తెలుగు సాహిత్య నిధి రావూరి
సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ప్రశంస
భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: నవలా రచరుుత, సాహితీవేత్త రావూరి భరద్వాజ తెలుగు సాహిత్యానికి నిధివంటి వారని ప్రముఖ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీఖాన్ ప్రశంసించారు. సాహిత్యం, సంగీతం సముద్రం లాంటివని, రావూరివంటి గొప్ప సాహితీ వేత్తకు అవార్డు అందజేయడం తనకు ఎంతో గర్వకారణవుని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో తీన్‌మూర్తి భవన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రవుంలో రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డును అంజద్ అలీఖాన్ అందజేశారు. అస్వస్థులైన భర ద్వాజ అతికష్టంమీద చక్రాల కుర్చీలో.. అవార్డు ప్రదానానికి హాజరయ్యారు. భారతీయ సాహిత్యంలో రావూరి ప్రస్థానం ఎంతో గొప్పదని వక్తలు ఈ సందర్భంగా కీర్తించారు.
తమాషాకు అంటున్నారనుకున్నా..
అనారోగ్యం కారణంగా రావూరి భరద్వాజ మాట్లాడలేకపోవడంతో ఆయన ప్రసంగ పాఠాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయుం హిందీ విభాగం అధిపతి శేషారత్నం చదివి వినిపించారు.‘మనం కేవలం ఇతరులకు ఆదర్శాల గురించి చెప్పడమే కాదు. వాటిని పాటించాలి. జీవితంలో నేను పూర్తిగా అనుసరించాను. అదే నమ్మకంతో జీవితంలో కొద్దికొద్దిగా ఎదిగాను. పేద కుటుంబంలో పుట్టి, ఉన్నత చదువులులేని నేను ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటూనే జీవితంలో ముందుకెళుతూ వచ్చాను. ఈ రోజు మీ అందరి ముందు కూర్చోగలిగాను. నాకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిందని ఎవరో ఫోన్‌లో చెబితే నమ్మలేదు. తమాషాకోసం చెబుతున్నారనుకున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో పురస్కారాలు ఎలా వస్తున్నాయో అందరికీ తెలుసు. నా రచనలు ఎవరు ఇంత దూరం పంపుతారు. ఎవరికి నా రచనల గురించి తెలుస్తుందనుకున్నా. కానీ ఎలాంటి సిఫారసు చేయకుండానే, నా రచనలకు ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిందంటే ఎంతో సంతోషంగా ఉంది. దీంతో నా జీవితం ధన్యమైంది. జ్ఞానపీఠ్ అవార్డు సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రచనలను సమీక్షచేసి మీ ముందుంచిన పట్నాల.సుధాకర్‌కి సైతం నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.’ అని భరధ్వాజ తన ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు. పలువురు సాహిత్య అభివూనులతో పాటు రావూరి కుటుంబ సభ్యులు అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.