
విజయవాడలో జరిగిన లైసెన్స్ మేళాకు హాజరైన వాహనదారులు (ఫైల్)
జిల్లాలో డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేస్తున్న వాహనచోదకుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. లైసెన్సులపై ఇటీవల కాలంలో అవగాహన పెరగడంతో రవాణా శాఖ రెండో విడత నిర్వహించిన ఎల్‌ఎల్‌ఆర్ మేళాకు విశేష స్పందన కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించిన మేళా కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎల్‌ఎల్‌ఆర్‌ల మంజూరులో వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. నెల్లూరు, వైజాగ్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
సాక్షి, అమరావతిబ్యూరో: వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో రవాణాశాఖ ఇటీవల విస్తృతంగా మేళాలు నిర్వహిస్తోంది. గ్రామీణుల్లో అనేక మంది వాహనదారుల వద్ద సరైన పత్రాలు ఉండటం లేదు. ఈ పరిస్థితులను మార్చి అర్హులకు లైసెన్సులు ఇచ్చేందుకు రవాణా శాఖ ‘మీ ముంగిట్లో రవాణాశాఖ’ నినాదంతో గత జూన్ నెలలో ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించింది. దీనికి మంచి స్పందన కనిపించింది. డ్రైవింగ్ లైసెన్సుల పరీక్షల కోసం హాజరయ్యే వారి సంఖ్య పెరిగింది. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి 23 తేదీ వరకు రవాణా శాఖ నిర్వహించిన రెండో విడత మేళాకు అంతేస్థాయిలో స్పందన కనిపించింది. ఈ కార్యక్రమం కింద కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పల్లెలకు ఆర్టీఏ అధికారులు వెళ్లి వాహన చోదకులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. రహదారి భద్రతపై నిబంధనలు వివరించారు. తర్వాత పరీక్షలకు సన్నద్ధం చేశారు.
ప్రథమ స్థానంలో కృష్ణా జిల్లా..
కృష్ణా జిల్లా రవాణా అధికారులు రోజుకు 15 గ్రామాల చొప్పున మొత్తం 101 పల్లెల్లో నిర్వహించారు. మొత్తం 12,063 మంది ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షలకు హాజరవ్వగా.. అందులో 11,637 మంది ఉత్తీర్ణులయ్యారు. 332 మంది ఉత్తీర్ణత సాధించకపోగా 94 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాలేదు. వీరికి పత్రాలు అందజేశారు. గుంటూరు జిల్లాలో 84 గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో 5,992 మంది అక్కడికక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రవాణా శాఖ అధికారులు అత్యధికంగా 11,637 మందికి ఎల్‌ఎల్‌ఆర్ పత్రాలు మంజూరు చేయగా.. తర్వాతి స్థానాల్లో నెల్లూరు (10,094), విశాఖపట్నం(8,626) నిలిచాయి. గత జూన్‌లో నిర్వహించిన తొలి విడత ఎల్‌ఎల్‌ఆర్ మేళా కార్యక్రమంలోనూ జిల్లా రవాణా శాఖ అధికారులు 9,534 మందికి లైసెన్సులు మంజూరు చేసి మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. లైసెన్సుల జారీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్ చేసింది. ఎల్‌ఎల్‌ఆర్ మేళాలు విజయవంతం కావడంతో ఇదే తరహాలో భవిష్యత్తులో పల్లెల్లోనే డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment