సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజకు తెలుగు సాహితీ జగత్తు ఘనంగా నివాళులర్పించింది. ఆఖరి దాకా అక్షర సేద్యం చేసిన ఆ మహనీయుడికి కన్నీటితో తుది వీడ్కోలు పలికింది. భరద్వాజ మృతితో విజయనగర్ కాలనీలోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం ఉదయం నుంచే పలువురు ప్రముఖులు తరలివచ్చి రావూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వీఐపీల రాకతో స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
నిత్యం మనతో పాటు ఉండే వ్యక్తికి ఇంత ఆదరణ ఉందా? సాదాసీదాగా ఉండే పెద్దాయనపై ఇంత అభిమానం ఉందా? అని చర్చించుకోవడం కనిపించింది. నిత్యం హడావుడిగా ఉండే వారంతా తమ పనులన్నీ పక్కనబెట్టి ఉదయం నుంచి అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. రావూరి ఆకస్మిక మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలుగు వర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.గోపి, సాహితీవేత్త డా.ద్వా.నా.శాస్త్రి, డా.పోతుకూచి సాంబశివరావు, గానసభ అధ్యక్షుడు కళాదీక్షితులు, సాధన నరసింహచార్య, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బసవపున్నయ్య, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య తదితరులు సంతాపం ప్రకటించారు.
కాంతమ్మను చేరిన భరద్వాజ
విజయనగర కాలనీలోని తన నివాసం నుంచి ఆరోగ్యం సహకరించిన ప్రతిరోజూ నడచి వెళ్లి దివంగత ‘కాంతమ్మ’తో సంభాషించి వచ్చేవారు రావూరి భరద్వాజ. ఆరోజు విశేషాలన్నీ ఆమె సమాధి వద్ద చెప్పుకునేవారు. శనివారం మధ్యాహ్నం ఆయన ప్రభుత్వ లాంఛనాలతో చివరిసారిగా వెళ్లారు. 1986లో నేలతల్లి ఒడికి చేరిన కాంతమ్మ పక్కనే ఆయన భౌతికకాయాన్ని సంప్రదాయ విధానంలో ఖననం చేశారు.
ఏ బడా ఆద్మీ రోజ్ ఆతే థే, అప్నే బీబీసే బాత్ కర్‌తే థే’ (ఈ పెద్దాయన రోజూ వచ్చేవారు. భార్యతో మాట్లాడేవారు) అని శ్మశానవాటికలోని ఒక మహిళ కన్నీరు పెట్టింది. పేదవాడైన తనను వివాహమాడి, తన నగానట్రాను కుటుంబావసరాలకోసం చిరునవ్వుతో ఇచ్చిన కాంతమ్మ అంటే రావూరికి ఆరాధన. ‘శ్రీమతి రావూరి కాంతమ్మ భరద్వాజ ట్రస్ట్’ ద్వారా ఐదు విశ్వవిద్యాలయాలలో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందే ఏర్పాటు చేసిన వితరణశీలి భరద్వాజ!
రావూరికి ఘన నివాళి
Published Sun, Oct 20 2013 4:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement
Advertisement