Ravuri Bharadwaja
-
Ravuri Bharadwaja: సమాజాన్ని చదివిన రచయిత
రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలన చిత్ర పరిశ్రమను వస్తువుగా చేసు కొని వెలువడిన పాకుడురాళ్లు నవల. 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవ లలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మ కథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథా నికలు రచించారు. జీవన సమరం మరో ప్రముఖ రచన. ఒక బీద కుటుంబంలో జన్మిం చిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయి వరకే చదువుకు న్నారు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన ప్పుడు వ్యవ సాయ కూలీల కఠిన మైన జీవన పరిస్థితులను గమనించే వాడు. అప్పటి పల్లె ప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచ నలు, కోపాలు, తాపాలను తర్వాతి కాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించ డానికి ఉపయోగించు కున్నాడు. నేల విడిచి సాము చేయ కుండా, వాస్తవిక జీవితాల ఆధా రంగా రచనలు చేయటం ద్వారా పాఠకులకు స్ఫూర్తిని కలిగించే రచ నలు ఉత్తమమైనవని ఆయన భావించారు నిజాన్ని నిజంగా నిజాయితీగా చెబుతున్నప్పుడు ఏ రచనకైనా పేరు వస్తుందని నమ్మి ఇతరులకు చెప్పారు. నేటి ధన స్వామ్య వ్యవస్థ యొక్క క్షీణ సాంస్కృతిక విలువల ప్రతిబింబౖ మెన సినీ వ్యవస్థలోని బీభత్సాన్ని పాకుడు రాళ్ళు నవలలో బట్ట బయలు చేశారు. తద్వారా మొత్తంగా నేటి సామాజిక వ్యవ స్థపై ఆయనకు గల ఏవగింపును వ్యక్తీకరించారు. వీరి సాహిత్య జీవితం నుండి నేటి తరం రచ యితలు నేర్చు కోవల సినవి చాలా ఉన్నాయి. పట్టుదలతో, స్వయం కృషితో, విస్తృత అధ్యయ నంతో బడి చదువుల జ్ఞానం కంటే చాలా ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించ వచ్చు అని రావూరి రుజువు పరి చారు. 1927 జూలై 5న జన్మించిన వీరు 2013 అక్టోబర్ 18న గతిం చారు. భారతీయ జ్ఞాన పీఠం తన 48వ పురస్కారాన్ని రావూరి భర ద్వాజకు ఇవ్వటం ఆనంద దాయకం. – డా. జొన్నకూటి ప్రమోద్ కుమార్ పైడిమెట్ట, 94908 33108 (నేడు రావూరి భరద్వాజ జయంతి) -
వృద్ధుడి యవ్వనం
సూరయ్య: అంతే. ఈ నిర్ణయానికి తిరుగులేదు. నా బాధలన్నీ యీ పూటతో ఆఖరయిపోతాయి. తండ్రిలేని పిల్లలని, యే దయామయుడైనా ఆదరించవచ్చు. ఇప్పుడందరూ నిద్రపోతున్నారు. ఈ చిటికెడు విషం నోటిలో వేసికొన్నానంటే... అంతా సమాప్తమవుతుంది. తండ్రీ, దేవదేవా! నన్నీ సంసార బాధల నుండి తప్పించు స్వామీ! ధ్వని: (వికటమైన నవ్వు) సూర: యెవరది? ఎవరక్కడ? యెవ్వరూ పలకరేం? (మెల్లగా) అందరూ నిద్రపోయారనుకొన్నాను. ధ్వని: నిజంగానే అందరూ నిద్ర పోతున్నారు. సూర: నిజంగానే నిద్ర పోతుంటే, ఈ మేల్కొనివున్న నువ్వెవరు? ‘అందరూ’ అన్నప్పుడు, ఆ అందరిలో నువ్వూ ఒకడివి కావా? ధ్వని: కాను. సూర: అయినా మీరు వెళ్లిపొండి. అవతల నాకు చాలా పనివుంది. ధ్వని: చావబోతుగూడా అబద్ధమాడతారేం? అవతల మీకు నిజంగా పని వున్నదా? సూర: ఏమిటీ? ఎవరు చెప్పారు నీకీ విషయం? చావవలసిన అవసరం నాకేమీ లేదు. నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ధ్వని: మిమ్ములను గురించి విన్నానుగాని, ఎప్పుడు చూడలేదు; కాని నన్ను మీరు బాగా యెరుగుదురు. సూర: నేనా? మిమ్మల్నా? భలేవారండీ. మిమ్మల్ని చూస్తుంటే నాకు, నా యౌవనపు రోజులు జ్ఞాపక మొస్తున్నాయి. ఆ కాలంలో నేను గూడా– అచ్చం మీలాగానే మాట్లాడేవాణ్ణి. ధ్వని: అట్లాగా? సూర: మెల్లిగా అంటారేమిటి? మీకు మల్లేనే ఒక మాటను అనేక సార్లు... ధ్వని: అయితే, నన్ను మీరు గుర్తుపట్టేశారు. ఐనా మీ దగ్గర దాపరికమేమిటి? మీ అనుమానం నిజమే. నేను మీ యౌవనాన్నే. అప్పట్లో నన్ను... సూర: సూర్యం అని పిలిచేవాళ్లు నిన్ను. అవునా? సూర్యం: అవును. అందరూ ‘సూర్యం’ ‘సూర్యం’ అంటుంటే ఆ పేరుమీద నాకు అసహ్యమేసేది. కానీ, కమల– తన తీయని గొంతుతో ‘సూర్యం’ అని పిలిచిందాకా, ఆ పేరులోవున్న అందం స్ఫురించనేలేదు. సూర: ఛస్! ఆ పేరు నా దగ్గర యెత్తకు. దాని ఊసు అంటే, నాకు అసహ్యమేస్తుంది. సూర్యం: నీకూ నాకూ మధ్య యెంత వ్యత్యాసమున్నది. కాలం ఎంత విరుద్ధ మనస్తత్వాలు గల వ్యక్తులనుగా మనలను మార్చివేసింది. కమల! కమల!! నా జీవిత నందనోద్యానం సుగంధ భరితం చేసి, నన్ను, అనూహ్యానంద డోలికలలో ఉయ్యాల లూచింది. సూర: అదంతా భ్రమ. అందమైన కల. నిద్ర మేలుకొన్నాను. కల కరిగిపోయింది. కఠినమైన జీవతం నన్నెదుర్కొన్నది. సూర్యం! అప్పుడే గనుక, నువ్వా కమలను ప్రేమించకుండా ఉన్నట్లయితే, నా బ్రతుకింత బ్రద్దలయ్యేది కాదు. నేనీవిధంగా