుల్ స్పూను, కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను, కారం - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి తగినంత, క్యాలీఫ్లవర్ - చిన్నది (క్యాలీఫ్లవర్‌ని పువ్వులు పువ్వులుగా విడదీసి, గోరు వెచ్చని నీళ్లలో కడిగి పక్కన ఉంచాలి)
 
తయారీ: ముందుగా ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, కారం, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి జారుగా కలుపుకోవాలి  బాణలిలో నూనె కాగాక, క్యాలీ ఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి  హాట్ అండ్ స్వీట్ సాస్‌తో సర్వ్ చేయాలి.
 
ఉల్లి బజ్జీ
కావలసినవి: ఉల్లిపాయలు - 3 (తొక్క తీసి సన్నగా చక్రాల్లా తరగాలి), సెనగ పిండి - కప్పు, మైదా పిండి - టీ స్పూను, వంట సోడా - కొద్దిగా, ఉప్పు - తగినంత, నల్ల ఉప్పు పొడి - చిటికెడు, కారం - టీ స్పూను, కొత్తిమీర - చిన్న కట్ట, పచ్చి మిర్చి - 4, నూనె - వేయించడానికి తగినంత, ఆమ్‌చూర్ పొడి - టీ స్పూను, ధనియాల పొడి - టీ స్పూను
 
తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, మైదా పిండి వేసి బాగా కలపాలి  కొత్తిమీర, పచ్చి మిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి గ్లాసుడు నీళ్లు పోసి, వడకట్టి, ఆ నీళ్లు పిండిలో పోయాలి  ఉప్పు, వంట సోడా, కారం, నల్ల ఉప్పు వేసి జారుగా కలుపుకోవాలి  బాణలిలో నూనె కాగాక, ఉల్లి చక్రాలు బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి  చిన్న పాత్రలో ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి, బజ్జీలు వేడిగా ఉండగానే పైన చల్లి వేడివేడిగా అందించాలి.
 
- సేకరణ: డా. ైవె జయంతి, సాక్షి, చెన్నై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement