![Opinion, Pakudu Rallu Novel Has A Dirty Story - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/16/pakudurallu.jpg.webp?itok=7BUzvEwI)
సినిమా అంటే బొమ్మ అని కూడా. సినిమా రంగం గురించిన బొమ్మ వైపే అత్యధికులు మాట్లాడుతారు. దాని బొరుసు ఎలాంటిది? అది ఎక్కించే ఎత్తు ఇట్టే తెలుస్తుంది; పడదోసే లోయ కనబడుతుందా? వెలుగు నీడల మిశ్రమమైన వెండితెర బతుకుల్లోని గడ్డ కట్టిన చీకటి గురించి కుండబద్దలు కొట్టిన నవల పాకుడురాళ్లు. రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ పురస్కారం తెచ్చిపెట్టిన రచన.
ఇది మంజరిగా మారిన మంగమ్మ కథ. గుంటూరు దగ్గరి పల్లెటూరు నుంచి మద్రాసులో అగ్రతారగా వెలుగొందే వరకు చేసిన ప్రస్థానం, దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం, ఆ క్రమంలో ఆమె ఎక్కిన తివాచీ, తొక్కిన బురదను రచయిత సమర్థంగా చిత్రించారు.
లాడ్జిలో దిగినప్పుడు ఇంకా మంగమ్మగానే ఉన్న మంజరి ఊరికే సర్వర్‌ను అలా ఉడికిస్తుంది. ‘‘అతను వెళ్ళిపోయాక, మంగమ్మ మంచం మీదపడి, పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకొంది. రాజామణి ఇంట్లో తనకు తటస్థపడ్డ మనిషిగానీ, ఈ సర్వర్‌గానీ, ఈ రాత్రి నిద్రపోతారన్న నమ్మకం ఆవిడకు లేదు. అందువల్ల తనకేం జరిగిందని కాదు; వాళ్ళు బాధపడితే తనకంతే చాలు.’’
నాటకాలకు రోజులు చెల్లుతున్న కాలంలో, సినిమా రంగం వేళ్లూనుకోవడమే కాకుండా, అది తెచ్చిపెడుతున్న వైభవం, పేరు, డబ్బుకు అందరి కళ్లూ మిరుమిట్లు గొలుపుతున్న కాలంలో– ముందు తటపటాయించినా నాటకాలను వదిలేసి రంగంలోకి దిగుతుంది మంజరి. మగవాళ్ల స్వభావం ఏమిటో తెలిసివున్నది కాబట్టి త్వరత్వరగా పైకి దూసుకెళ్తుంది. వేలకొద్దీ జనం ఆమెను చూడటానికి తహతహలాడతారు. బొంబాయి సముద్ర తీరంలో ఇల్లు కడుతుంది. కానీ ఎల్లకాలం రోజులు ఒకేలా ఉంటాయా?
మాధవరావు, రామచంద్రం, చలపతి, కళ్యాణి, రాజన్, వసంత, శర్మ, తాయారు లాంటి ఎందరో మనుషుల్ని ఒరుసుకుని మంజరి జీవితం ప్రవహిస్తుంది. తమను ధిక్కరించిన మంజరిని తొక్కేయడానికి అవసరార్థం స్నేహం నటించే రెండు క్యాంపులుగా చీలిపోయిన అగ్రనటుల తీరు విస్తుగొలుపుతుంది.
తెరవెనుక రాజకీయాలూ, రాసకార్యాలూ, ఎత్తులూ జిత్తులూ, స్నేహాలూ ద్రోహాలూ, పంతాలూ పట్టింపులూ అన్నీ ఇందులో ఉంటాయి. నీతిబాహ్యత, కల్మషం, నిలబడని బంధాలు మంజరిని చిత్తు చేస్తాయి. జీవితానికి సరైన అర్థం కనుక్కోలేక, తనేమిటో సరిగ్గా అంచనా వేసుకోలేక, నీలి చిత్రాలలో నటించే స్థాయికి కూడా దిగజారి, అవమానం తట్టుకోలేక, నిద్రమాత్రలు మింగి మంజరి ఆత్మహత్య చేసుకోవడంతో నవల ముగుస్తుంది. స్త్రీగా మంజరినీ, నటిగా మంజరినీ, మొత్తంగా మంజరితో కూడిన సినిమారంగపు స్వభావాన్నీ అర్థం చేసుకోవడానికి పనికొచ్చే నవల!
Comments
Please login to add a commentAdd a comment