ఆత్మహత్యకు సిద్ధపడేవాణ్ణి కాదు. సూర్యం: ఆ విషయం కనుక్కొందామనే వచ్చాను. నేననుకొనేవాణ్ణి గదా ఈ ఆత్మహత్యలు ప్రపంచంలో యెందుకు జరుగుతున్నాయి? జీవితం పట్ల, దాని తాలూకు అనుభవాల పట్ల యీ మానవులెందుకింత పిరికివాళ్లయ్యారు? యేదో బాధలున్నాయని ఊహించుకొని– సూర: ఊహించుకొనటం కాదు. ఏవో బాధలు అనుభవించి– సూర్యం: యెంత తప్పు? సూర: యెంతమాత్రం కాదు. సూర్యం: ఆత్మహత్య దోషం కాదా? సూర: ఒక వేళ దోషమే అయితే, అది నాది కాదు. అంతకంటే మరొక దోవ లేకుండా చేసిన నా పరిస్థితులదే ఆ దోషమంతా. నాకూ జీవించాలనే వుంది. జీవితాన్ని అనుభవించాలనీ వుంది. సూర్యం: అబద్ధం. ఆ ఉద్దేశమున్నవాడెవడూ చావును కోరడు. సూర: నేను చావటానికి సిద్ధపడుతున్నానంటే, నేనెంత దారుణంగా కాలం వెళ్లదీస్తున్నానో ఆలోచించవే? సూర్యం: ఈ వాదన కమల వింటే, నీ పిరికితనాన్ని అసహ్యించుకొనేది. సూర: ఆ పేరెత్తవద్దని యిందాక చెప్పాను. ఇంకొకసారి యెత్తావంటే? అదేమిటి అలా వెళ్లిపోతావేం. సూర్యం: నేనెక్కడా అట్టేసేపుండలేను. సూర: ఇదిగో రా! రా! సూర్యం: కమల మీద నీకంత కోపమెందుకు సూరయ్యా! ఆమె చేసిన తప్పేమిటి? ప్రేమించటమా? ప్రేమించటమే మహానేరమయితే, తక్కిన నేరాలను దూషించటానికి భాష లేదే! సూర: యవనోన్మాదం, కాముకత్వం, శరీర వాంఛ ప్రేమ కాదు. అది పశుత్వం. సూర్యం: ఇవన్నీ కాని ఆ ప్రేమ కంటే వీటన్నిటితో కూడిన ఆ పశుత్వమే నేను కోరుతాను. సూర: ఈ భ్రమలోనేపడి, బంగారం వంటి మేనరికాన్ని కాదన్నావు. పెద్ద చదువు లేదు. డబ్బు లేదు. ‘ప్రేమ, ప్రేమ’ అంటూ బైరాగిలా తిరిగావు. నీ పని హాయిగానే గడిచిపోయింది. దాని ఫలితం నేనిప్పుడు అనుభవిస్తున్నాను. సూర్యం: అదృష్టవంతుడివి. ఆ జ్ఞాపకాలతో కలకాలం మధురంగా జీవించవచ్చు. సూర: ఛీఛీ యిప్పటికీ నీకు జ్ఞానం రాలేదు. సూర్యం: ఏమాత్రం అవకాశం లభించినా, ఇప్పుడైనాసరే, కమలతో నేనావిధంగానే ప్రవర్తిస్తాను. ఎందుకో నీ ముసలి హృదయానికి తెలీదు. దానికి రసికతను గ్రహించే శక్తి నశించిపోయింది. త్యాగంలోని ఆనందమేమిటో నీ వగ్గు హృదయానికి యెంత బోధించినా అర్థం కాదు. ఒకనాడు ∙∙ కమల: సూర్యం! యెందుకలా దిగులుగా వున్నావ్? సూర్యం: ఏమీలేదు. కమల: నిష్కారణంగా యెవరైనా దిగులుగా ఉంటారేమో నాకు తెలియదు. సూర్యం: ఉన్నా అది నువ్వు పరిష్కరించేది కాదు. కమల: అయితే, అది కారణం కాదు, సమస్యయి ఉంటుంది. సూర్యం: చెప్పటానికి సిగ్గుగా వుంది. మా నాన్న నాకు సంబంధం కుదిర్చాడుట. పెళ్లివారు గురువారం వస్తారుట. రమ్మని ఉత్తరం రాశాడు. కమల: నిక్షేపంగా వెళ్లి చూసిరండి. సూర్యం: వెళ్లిన తరువాత నేను కాదనటం, వారు ఔననటం... గొడవలు జరుగుతాయేమోనని భయపడుతున్నాను. కమల: అందుకని వెళ్లటం మానేస్తారా? సూర్యం: నీకోసమనే వెళ్లటం మానేస్తున్నాను. నేను వాళ్లకు నచ్చి, ఆ పిల్ల నాకు నచ్చి, పుటుక్కున లగ్నం స్థిరపడితే? కమల: నిశ్చయమే అయితే, నేను సంతోషిస్తాను సూర్యం. సూర్యం: అసూయ పడతావనుకొన్నాను, పెళ్లి చూపులకు వెళ్లవద్దంటా వనుకొన్నాను. కమల: నేను నిన్ను ప్రేమించినట్లే, మరొకరు గూడా నిన్ను ప్రేమించగూడదా? నువ్వా సంబంధం చేసుకొంటేనేగానీ సుఖపడని పక్షాన నిరభ్యంతరంగా చేసుకో. సూర్యం: యింత మంచి దాన్ని నిన్ను కాదని, మరొకరిని చేసుకోలేను. భగవంతుడు గూడా మెచ్చడు. కమల: మరి యిలానే వుండిపోతారా? సూర్యం: కమలను చేసుకొంటాను. కమల: కానీ కమల ఓ కులం లేనిదని మీకు తెలియదనుకొంటాను. సూర్యం: ఇంతకాలం పరిచయంలో ఈ విషయమన్నా తెలుసుకోలేని మందమతిని కాను. నా కోసం నువ్వంతటి త్యాగం– కమల: ఇందులో త్యాగమేముంది? అధవా వున్నా, అది మనకోసమే గానీ, మరొకడి కోసం గాదు. సూర్యం: నా విషయం మీ నాన్నగారికి తెలుసా? కమల: ఇది నా స్వవిషయం. సూర్యం: నీలాంటి అమూల్యవరాన్ని నేను పోగొట్టుకోలేను. ఈ ప్రపంచమంతా యేకమై కాదన్నా, నేను విడిచిపెట్టను కమలా. లోకంలో చాలామంది సూర్యములున్నారు. కానీ కమల మట్టుకు ఒక్కతే. నిన్ను నా హృదయంలో భద్రంగా దాచుకొంటాను. ∙∙ సూర్యం: చాలామంది నన్ను గురించి దుష్ప్రచారం చేశారు. నాన్నగారికి ఉత్తరాలు రాశారు. కమల యీ సంగతులేమీ పట్టించుకొనేది కాదు. ఎందుకైనా మంచిదని, నేనే బలవంతాన ఆ ఊరు వదిలేశాను. కొంతకాలం జీవితాన్ని మహోజ్వలంగా అనుభవించాను. నా జీవితంలో యెక్కడైనా ఉత్తమాధ్యాయం ఉంటే ఆ కొంత కాలమే. మిగతాది వట్టి పర్ర. సూర: అని నువ్వనుకొంటున్నావు. కానీ ఆ కొంతకాలమే నా బ్రతుకును తునాతునకలు చేసింది. ఆ చరిత్ర అందరికీ తెలిసింది. మేనమామ పిల్లనివ్వనని తెగేసి చెప్పాడు. యాభై వేల రూపాయల ఆస్తి చేజారిపోయింది. సూర్యం: నీ మాటలు బట్టి చూస్తుంటే– పెళ్లి చేసుకోవటమనేది, పిల్లను కాక, ఆ డబ్బునేమో ననిపిస్తుంది. సూర: అంత డబ్బే వుంటే, నాకీ బాధ లుండేవే కావు. తెలుసా? సూర్యం: ఈ బాధలు పడటానికైనా నేను వొప్పుకొంటాను గాని, ఆ పిల్లను మట్టుకు పెళ్లాడేందుకు ఒప్పుకోను. ఇష్టం లేని సంసారం వెలగబెట్టటం యెంతదోషమో నీకు తెలిసినట్టు లేదు. సూర: లక్షమంది దాన్ని అంగీకరిస్తారు. సూర్యం: పది లక్షలమంది అంగీకరించినా దోషం దోషమేకాని మరొకటి కాదు. సూర: ఈ తలబిరుసుతనమే నన్ను నిలువునా ఆర్పింది. ఇప్పటికైనా వదిలిపోవేం? సూర్యం: పిచ్చివాడా, నే నేనాడో పోయాను. నీ బాధంతా నేను నీ దగ్గర లేననే. అలా మూలమూలకు వొదిగినంత మాత్రాన, నాకు దూరం కాలేవు. నన్ను స్మరించుకుంటూ బ్రతకడం నేర్చుకుంటేగాని నీకు శాంతి లేదు. నేను వెడితే తిరిగి రాను. సూర: అయ్యో వెళ్లిపోయాడు. ఇదిగో నిన్నే ఉండు. సూర్యం: నేనెక్కడా అట్టేసేపుండనని చెప్పలా? సూర: ఇదేమిటి చల్లగా వుంది. చలేస్తుంది. హాయిగా కప్పుకుని పరుంటాను. సూర్యం: అదా అది నా నీడ. చల్లగా స్మరించుకుంటూ వెచ్చగా పడుకో. ► రావూరి భరద్వాజ కథ ఉభయ సంధ్యలు ఇది. ప్రచురణ: 1954. సౌజన్యం: కథానిలయం. భరద్వాజ (5 జూలై 1927 – 18అక్టోబర్ 2013) తెలుగులో జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన మూడో రచయిత. పెద్దగా చదువుకోకపోయినా స్వయంకృషితో ఎదిగినవారు. ఎన్నో రకాల అనుభవాలతో లోకాన్ని చదువుకున్నవారు. కథలు, నవలలు, నాటకాలు, రేడియో నాటకాలు, కవిత్వం, వ్యాసాలు, బాల సాహిత్యం, స్మృతి సాహిత్యం, శృంగార సాహిత్యం, అపరాధ పరిశోధన, ఇలా ఎన్నో ప్రక్రియల్లో విస్తారంగా రాశారు. జీవన సమరం, తెలుసుకుంటూ తెలుసుకుంటూ, పాకుడురాళ్లు ఆయన రచనల్లో విశిష్టమైనవి. -
పిల్లల పేర్ల కృతజ్ఞత
రావూరి భరద్వాజ (1927–2013) అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, రంపం లాగే పనివాడిగా, కొలిమి దగ్గర తిత్తులూదే కూలీగా, పేపర్ బాయ్‌గా ఎన్నో రకాల పనులు చేశారు. చదివింది ఏడవ తరగతే. పదిహేడో యేట మొదలుపెట్టి, కథానికలు, నవలలు, నవలికలు, కవితలు, వ్యాస సంపుటాలు, నాటికలు, స్మృతి సాహిత్యంతో కలిపి సుమారు 190 పుస్తకాలు రాశారు. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. ఆయన ప్రసిద్ధ నవల పాకుడు రాళ్లు. రావూరి తన ఇంటికి పెట్టుకున్న పేరు కాంతాలయం. ఆయన సహధర్మచారిణి కాంతం. కన్నబిడ్డలా చూసేది కాబట్టి భార్య అయినా ఆమెను ‘కాంతమ్మ’ అనే పిలిచేవారు. కష్ట సమయాల్లో అండగా నిలిచినవారికి రావూరి చూపిన కృతజ్ఞత గొప్పది. ఆయనకు అయిదుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వారికి పేర్లు ఎలా పెట్టారో ఆయన ఇలా చెప్పారు: ‘‘నాకు ప్రూఫ్‌రీడర్‌గా అవకాశం ఇచ్చిన ఆలపాటి రవీంద్రనాథ్ పేరును నా పెద్దకుమారుడికి రవీంద్రనాథ్‌గా పెట్టాను. ఆకాశవాణిలో ఉద్యోగం కల్పించిన త్రిపురనేని గోపీచంద్ పేరుని నా రెండోకొడుక్కి గోపీచంద్‌గా నామకరణం చేశాను. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని సమయంలో నాకూ నా కుటుంబానికీ ఉచితంగా వైద్యం చేసిన వైద్యుని పేరును నా మూడో కొడుక్కు బాలాజీగా పెట్టుకున్నాను. నా చిన్న కొడుక్కేమో మా నాన్న పేరు కలిసేలా కోటీశ్వరరావు అని నామకరణం చేశాను. మా తండ్రి పేరు కోటయ్య, తల్లి పేరు మల్లికాంబ. ఇక నా ఏకైక కుమార్తె పద్మ. ఆ పేరు వెనుక కూడా ఓ సంఘటన ఉంది. 1942–44 ప్రాంతంలో ఓ మూడు రోజుల పాటు అన్నంలేక నీరసించి స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడు పద్మక్క అనే ఆవిడ నాకు అన్నం పెట్టింది. ‘బాబూ, మాది మాల కులం మీరు తింటారా?’ అని అడిగింది. ‘అదేం లేదమ్మా తప్పకుండా తింటాను’ అని చెప్పాను. వెంటనే ఇంటికి తీసుకెళ్లి ఓ గిన్నెలో అన్నం వేసి, పులుసు పోసింది. ఆ పులుసులో ఓ చేప కనిపించింది. అప్పుడన్నాను ‘అమ్మా నేను మాంసాహారం తినను’ అని. అప్పుడు తన కొడుక్కు పెట్టిన గిన్నెను నాకు ఇచ్చి, అందులో పాలు పోసి ‘ఇంట్లో కనీసం బెల్లం కూడా లేకపోయెనే’ అని నొచ్చుకుంటూ కొంచెం ఉప్పు వేసి పెట్టింది. ఆమె ఆప్యాయతకు గుర్తుగా నా కూతురికి పద్మ అని పేరు పెట్టుకున్నాను’’. డాక్టర్ పోతిరెడ్డి చెన్నకేశవులు -
తుర్లపాటికి రావూరి భరద్వాజ స్మారక పురస్కారం
సాక్షి, విజయవాడ : సీనియర్ పాత్రికేయుడు, కాలమిస్ట్ నగరానికి చెందిన తుర్లపాటి కుటుంబరావును 2019 సంవత్సరానికి గానూ డాక్టర్ రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపిక చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ రావూరి వెంకట కోటేశ్వరరావు, రావూరి సాయిసుమంత్ మంగళవారం సాక్షికి వివరించారు. రావూరి కాంతమ్మ సంగీత సేవా పురస్కారానికి గుంటూరుకు చెందిన రామరాజు లక్ష్మీ శ్రీనివాస్‌కు ప్రదానం చేస్తునట్లు తెలిపారు. రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతీ ఏటా రావూరి భరద్వాజ, కాంతమ్మ పురస్కారాలను అందిస్తున్నట్లు తెలిపారు. 5వ తేదీ సాయంత్రం మెగల్రాజపురంలోని ది కల్చరల్ సెంటర్ ఆఫ్ అమరావ తి విజయవాడలో పురస్కార వీటిని అందచేస్తామని, కార్యక్రమానికి పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, చారిత్రక పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిలు పాల్గొంటారని వివరించారు. -
ఒక ‘డర్టీ’ నవల పాకుడు రాళ్లు
సినిమా అంటే బొమ్మ అని కూడా. సినిమా రంగం గురించిన బొమ్మ వైపే అత్యధికులు మాట్లాడుతారు. దాని బొరుసు ఎలాంటిది? అది ఎక్కించే ఎత్తు ఇట్టే తెలుస్తుంది; పడదోసే లోయ కనబడుతుందా? వెలుగు నీడల మిశ్రమమైన వెండితెర బతుకుల్లోని గడ్డ కట్టిన చీకటి గురించి కుండబద్దలు కొట్టిన నవల పాకుడురాళ్లు. రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ పురస్కారం తెచ్చిపెట్టిన రచన. ఇది మంజరిగా మారిన మంగమ్మ కథ. గుంటూరు దగ్గరి పల్లెటూరు నుంచి మద్రాసులో అగ్రతారగా వెలుగొందే వరకు చేసిన ప్రస్థానం, దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం, ఆ క్రమంలో ఆమె ఎక్కిన తివాచీ, తొక్కిన బురదను రచయిత సమర్థంగా చిత్రించారు. లాడ్జిలో దిగినప్పుడు ఇంకా మంగమ్మగానే ఉన్న మంజరి ఊరికే సర్వర్‌ను అలా ఉడికిస్తుంది. ‘‘అతను వెళ్ళిపోయాక, మంగమ్మ మంచం మీదపడి, పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకొంది. రాజామణి ఇంట్లో తనకు తటస్థపడ్డ మనిషిగానీ, ఈ సర్వర్గానీ, ఈ రాత్రి నిద్రపోతారన్న నమ్మకం ఆవిడకు లేదు. అందువల్ల తనకేం జరిగిందని కాదు; వాళ్ళు బాధపడితే తనకంతే చాలు.’’ నాటకాలకు రోజులు చెల్లుతున్న కాలంలో, సినిమా రంగం వేళ్లూనుకోవడమే కాకుండా, అది తెచ్చిపెడుతున్న వైభవం, పేరు, డబ్బుకు అందరి కళ్లూ మిరుమిట్లు గొలుపుతున్న కాలంలో– ముందు తటపటాయించినా నాటకాలను వదిలేసి రంగంలోకి దిగుతుంది మంజరి. మగవాళ్ల స్వభావం ఏమిటో తెలిసివున్నది కాబట్టి త్వరత్వరగా పైకి దూసుకెళ్తుంది. వేలకొద్దీ జనం ఆమెను చూడటానికి తహతహలాడతారు. బొంబాయి సముద్ర తీరంలో ఇల్లు కడుతుంది. కానీ ఎల్లకాలం రోజులు ఒకేలా ఉంటాయా? మాధవరావు, రామచంద్రం, చలపతి, కళ్యాణి, రాజన్, వసంత, శర్మ, తాయారు లాంటి ఎందరో మనుషుల్ని ఒరుసుకుని మంజరి జీవితం ప్రవహిస్తుంది. తమను ధిక్కరించిన మంజరిని తొక్కేయడానికి అవసరార్థం స్నేహం నటించే రెండు క్యాంపులుగా చీలిపోయిన అగ్రనటుల తీరు విస్తుగొలుపుతుంది. తెరవెనుక రాజకీయాలూ, రాసకార్యాలూ, ఎత్తులూ జిత్తులూ, స్నేహాలూ ద్రోహాలూ, పంతాలూ పట్టింపులూ అన్నీ ఇందులో ఉంటాయి. నీతిబాహ్యత, కల్మషం, నిలబడని బంధాలు మంజరిని చిత్తు చేస్తాయి. జీవితానికి సరైన అర్థం కనుక్కోలేక, తనేమిటో సరిగ్గా అంచనా వేసుకోలేక, నీలి చిత్రాలలో నటించే స్థాయికి కూడా దిగజారి, అవమానం తట్టుకోలేక, నిద్రమాత్రలు మింగి మంజరి ఆత్మహత్య చేసుకోవడంతో నవల ముగుస్తుంది. స్త్రీగా మంజరినీ, నటిగా మంజరినీ, మొత్తంగా మంజరితో కూడిన సినిమారంగపు స్వభావాన్నీ అర్థం చేసుకోవడానికి పనికొచ్చే నవల! -
రేడియో ఆయనకు మేలు చేసింది
నివాళి మరెందుచేతనో ఆయనకూ గుంటూరు శేషేంద్రశర్మగారికీ అంత పొసగేది కాదు. రావూరి భరద్వాజ హైదరాబాద్ స్టేషన్లో ఉన్నంతకాలం నేను అడుగు పెట్టను అని భీష్మించాడాయన. నా అదృష్టం ఇంకొకరికి లేదు. నేను ఇద్దరు జ్ఞానపీఠ అవార్డీలతో కలిసి, వారి పక్క సీట్లో కూచొని, ఉద్యోగం చేశాను. వారిలో ఒకరు అఖిలన్ గారు. మద్రాసు ఆలిండియా రేడియో కేంద్రంలో ఆయన సీటు నా సీటు పక్కపక్కనే. మరొకరు రావూరి భరద్వాజ. హైదరాబాద్ ఆలిండియా రేడియో కేంద్రంలో ఆయన సీటూ నా సీటూ పక్కపక్కనే. నేను 1977లో ఉద్యోగంలో చేరాను. అప్పటికే భరద్వాజగారు నా సీనియర్. నేను చేరిన వెంటనే నా పై అధికారి నాకు పరిచయం చేసిన మొట్టమొదటి కొలీగ్ భరద్వాజగారే. మొదటి పరిచయంలోనే ఆయన నాకు నచ్చారు. అంటే నచ్చేలా వ్యవహరించే గుణం ఏదో ఆయనలో ఉంది. భరద్వాజగారు మొదట ‘స్క్రిప్ట్ రైటర్’గా చేరినా ఆ తర్వాత ‘స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్’గా ఎక్కువ రోజులు పని చేశారు. అంటే ప్రసంగాలు, చర్చలు, ఇంటర్వ్యూలు, సాహిత్య కార్యక్రమాలు... ఇవన్నీ చూడాలి. చాలా ఒత్తిడి ఉండే పని అది. ఆ రోజుల్లో ఇప్పటిలా టీవీలూ విపరీత సంఖ్యలో చానల్సూ లేవు గనక- మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి, మా కవిత్వం రికార్డు చేయండి అని వెంటపడేవారు చాలామంది ఉన్నారు. వాళ్లతో భరద్వాజగారు ఓపికగా వేగడం నేను చూశాను. నాకు తెలిసి సుప్రసిద్ధ రాజకీయ నాయకులతో, స్వాతంత్య్ర సమరయోధులతో భరద్వాజగారు చేసినన్ని ఇంటర్వ్యూలు మరెవరూ చేయలేదు. అన్నీ గొప్ప గొప్ప ఇంటర్వ్యూలు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచార ప్రసంగాలను ప్రసారం చేయడం తప్పనిసరి. ఆ సమయంలో అందరు నాయకులూ ఒక్కలాగే వ్యవహరించరు కదా. పదాలు మార్చమంటే ఫలానా విషయం వద్దు అనంటే వినేవారు కాదు. అడ్డం తిరిగేవారు. ఇలాంటివారి ప్రసంగాన్ని రికార్డ్ చేయాలంటే ఒక్కటే విరుగుడు. భరద్వాజగారిని పిలవడమే. ఆయన వచ్చి చెప్తే- కాదు అనడానికి ఏమీ ఉండేది కాదు. ఆ విధంగా భరద్వాజగారు రేడియోకి చాలా మేలు చేశారు. ఆయన చేసిన మేలు, దాని నుంచి ఆయన పొందిన మేలు రెంటిలో ఏదీ తక్కువ కాదు. భరద్వాజగారు ఉద్యోగాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. టైమంటే టైమ్‌కే వచ్చేవారు. టైమ్ తర్వాతే వెళ్లేవారు. చాలా అరుదుగా లీవ్ పెట్టేవారు. అంతటి సిన్సియర్ను కూడా బాధించే సన్నివేశాలు తప్పలేదు. ఒకసారి ఒక స్టేషన్ డెరైక్టర్ అందరి ముందూ పట్టుకుని- ఆయన అంత పెద్ద రచయిత అనే సంగతి కూడా చూడకుండా- చెడామడా తిట్టేశాడు. భరద్వాజగారు ఎంత సున్నిత మనస్కులంటే వెంటనే గుండె పట్టుకొని కూలిపోయారు. హార్ట్ ఎటాక్. స్టేషన్ నుంచే హాస్పిటల్‌కు ఆగమేఘాల మీద తీసుకెళ్లాల్సి వచ్చింది. మరోసారి ఇలాగే మరో స్టేషన్ డెరైక్టర్ చాలా తీవ్రంగా తిట్టాడు. అంతేకాదు- సాయంత్రం కదా ఇప్పుడెవరూ లేరు. రేపు అందరి ముందూ నీ సంగతి తేలుస్తాను అన్నాడు. అయితే ఆ రాత్రే ఆ స్టేషన్ డెరైక్టర్ చనిపోయాడు. ఈ సంఘటనను భరద్వాజ ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. మనుషులు అన్నీ తమ చేతుల్లో ఉంటాయని మిడిసిపోవడం గురించి చెప్పి, అహంకారాన్ని వదిలి, ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని హితవు చెప్పేవారు. అప్పుడప్పుడు కొంటె పనులు కూడా చేసేవారు. ఒకాయన ఎప్పుడు రికార్డింగ్ జరిగినా ఓచర్ మీద సైన్ చేయాల్సి వచ్చినప్పుడు- రెవెన్యూ స్టాంప్‌కు అవసరమైన పదిపైసలో ఇరవై పైసలో ఇవ్వకుండా- నా దగ్గర వంద రూపాయలున్నాయి చిల్లరలేదు అని డబ్బు తీసుకొని వెళ్లిపోయేవాడు. ఒకసారి అదే మాట అన్నాడో లేదో భరద్వాజగారు అప్పటికే సిద్ధంగా ఉంచిన కవర్ ఆయన ముందుపెట్టారు. అందులో 99 రూపాయల ఎనభై పైసల చిల్లర ఉంది. వంద తీసుకొని అది ఇచ్చి పంపారు. మరెందుచేతనో ఆయనకూ గుంటూరు శేషేంద్రశర్మగారికీ అంత పొసగేది కాదు. రావూరి భరద్వాజ హైదరాబాద్ స్టేషన్లో ఉన్నంతకాలం నేను అడుగు పెట్టను అని భీష్మించాడాయన. శర్మగారి చివరి రోజుల్లో నేను ఈ విషయాన్ని గుర్తు చేసినప్పుడు- నేను అలా చేసి ఉండకూడదు అని పొరపాటు ఒప్పుకున్నారాయన. భరద్వాజగారికి చలం, కుటుంబరావు, ధనికొండ హనుమంతరావు గార్లంటే ఇష్టం. సినిమా రంగంలో ఆత్రేయ అంటే అభిమానం. తాను ఎంత ఉద్యోగ వత్తిడిలో ఉన్నా రాయడం మాత్రం మానేవారు కాదు. బహుశా ఆయన తెల్లవారే లేచి ఆఫీస్‌కు వచ్చేలోపు రాసేవారనుకుంటాను. అనుభవంలో లేనిది ఏదీ రాయకూడదు అనేవారు. ఒకసారి బొగ్గుగని కార్మికుల మీద కథ రాయడానికి బొగ్గుగనులకు వెళ్లి తలకు లైట్ వెలిగించుకుని బొగ్గు తట్టలు మోసి వచ్చానని నాతో చెప్పారు. అలాగే లారీ డ్రైవర్, క్లీనర్ల మీద కథ రాయడానికి ఒకసారి వాళ్లతో కలిసి చాలా దూరం ప్రయాణించి వచ్చానని కూడా చెప్పారు. ఇతర భాషల సాహిత్యంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉండేవారు. ఆ భాషల్లో వస్తున్న సాహిత్యాన్ని పరిచయం చేసే ‘భారత భారతి’ కార్యక్రమాన్ని ఆయనే నిర్వహించేవారు. ఆయనకు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల (ఏడు వరకే చదివారు) ఇంగ్లిష్ రాక ఉద్యోగపరమైన రాతకోతల కోసం కొంచెం అవస్థ పడేవారు. అప్పుడు వాడ్రేవు పురుషోత్తం వంటి మిత్రులు, నేను సాయం చేసేవాళ్లం. అలాంటి సమయాల్లో సోమర్సెట్మామ్ కథ ఒకటి గుర్తు చేసుకునేవారు. ఆ కథలో ఒక శ్రీమంతుడు. లేనిదంటూ లేదు. కాని చదువు రాదు. కనీసం సంతకం కూడా తెలియదు. ఒకసారి ఎవరో అంటారు- అంతా బాగనే ఉందికాని కనీసం సంతకం నేర్చుకునేంత చదువైనా చదువుకుని ఉంటే బాగుండేది అని. అప్పుడా శ్రీమంతుడు- ఆ చదువే వచ్చుంటే ఈసరికి చర్చ్‌లో బెల్స్ తుడిచే ఉద్యోగంలో ఉండేవాణ్ణే తప్ప ఇంత సంపాదించేవాణ్నా అంటారు. అది చెప్పి నవ్వేవారు. సరే మనకు డ్యాన్సు కూడా రాదు కదా ఏం చేద్దాం అనేవారు. కాని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భవించడానికి ఆయన ఒక స్ఫూర్తిగా నిలిచాడని చాలామంది చెప్పుకోరు. భవనం వెంకటరామ్ ఆయనా మిత్రులు. ఒకసారి అడిగారట ఏం చదివావ్ అని. చదువుకునే వీలు లేక ఏమీ చదువుకోలేదు అని చెప్పారట. నీలాంటి వాళ్ల కోసం చదువుకునే ఏర్పాటు చేయాలి అని భవనం చెప్పారట. అలా వచ్చిందే ఓపెన్ యూనివర్సిటీ. దాని ప్రారంభానికి జ్ఞానీ జైల్‌సింగ్ వచ్చి తన ప్రసంగంలో ఆ సంగతి ప్రస్తావిస్తే ప్రసార సమయంలో భరద్వాజ రేడియో ఉద్యోగి కనుక రేడియోలో భరద్వాజ పేరు రాకూడదనే నియమాన్ని పాటిస్తూ కట్ చేశాడో ప్రబుద్ధుడు. భరద్వాజగారు రేడియోతో తన అనుబంధాన్ని చాలా సెంటిమెంటల్‌గా తీసుకునేవారు. ఆయన నవంబర్ 11న ఉద్యోగంలో చేరారనుకుంటాను. అందువల్ల రిటైరయ్యాక కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 11న రేడియోకి వచ్చి, తిరిగి, అందరినీ పలకరించి, తృప్తి పడి వెళ్లేవారు. అలాంటి ఉద్యోగులు ఇవాళ ఎందరున్నారు. ఇచ్చిన పనిని ఎందరు గౌరవిస్తున్నారని? భరద్వాజ తన జీవితంలో చాలామంది నుంచి మేలు పొందారు. ఏదీ మర్చిపోలేదు. చాలామందికి మేలు చేశారు. అంతా మర్చిపోయారు. జీవితంలో ఆయన సంతోషం కంటే దుఃఖాన్నే ఎక్కువ చూశారనిపిస్తుంది. రెండు మూడు నెలల వ్యవధిలో ముగ్గురు సంతానాన్ని పోగొట్టుకున్న తండ్రి వేదన ఎవరికి తెలుస్తుంది? ఆయనకు ఏ మేలు జరిగినా నేను చాలా సంతోషించేవాణ్ని. జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు ఒక సామాన్యుడు సాధించదగ్గ అతి పెద్ద విజయంగా నాకు అనిపించింది. ఇప్పుడు ఆయన లేరు. కాని సాధించవచ్చు అని సంకల్పించినవారికి ఒక స్ఫూర్తిగా నిలిచిపోయారు కదా. - పి.ఎస్.గోపాలకృష్ణ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం పూర్వ సంచాలకులు -
రావూరికి ఘన నివాళి
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజకు తెలుగు సాహితీ జగత్తు ఘనంగా నివాళులర్పించింది. ఆఖరి దాకా అక్షర సేద్యం చేసిన ఆ మహనీయుడికి కన్నీటితో తుది వీడ్కోలు పలికింది. భరద్వాజ మృతితో విజయనగర్ కాలనీలోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం ఉదయం నుంచే పలువురు ప్రముఖులు తరలివచ్చి రావూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వీఐపీల రాకతో స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. నిత్యం మనతో పాటు ఉండే వ్యక్తికి ఇంత ఆదరణ ఉందా? సాదాసీదాగా ఉండే పెద్దాయనపై ఇంత అభిమానం ఉందా? అని చర్చించుకోవడం కనిపించింది. నిత్యం హడావుడిగా ఉండే వారంతా తమ పనులన్నీ పక్కనబెట్టి ఉదయం నుంచి అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. రావూరి ఆకస్మిక మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలుగు వర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.గోపి, సాహితీవేత్త డా.ద్వా.నా.శాస్త్రి, డా.పోతుకూచి సాంబశివరావు, గానసభ అధ్యక్షుడు కళాదీక్షితులు, సాధన నరసింహచార్య, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బసవపున్నయ్య, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య తదితరులు సంతాపం ప్రకటించారు. కాంతమ్మను చేరిన భరద్వాజ విజయనగర కాలనీలోని తన నివాసం నుంచి ఆరోగ్యం సహకరించిన ప్రతిరోజూ నడచి వెళ్లి దివంగత ‘కాంతమ్మ’తో సంభాషించి వచ్చేవారు రావూరి భరద్వాజ. ఆరోజు విశేషాలన్నీ ఆమె సమాధి వద్ద చెప్పుకునేవారు. శనివారం మధ్యాహ్నం ఆయన ప్రభుత్వ లాంఛనాలతో చివరిసారిగా వెళ్లారు. 1986లో నేలతల్లి ఒడికి చేరిన కాంతమ్మ పక్కనే ఆయన భౌతికకాయాన్ని సంప్రదాయ విధానంలో ఖననం చేశారు. ఏ బడా ఆద్మీ రోజ్ ఆతే థే, అప్నే బీబీసే బాత్ కర్తే థే’ (ఈ పెద్దాయన రోజూ వచ్చేవారు. భార్యతో మాట్లాడేవారు) అని శ్మశానవాటికలోని ఒక మహిళ కన్నీరు పెట్టింది. పేదవాడైన తనను వివాహమాడి, తన నగానట్రాను కుటుంబావసరాలకోసం చిరునవ్వుతో ఇచ్చిన కాంతమ్మ అంటే రావూరికి ఆరాధన. ‘శ్రీమతి రావూరి కాంతమ్మ భరద్వాజ ట్రస్ట్’ ద్వారా ఐదు విశ్వవిద్యాలయాలలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందే ఏర్పాటు చేసిన వితరణశీలి భరద్వాజ! -
అక్షర యోధుడికి అంతిమ వీడ్కోలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: అక్షర యోధుడికి అభిమాన సంద్రం నీరాజనాలు పలికింది. సాహితీ క్షేత్రంలో మేరునగధీరుడై వెలుగొందిన రచయిత, పాత్రికేయుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజకు శనివారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనేక మంది ప్రముఖులు, సాహితీవేత్తలు, అభిమానులు రావూరిని కడసారి సందర్శించి నివాళులర్పించారు. బతుకంతా అక్షరమై వరద గోదారులు సృష్టించిన సాహితీమూర్తికి తెలుగు ప్రపంచం వీడ్కోలు పలికింది. తొలుత హైదరాబాద్‌లోని విజయ్‌నగర్ కాలనీలోని భరద్వాజ నివాసం నుంచి హుమాయూన్‌నగర్ దేవునికుంట హిందూ శ్మశాన వాటిక వరకు ఆయన అంతిమయాత్రకు అభిమానులు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా స్వయంగా భరద్వాజ అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. అనంతరం భరద్వాజ కుమారులు గోపీచంద్, కోటేశ్వర్రావు, కుటుంబసభ్యుల అశ్రునయనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పరామర్శల వెల్లువ... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొణతాల రామకృష్ణ, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సోమయాజులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ నాయకుడు నారాయణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సహా పలువురు ప్రముఖులు హాజరై భరద్వాజ భౌతికకాయానికి నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రి వట్టి వసంతకుమార్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఆకాశవాణి అదనపు డెరైక్టర్ డాక్టర్ పి.జె.సుధాకర్, సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డెరైక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్, ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, విశాలాంధ్ర సంపాదకులు శ్రీనివాస్‌రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ కవి అంద్శై దైవజ్ఞ శర్మ, లక్ష్మీపార్వతి, బీజేపీ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, గుదిబండి వెంకటరెడ్డి తదితరులు వారిలో ఉన్నారు. -
'రావూరి' అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం విజయ్‌నగర్ కాలనీలో హిందూ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని సమాధి చేశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో భరద్వాజ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు విజయ్‌నగర్ కాలనీలో స్వగృహంలో వైఎస్సార్సీపీ నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులులుతో పాటు పలువరు ప్రముఖులు భరద్వాజ భౌతిక కాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు.అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రావూరి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రావూరి మృతి సాహిత్యలోకానికి తీరనిలోటు : ప్రముఖులు
-
అనారోగ్యంతో కన్నుమూసిన రావూరి భరద్వాజ
-
మధ్యాహ్నం 'రావూరి' అంత్యక్రియాలు
హైదరాబాద్ : నవలా రచయిత, సాహితీవేత్త జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం జరగనున్నాయి. విజయనగర్ కాలనీలోని స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రావూరి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. రావూరి భరద్వాజ రాసిన 'పాకుడురాళ్లు' నవలకు 2012లో జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. -
బతుకు పాఠాల మూట రావూరి
విజయవాడ, న్యూస్‌లైన్ : బతుకు నేర్పిన పాఠాలను మూట కట్టుకుని రచయితగా ఎదిగిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ (86) శుక్రవారం హైదరాబాదులో కన్నుమూశారు. తనకు ఎంతోమంది గురువులున్నా, దరిద్రం-ఆకలి-అవమానాలే ప్రధానమైన గురువులని చెప్పుకొనేవారాయన. జిల్లాలోని కంచికచర్ల మండలం మోగలూరులో 1927 జూలై 5న తన అమ్మమ్మగారి ఇంటి వద్ద ఆయన జన్మించారు. 8వ తరగతితోనే చదువుకు స్వస్తి పలికారు. తరగతి గదిలో ఆయనకు జరిగిన అవమానమే అందుకు కారణం. ఆయన తన జీవితంలో బతుకు నేర్పిన పాఠాలను, ఒక్కొక్కటిగా విప్పుతూ జీవనయానాన్ని సాగించారు. 19 నవలలు, 10 నాటకాలు రాసిన రావూరి జమీన్ రైతు పత్రికలో జర్నలిస్టుగా, ఆకాశవాణి కేంద్రంలోను పనిచేశారు. జర్నలిస్ట్‌గా, రచయితగా, ఆకాశవాణిలో పనిచేసినా సామాన్యుల కోసమే ఆయన రచనలు చేశారు. సామాన్యులకు కూడా అర్థమైన భాషలో రాసిన రావూరికి ఆలస్యంగానైనా జ్ఞానపీఠ్ అవార్డ్ రావడం సాహిత్యప్రియులను సంతోషపరిచింది. సాహిత్యపరంగా ఆయనకు జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలైన ముగ్గురిలో విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డి కవులు కాగా, రావూరి మౌలికంగా వచనా రచయిత కావటం విశేషం. రావూరి మృతి తీరని లోటు కంచికచర్ల రూరల్ : ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ మృతి తీరని లోటని మోగులూరు గ్రామానికి చెందిన రావూరి మేనల్లుడు మోగులూరి ఆదినారాయణ, గ్రామస్తులు బండి మల్లిఖార్జునరావు, బండి కోటేశ్వరరావు, బండి జానకిరామయ్య, షేక్ హుస్సేన్‌లు పేర్కొన్నారు. మోగులూరి చినశేషయ్య కుమార్తెకు పుట్టిన భరద్వాజ పదేళ్ల పాటు ఇదే గ్రామంలో ఉన్నారని, అనంతరం గుంటూరు జిల్లా తాటికొండలో తన తండ్రి స్వస్థలంలో స్థిరనివాసం ఉన్నారని వివరించారు. -
రావూరి భరద్వాజ కన్నుమూత
హైదరాబాద్: నవలా రచయిత, సాహితీవేత్త జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ(86) కన్నుమూశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి 8.35 గంటలకు ఆయన కన్నుమూశారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం ఈనెల 14న ఆస్పత్రిలో చేర్చారు. ఇటీవలే ఆయన జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణరెడ్డి తర్వాత జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న తెలుగు రచయితగా ఖ్యాతికెక్కారు. ఆయన రాసిన పాకుడురాళ్లు నవలకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. సుమారు 170పైగా కథలు, నవలలు రాశారు. కృష్ణా జిల్లా మొగలూరులో 1927, జూలై 5న రావూరి భరద్వాజ జన్మించారు. పేదరికం కారణంగా ఆయన ఏడో తరగతి వరకే చదువుకున్నారు. 17 ఏటనే కలం పట్టారు. కాదంబరి, పాకుడురాళ్లు ఆయనకు పేరు తెచ్చిన నవలలు. ఎవరూ స్పృశించని అంశాలపై రచన చేయడం భరద్వాజ ప్రత్యేకత. 1987 వరకు ఆల్ ఇండియా రేడియో పనిచేశారు. ఆయన రాసిన జీవనసమరం పుస్తకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. -
తెలుగు సాహిత్య నిధి రావూరి
సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ప్రశంస భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: నవలా రచరుుత, సాహితీవేత్త రావూరి భరద్వాజ తెలుగు సాహిత్యానికి నిధివంటి వారని ప్రముఖ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ప్రశంసించారు. సాహిత్యం, సంగీతం సముద్రం లాంటివని, రావూరివంటి గొప్ప సాహితీ వేత్తకు అవార్డు అందజేయడం తనకు ఎంతో గర్వకారణవుని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో తీన్‌మూర్తి భవన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రవుంలో రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డును అంజద్ అలీఖాన్ అందజేశారు. అస్వస్థులైన భర ద్వాజ అతికష్టంమీద చక్రాల కుర్చీలో.. అవార్డు ప్రదానానికి హాజరయ్యారు. భారతీయ సాహిత్యంలో రావూరి ప్రస్థానం ఎంతో గొప్పదని వక్తలు ఈ సందర్భంగా కీర్తించారు. తమాషాకు అంటున్నారనుకున్నా.. అనారోగ్యం కారణంగా రావూరి భరద్వాజ మాట్లాడలేకపోవడంతో ఆయన ప్రసంగ పాఠాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయుం హిందీ విభాగం అధిపతి శేషారత్నం చదివి వినిపించారు.‘మనం కేవలం ఇతరులకు ఆదర్శాల గురించి చెప్పడమే కాదు. వాటిని పాటించాలి. జీవితంలో నేను పూర్తిగా అనుసరించాను. అదే నమ్మకంతో జీవితంలో కొద్దికొద్దిగా ఎదిగాను. పేద కుటుంబంలో పుట్టి, ఉన్నత చదువులులేని నేను ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటూనే జీవితంలో ముందుకెళుతూ వచ్చాను. ఈ రోజు మీ అందరి ముందు కూర్చోగలిగాను. నాకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిందని ఎవరో ఫోన్లో చెబితే నమ్మలేదు. తమాషాకోసం చెబుతున్నారనుకున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో పురస్కారాలు ఎలా వస్తున్నాయో అందరికీ తెలుసు. నా రచనలు ఎవరు ఇంత దూరం పంపుతారు. ఎవరికి నా రచనల గురించి తెలుస్తుందనుకున్నా. కానీ ఎలాంటి సిఫారసు చేయకుండానే, నా రచనలకు ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిందంటే ఎంతో సంతోషంగా ఉంది. దీంతో నా జీవితం ధన్యమైంది. జ్ఞానపీఠ్ అవార్డు సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రచనలను సమీక్షచేసి మీ ముందుంచిన పట్నాల.సుధాకర్‌కి సైతం నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.’ అని భరధ్వాజ తన ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు. పలువురు సాహిత్య అభివూనులతో పాటు రావూరి కుటుంబ సభ్యులు అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. -
రావూరికి డాక్టరేట్ ప్రదానం