విజయవాడ, న్యూస్‌లైన్ : బతుకు నేర్పిన పాఠాలను మూట కట్టుకుని రచయితగా ఎదిగిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ (86) శుక్రవారం హైదరాబాదులో కన్నుమూశారు. తనకు ఎంతోమంది గురువులున్నా, దరిద్రం-ఆకలి-అవమానాలే ప్రధానమైన గురువులని చెప్పుకొనేవారాయన. జిల్లాలోని కంచికచర్ల మండలం మోగలూరులో 1927 జూలై 5న తన అమ్మమ్మగారి ఇంటి వద్ద ఆయన జన్మించారు. 8వ తరగతితోనే చదువుకు స్వస్తి పలికారు.
తరగతి గదిలో ఆయనకు జరిగిన అవమానమే అందుకు కారణం. ఆయన తన జీవితంలో బతుకు నేర్పిన పాఠాలను, ఒక్కొక్కటిగా విప్పుతూ జీవనయానాన్ని సాగించారు. 19 నవలలు, 10 నాటకాలు రాసిన రావూరి జమీన్ రైతు పత్రికలో జర్నలిస్టుగా, ఆకాశవాణి కేంద్రంలోను పనిచేశారు. జర్నలిస్ట్‌గా, రచయితగా, ఆకాశవాణిలో పనిచేసినా సామాన్యుల కోసమే ఆయన రచనలు చేశారు. సామాన్యులకు కూడా అర్థమైన భాషలో రాసిన రావూరికి ఆలస్యంగానైనా జ్ఞానపీఠ్ అవార్డ్ రావడం సాహిత్యప్రియులను సంతోషపరిచింది. సాహిత్యపరంగా ఆయనకు జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలైన ముగ్గురిలో విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డి కవులు కాగా, రావూరి మౌలికంగా వచనా రచయిత కావటం విశేషం.
రావూరి మృతి తీరని లోటు
కంచికచర్ల రూరల్ : ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ మృతి తీరని లోటని మోగులూరు గ్రామానికి చెందిన రావూరి మేనల్లుడు మోగులూరి ఆదినారాయణ, గ్రామస్తులు బండి మల్లిఖార్జునరావు, బండి కోటేశ్వరరావు, బండి జానకిరామయ్య, షేక్ హుస్సేన్‌లు పేర్కొన్నారు. మోగులూరి చినశేషయ్య కుమార్తెకు పుట్టిన భరద్వాజ పదేళ్ల పాటు ఇదే గ్రామంలో ఉన్నారని, అనంతరం గుంటూరు జిల్లా తాటికొండలో తన తండ్రి స్వస్థలంలో స్థిరనివాసం ఉన్నారని వివరించారు.
బతుకు పాఠాల మూట రావూరి
Published Sat, Oct 19 2013 12:53 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement